తెలంగాణ నటుడు అదరగొట్టిన ఆంధ్రాస్లాంగ్!
తాజాగా ఈ జాబితాలోకి దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ చేరాడు. తెలంగాణ ప్రాంతానికి చెందిన తరుణ్ భాస్కర్ కి ఇక్కడ స్లాంగ్ మాట్లాడం ఈజీ.;
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రాంతానికి చెందిన నటులు మరో ప్రాంతపు యాసను పలకడం అనేది గొప్ప కళ. గతంలో కోస్తాంధ్రకు చెందిన కోట శ్రీనివాసరావు గారు తెలంగాణ మాండలికాన్ని ఎంతలా ఓన్ చేసుకున్నారో మనకు తెలిసిందే. దశాబ్దాల కాలం పాటు హైదరాబాద్‌లోనే నివసించిన ఆయన, ఇక్కడి భాషను నిశితంగా గమనించి వెండితెరపై అద్భుతాలు చేశారు. అదే బాటలో రాయలసీమ యాస అంటే జయప్రకాశ్ రెడ్డి గారే గుర్తుకువచ్చేలా ఆయన తన ముద్ర వేశారు. అప్పట్లో ఇలాంటి ప్రయోగాలు ప్రతినాయకులు .. క్యారెక్టర్ ఆర్టిస్టులకే మాత్రమే పరిమితమయ్యేవి.
రాష్ట్ర విభజన తర్వాత తెలుగు సినిమాల్లో భాషా పరమైన అడ్డంకులు తొలగిపోయాయి. తెలంగాణ యాస అయినా, రాయలసీమ మాండలికమైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కొంత కాలంగా స్టార్ హీరోలు సైతం విభిన్న ప్రాంతాల స్లాంగ్‌ను పలకడానికి ఆసక్తి చూపుతున్నారు. `దూకుడు`లో మహేష్ తెలంగాణ స్లాంగ్ తో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు. మహేష్ ను చూసి మరికొంత మందిస్టార్లు అదే స్లాంగ్ లో అలరించే ప్రయత్నం చేసారు. అలాగే `గుంటూరు కారం`లో సైతం మహేష్ `గుంటూరు స్లాంగ్` లో అలరించే ప్రయత్నం చేసారు. `పుష్ప` లో బన్నీ సైతం చిత్తూరు మాండలీకంలో అదరగొట్టాడు.
ఇలా కథ, పాత్రలను బట్టి హీరోలు ఇట్టే మౌల్డ్ అవుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ చేరాడు. తెలంగాణ ప్రాంతానికి చెందిన తరుణ్ భాస్కర్ కి ఇక్కడ స్లాంగ్ మాట్లాడం ఈజీ. ఆ తరహా ఎలాంటి పాత్రలోనైనా సులభంగా పరకాయ ప్రవేశం చేయగలడు. తాను డైరెక్టర్ గా సక్సెస్ అవ్వడానికి కారణం కూడా ఆ మాండలీకం వలనే. నటుడిగా కూడా అదే స్లాంగ్ అతడికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. తాజాగా తరుణ్ భాస్కర్ నటిస్తోన్న `ఓం శాంతి శాంతి శాంతిహీ` ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో గోదారి యాసలో తరుణ్ భాస్కర్ ఆకట్టుకున్నాడు.
మధ్యలో ఉత్తరాంధ్ర వైజాగ్ స్లాంగ్ తోనూ అదరగొట్టాడు. తరుణ్ ఆంధ్రా స్లాంగ్ చూసి తెలంగాణ నటుడు ఇంత పర్ఫెక్ట్‌గా ఆ యాసను ఎలా పలికాడు? అంటూ అంతా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టివ్ విషయం లీకైంది. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన `మంగళవారం` సినిమా కోసం ఒక పాట చేస్తున్న సమయంలో తరుణ్ భాస్కర్‌కు ఈ యాసతో తొలి పరిచయం ఏర్పడింది. అప్పుడు కలిగిన ఆసక్తితో, ఆ ప్రాంతపు భాషను నిశితంగా గమనించి తాజా సినిమాలో ప్రయోగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ డైలాగ్ డెలివరీనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.