ఇండియన్ 3.. మళ్ళీ శంకర్ ముందున్న చిక్కులివే!

రెండేళ్లుగా ఎలాంటి సౌండ్ లేకుండా ఉన్న 'ఇండియన్ 3' ప్రాజెక్ట్ సడెన్ గా మళ్లీ కదిలింది.

Update: 2026-10-15 03:59 GMT

రెండేళ్లుగా ఎలాంటి సౌండ్ లేకుండా ఉన్న 'ఇండియన్ 3' ప్రాజెక్ట్ సడెన్ గా మళ్లీ కదిలింది. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో ఆగిపోయిన పనులను మళ్లీ మొదలుపెడుతున్నట్లు లైకా ప్రొడక్షన్స్ అనౌన్స్ చేస్తూ 'వార్ మోడ్' అంటూ ఒక పోస్టర్ వదిలింది. అయితే సినిమాను పూర్తి చేయడం ఒక ఎత్తైతే, దాన్ని ప్రేక్షకులకు ఎలా అందించాలనే విషయంలోనే ఇప్పుడు అసలైన గందరగోళం నడుస్తోంది. ఒకవైపు థియేట్రికల్ రిలీజ్, మరోవైపు డైరెక్ట్ ఓటీటీ అంటూ వినిపిస్తున్న పరస్పర విరుద్ధమైన వార్తలు ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

నిజానికి 'ఇండియన్ 2' రిలీజ్ కు ముందే శంకర్ చాలా పెద్ద ప్లానింగే వేశారు. రెండు భాగాల షూటింగ్ ఒకేసారి లాగించేసి, రెండో పార్ట్ ఎండింగ్ లో మూడో భాగానికి అదిరిపోయే గ్లింప్స్ కూడా వదిలారు. జస్ట్ ఆరు నెలల గ్యాప్ లోనే సేనాపతిని మళ్లీ దించేయాలని స్కెచ్ వేశారు. కానీ 2024 లో వచ్చిన రెండో భాగం బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ట్రోలింగ్ ను, డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకోవడంతో ఆ ప్లాన్స్ అన్నీ తలకిందులయ్యాయి. బయ్యర్లకు భారీ నష్టాలు రావడంతో మూడో పార్ట్ అటకెక్కిందనే ప్రచారం జరిగింది.

ఇప్పుడున్న పరిస్థితి చూస్తే 'ఇండియన్ 3'ని కొత్తగా తీయాల్సిన అవసరమైతే లేదు. ఇప్పటికే దాదాపు షూటింగ్ ఎప్పుడో పూర్తయిపోయింది. కొంత బ్యాలెన్స్ భాగాన్ని కంప్లీట్ చేయడంతో పాటు, ఫీడ్ బ్యాక్ ను దృష్టిలో పెట్టుకుని కొన్ని సీన్లను మార్చే ఆలోచనలో ఉన్నారట. ముఖ్యంగా సేనాపతి గతం, ఆయన తండ్రి పాత్ర చుట్టూ తిరిగే పీరియాడిక్ ఎపిసోడ్స్ ఈ కథలో మెయిన్ హైలైట్ అని చెబుతున్నారు. అయితే ఈ కొత్త సీన్ల కోసం మళ్లీ ఎన్ని కాల్షీట్లు అవసరమో, గ్రాఫిక్స్ కు ఎంత సమయం పడుతుందో ఇంకా స్పష్టత లేదు.

అసలైన ట్విస్ట్ రిలీజ్ డేట్ల దగ్గరే మొదలవుతోంది. కొందరు వచ్చే సంక్రాంతి బరిలోనే సినిమా ఉంటుందని ప్రచారం చేస్తుంటే, మరికొందరేమో మార్చి లేదా ఏప్రిల్ లో రీషూట్లు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ మార్చిలో రీషూట్లే జరిగితే జనవరి రిలీజ్ ఎలా సాధ్యమనే ప్రాక్టికల్ లాజిక్ ఇక్కడ మిస్సవుతోంది. వీటన్నింటికీ మించి థియేటర్ల జోలికి వెళ్లకుండా సైలెంట్ గా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేసేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు మరో వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.

ఒకవేళ థియేటర్లలో రిలీజ్ చేయాలనుకుంటే మిగిలిన షూట్, వీఎఫ్ఎక్స్, ప్రమోషన్ల కోసం మళ్లీ కోట్లు కుమ్మరించాల్సి ఉంటుంది. పార్ట్ 2 దెబ్బ తిన్న తర్వాత ఆడియన్స్ ను మళ్లీ థియేటర్ల దాకా రప్పించడం అంత ఈజీ టాస్క్ కాదు. బయ్యర్లు కూడా గత ఫలితాన్ని చూసి ఆచితూచి వ్యవహరించే అవకాశముంది. అలాగని కమల్, శంకర్ లాంటి భారీ కాంబో చిత్రాన్ని కేవలం డిజిటల్ స్క్రీన్లకే పరిమితం చేయడం లైకా లాంటి నిర్మాణ సంస్థకు అంత సులువైన నిర్ణయం కాదు.

దర్శకుడు శంకర్ తన నెక్స్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'వేల్పారి' వైపు అడుగులు వేయాలని చూస్తున్న తరుణంలో.. ఈ పెండింగ్ సినిమాను త్వరగా క్లియర్ చేసుకోవాల్సిన ఒత్తిడి ఆయనపై ఉంది. లైకా టీమ్ వార్ మోడ్ అంటూ ఊదరగొడుతున్నా, రిలీజ్ డేట్ పై గానీ, ఓటీటీ డీల్ పై గానీ ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ క్లారిటీ ఇవ్వలేదు. మరి ఈ సేనాపతి చిక్కుముడిని శంకర్ థియేటర్లలో విప్పుతారా లేక ఓటీటీకి అప్పగించి చేతులు దులుపుకుంటారా అన్నది చూడాలి.

Tags:    

Similar News