పల్లెటూరి మట్టివాసన సహజత్వం ఉన్న చిత్రమిది: దర్శకుడు బోయపాటి ప్రశంసలు
పల్లె నేపథ్యంలోని కథలు వెండితెరపై అద్భుతాలు సృష్టిస్తున్నాయని వ్యాఖ్యానించారు టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీను.
పల్లె నేపథ్యంలోని కథలు వెండితెరపై అద్భుతాలు సృష్టిస్తున్నాయని వ్యాఖ్యానించారు టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన ఇటీవల `క్రేజీ కళ్యాణం` చిత్ర బారాత్ ప్రమోషనల్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొని తన మనసులోని మాటలను షేర్ చేసారు. దసరా పండుగ సందర్భంగా చిత్ర యూనిట్కు, మీడియా మిత్రులకు ముందుగా విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బోయపాటి ఈ సినిమా చిన్నదా, పెద్దదా అని తాను ఆలోచించలేదని.. కేవలం స్నేహం కోసం ఎంత దూరమైనా వస్తానని పేర్కొంటూ తన ప్రత్యేకమైన చొరవను ఈ వేదికపై చాటుకున్నారు.
సినిమా టీజర్- ట్రైలర్లను చూసిన వెంటనే తనకు కలిగిన అనుభూతిని వివరిస్తూ బోయపాటి ఒక చక్కటి ప్రోత్సాహాన్ని అందించారు. మనం కారులో పల్లెటూరు వైపు వెళుతూ ఏసీ ఆపేసి కిటికీ అద్దాలు దించి గాలి పీల్చుకుంటే ఆ మట్టి వాసన, పైరు వాసన ఎలా వస్తుందో.. ఈ సినిమా టీజర్ చూస్తే సరిగ్గా అలాంటి అద్భుతమైన నేచురల్ ఫీలింగ్ కలిగిందని అన్నారు. నేటి బిజీ డిజిటల్ జీవితాల మధ్య పల్లెటూర్లలోని కుటుంబాల నడుమ జరిగే సహజమైన, అందమైన భావోద్వేగాలను ఈ చిత్రం చాలా చక్కగా ప్రతిబింబిస్తోందని ఆయన కొనియాడారు.
ఈ చిత్రంలో నటించిన సీనియర్ నరేష్ను ఆయన `సీనియర్` కాదు.. ఒక `సిన్సియర్ నరేష్` అని అభివర్ణించారు. సినిమా కోసం ఏ కష్టమైనా పడే ఆయన తపనను ప్రశంసిస్తూ..గతంలో వచ్చిన `కొంగుచాటు కృష్ణుడు` (మీనా కథానాయిక) సినిమాను గుర్తుచేశారు. ఈ చిత్రంలో ఆయన పాత్రలోని వేరియేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. అలాగే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటన గురించి మాట్లాడుతూ.. ఆమె ఏమాత్రం కృత్రిమంగా నటించకుండా అచ్చం మన పక్క ఇళ్లలో ఉండే అమ్మాయిలాగే అత్యంత సహజంగా నటించిందని.. ప్రతి ఒక్కరూ తన పాత్రతో రిలేట్ చేసుకోగలరని చెప్పారు.
నేటి తరపు యువతను ఉద్దేశించి బోయపాటి వ్యాఖ్యలు ఈ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ రోజుల్లో జెన్-జీ' యువత బయటికి ఎవరికీ కనెక్ట్ కానట్లే కనిపిస్తారని.. కానీ ఒక్కసారి వాళ్ళు కనెక్ట్ అయ్యారంటే మాత్రం వారి అంత జిడ్డుగా అంటిపెట్టుకుని ఉండేవాళ్ళు మరొకరు ఉండరని చమత్కరించారు. తరుణ్ భాస్కర్, అఖిల్, కిరీటి వంటి నటుల ద్వారా ఈ తరహా పాత్రలను సినిమాలో ఎంతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారని.. ఇది సినిమాకి పెద్ద ప్లస్ అవుతుందని పేర్కొన్నారు.
చివరగా ఈ చిత్రంలోని కలర్ ప్యాలెట్, మ్యూజిక్, ఫ్రేమింగ్, కామెడీ అన్నీ చాలా అద్భుతంగా కుదిరాయని బోయపాటి ప్రశంసించారు. అంకితభావంతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుని పెద్ద విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. ఈ దసరాకు వస్తున్న మిగతా సినిమాలతో పాటు ఈ సినిమా కూడా ఘన విజయం సాధించి.. పరిశ్రమకు ఎంతో మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, నరేశ్ విజయకృష్ణ, అఖిల్ రాజ్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన `క్రేజీ కళ్యాణం` గ్రామీణ తెలంగాణ నేపథ్యంలో సాగే ఒక ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్. భద్రప్ప గాజుల దర్శకత్వంలో, బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. పల్లెటూరి వాతావరణం, సరదా సన్నివేశాలు, కుటుంబ భావోద్వేగాలు, పెళ్లిళ్ల సందడితో నిండిన ఈ చిత్రం అక్టోబర్ 16 న పంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.