నానా పటేకర్ మృతి ఒక డ్రామా..ఆయన విదేశాలకు పారిపోయారు: తనుశ్రీ దత్తా సంచలన ఆరోపణలు --

నానా ప‌టేక‌ర్ మ‌ర‌ణానంత‌రం అత‌డు చస్తూ చస్తూ కూడా నన్ను ఇబ్బంది పెడుతూనే పోయాడు అని త‌నూశ్రీ తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు.

Update: 2026-10-15 03:59 GMT

నటి తనుశ్రీ దత్తా ప్రముఖ నటుడు నానా పాటేకర్ మృతి.. ఆయన అంత్యక్రియల సమయంపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు. బాలీవుడ్ వ్య‌క్తులు కానీ.. హిందీ మీడియా కానీ అస‌లు నానా పార్థీవ దేహాన్ని కళ్ళారా చూడలేదని తనుశ్రీ ఆరోపించారు.

అర్ధరాత్రి దాటాక 11:28 గంటలకు అత్యవసరంగా అంత్యక్రియలు నిర్వహించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టపరమైన చిక్కుల నుంచి.. కేసుల నుంచి తప్పించుకోవడానికే ఈ నాటకం ఆడి ఉండవచ్చని ఆమె ఆరోపించారు. అక్టోబర్ 8వ తేదీన 75 ఏళ్ల వయసులో గుండెపోటుతో నానా పాటేకర్ మృతి చెందినట్లు వార్తలు వచ్చినప్పటి నుంచి తనుశ్రీ దత్తా వరుసగా వివాదాస్పద ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.

త‌నూశ్రీ సోష‌ల్ మీడియాలో మాట్లాడుతూ.. అస‌లు నానా ప‌టేక‌ర్ కోసం సంస్మ‌ర‌ణ స‌భ‌లు జ‌ర‌గ‌క‌పోవ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. హిందీ మీడియా కానీ ప్ర‌ముఖులు కానీ ఎందుకు సంస్మ‌ర‌ణ స‌భ‌లు నిర్వ‌హించ‌లేద‌ని ప్ర‌శ్నించారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు నిర్వహించరని.. కానీ నానా పాటేకర్ అంత్యక్రియలు మాత్రం అక్టోబర్ 8వ తేదీ రాత్రి 11:28 గంటలకు పూణే సమీపంలోని డోంజే గ్రామంలో ఉన్న ఫామ్‌హౌస్‌లో జరిగాయని గుర్తుచేశారు. అంత రాత్రి అంధకారంలో అంత్యక్రియలు జరపాల్సినంత తొందర ఏముంది? అసలు వారి కుటుంబ సభ్యులు కూడా ఆయన ముఖాన్ని సరిగ్గా చూశారా? అని తనుశ్రీ ప్రశ్నించారు.

ఆసుపత్రికి తరలించిన వీడియోలు, ఫోటోలు ఎక్కడ?

ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఆసుపత్రికి సంబంధించిన ప్రక్రియలపై కూడా త‌నూశ్రీ ర‌క‌ర‌కాల సందేహాలు వ్యక్తం చేశారు. ``ఆయనకు గతంలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి.. కానీ నానా పాటేక‌ర్‌ను ఆసుపత్రికి తరలించడం.. అక్కడ ఆయన మృతి చెందినట్లు ప్రకటించడం.. పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎలాంటి ఒక్క వీడియో లేదా ఫోటో కూడా బయటకు రాలేదు! అని అన్నారు. అంత్యక్రియల సమయంలో ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచడం వల్ల‌నే అసలు నిజం ఎవరికీ తెలియకుండా చేశారని ఆరోపించారు.

విదేశాలలో సజీవంగా ఉన్నారంటూ వాదన, డీఎన్ఏ టెస్ట్ చేయాలి:

అంత్యక్రియలు నిర్వహించిన శరీరం నానా పాటేకర్ కీ కాదని తనుశ్రీ దత్తా సంచలన వాదన వినిపించారు. చట్టపరమైన కేసులు, పోలీసు విచారణల నుంచి తప్పించుకోవడానికి ఒక నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి ఉండవచ్చని.. అత‌డు ప్రస్తుతం సింగపూర్ లేదా మలేషియాలో సజీవంగా ఉండవచ్చని త‌నూశ్రీ ఆరోపించారు. ఈ వ్యవహారంపై డీఎన్ఏ పరీక్ష జరపాలని డిమాండ్ చేశారు.

మీటూ ఉద్యమంతో ప్రారంభమైన వివాదం..

తనుశ్రీ దత్తా - నానా పాటేకర్ మధ్య వివాదం 2008 నుంచి కొనసాగుతోంది. `హార్న్ ఓకే ప్లీజ్` సినిమా షూటింగ్ సమయంలో తనపై నానా పాటేకర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తనుశ్రీ ఆరోపించారు. 2018లో భారతదేశంలో `మీటూ` ఉద్యమం ఊపందుకున్నప్పుడు ఈ ఉదంతం మళ్ళీ తెరపైకి వచ్చింది.

ఆ సమయంలో తనుశ్రీ తరఫు న్యాయవాది ముంబైలోని ఓషివారా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తూ నానా పాటేకర్, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, నిర్మాత సామి సిద్ధిఖీ, డైరెక్టర్ రాకేష్ సారంగ్‌లపై నార్కో-అనాలిసిస్ .. లై-డిటెక్టర్ టెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే 2019 జూన్‌లో పోలీసులు దర్యాప్తు జరిపి నానా ప‌టేకర్‌కు క్లీన్ చిట్ ఇచ్చారు.

2024లో ఓ ప్రముఖ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనుశ్రీ తనపై తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు మీకు కోపం రాలేదా? అని నానా పాటేేకర్‌ను ప్రశ్నించారు. దీనిపై నానా బదులిస్తూ, ``ఇది అబద్ధం అయినప్పుడు కోపం ఎందుకు వస్తుంది? ఇప్పుడు జరిగిపోయిన విషయాల గురించి నేను మాట్లాడి ఏం ప్రయోజనం? నాకు ఎలాంటి కోపం రాలేదు. ఒక చిన్న పాప లేదా పిల్ల వచ్చి ఎవరైనా మాతో అసభ్యంగా ప్రవర్తించారని చెబితే..అసలు నిజంగా అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఎలాంటి తప్పు జరగనప్పుడు..అసలు విషయమే లేనప్పుడు మేము ఏం చెప్పగలం? నిజంగా ఏదైనా జరిగి ఉంటే మేమే సమాధానం చెప్పేవాళ్లం కదా? మేము ఎలాంటి తప్పు చేయలేదు.. దీనికి మించి మేం ఏం చెప్పగలం?`` అని స్పష్టం చేశారు.

నానా ప‌టేక‌ర్ మ‌ర‌ణానంత‌రం అత‌డు చస్తూ చస్తూ కూడా నన్ను ఇబ్బంది పెడుతూనే పోయాడు అని త‌నూశ్రీ తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. ఈవిల్ (దుష్టశక్తి) చనిపోయాడు.. ఇక నా జీవితం గాడిలో పడుతుంది! అని త‌నూశ్రీ దూషణ‌ను బ‌య‌ట‌పెట్టారు.

బాలీవుడ్ దిగ్గజ నటుడు నానా పాటేకర్ గురువారం ఉదయం 75 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన మృతితో బాలీవుడ్, సౌత్ సినిమా పరిశ్రమతో పాటు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒకవైపు అందరూ సంతాపం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు గుప్పించిన నటి తనుశ్రీ దత్తా మాత్రం ఆయనను `ఈవిల్` (దుష్టశక్తి) అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News