డాన్ లీతో టాలీవుడ్ హీరో త‌రుణ్‌

తెలుగు బుల్లితెర‌పై బాల‌న‌టుడిగా నిరూపించుకుని, 2000లో `నువ్వే కావాలి` చిత్రంతో క‌థానాయ‌కుడు అయ్యాడు త‌రుణ్‌.;

Update: 2025-07-01 16:28 GMT

తెలుగు బుల్లితెర‌పై బాల‌న‌టుడిగా నిరూపించుకుని, 2000లో `నువ్వే కావాలి` చిత్రంతో క‌థానాయ‌కుడు అయ్యాడు త‌రుణ్‌. కెరీర్ లో 35 సినిమాల్లో నటించిన త‌రుణ్ 4 తమిళంలో, 2 మలయాళంలో మిగిలినవి తెలుగులో చేసాడు. 1990లో వచ్చిన `మనసు మమత` బాల‌నటుడిగా ఆరంగేట్ర చిత్రం. తొలి చిత్రంతోనే త‌న‌ నటనకు నంది అవార్డును గెలుచుకున్నాడు. 1990లో `అంజలి` చిత్రానికి గాను ఉత్తమ బాలనటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా అందుకున్నారు. నువ్వే కావాలి, ప్రియ‌మైన నీకు చిత్రాల‌తో ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న త‌రుణ్ ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించాడు. తరుణ్ సినీ కుటుంబానికి చెందిన వాడు. తండ్రి ఎస్ చక్రపాణి -తల్లి రోజా రమణి న‌టులుగా రాణించారు. అందుకే త‌ర‌ణ్ ఎల్లప్పుడూ ప్ర‌తిభావంతుడైన‌ నటుడిగా నిరూపించుకునేందుకు అంత‌గా శ్ర‌మించ‌లేదు.

కానీ కొన్ని ఊహించ‌ని కార‌ణాలతో త‌రుణ్ కెరీర్ ప‌రంగా వెన‌క‌బ‌డ్డాడు. ఒకానొక ద‌శ‌లో స‌రైన స‌క్సెస్ లేక‌, అవ‌కాశాల్లేక ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నాడు. అయితే కంబ్యాక్ కోసం చాలా ప్ర‌య‌త్నించిన త‌రుణ్ కి ఆశించినది ల‌భించ‌లేదు. చాలా గ్యాప్ త‌ర్వాత 2018లో `ఇది నా ల‌వ్ స్టోరి` అనే చిత్రంలో న‌టించాడు. అంత‌కుముందు 2014లో యుద్ధం, వేట అనే రెండు చిత్రాలలోను న‌టించాడు. కానీ ఇవేవీ అత‌డికి బ్రేక్ నివ్వ‌లేదు. ప్ర‌స్తుతం అత‌డు సొంత వ్యాపారాల్లో బిజీగా ఉన్నాడు.

త‌రుణ్ ప్ర‌స్తుతం అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో విహార యాత్ర‌లో ఉన్నాడు. అక్క‌డ‌ దక్షిణ కొరియా స్టార్ హీరో డాన్ లీతో ఫోటో దిగి దానిని సోష‌ల్ మీడియాలో షేర్ చేసాడు. ప్రభాస్ -సందీప్ రెడ్డి వంగా `స్పిరిట్`లో డాన్ లీ నటిస్తారనే ప్ర‌చారం జరుగుతోంది. అయితే దర్శకనిర్మాత‌లు దీనిని అధికారికంగా ప్రకటించలేదు. ట్రైన్ టు బుసాన్, ది అవుట్‌లాస్, ది గ్యాంగ్‌స్టర్, ది కాప్, ది డెవిల్ స‌హా ప‌లు భారీ బ్లాక్ బస్ట‌ర్ చిత్రాల్లో డాన్ లీ న‌టించారు.

Tags:    

Similar News