ఈ యూట్యూబర్ వీడియోలతో సంపాదించిన ఆస్తి అక్షరాల రూ.665 కోట్లు

ఒకప్పుడు డబ్బు సంపాదించాలంటే వ్యాపారం చేయడం, ఉద్యోగం చేయడం లేదా ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్లు చేయడం వంటి కొన్ని పరిమిత మార్గాలే ఉండేవి.;

Update: 2025-10-05 07:11 GMT

ఒకప్పుడు డబ్బు సంపాదించాలంటే వ్యాపారం చేయడం, ఉద్యోగం చేయడం లేదా ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్లు చేయడం వంటి కొన్ని పరిమిత మార్గాలే ఉండేవి. అయితే సోషల్ మీడియా యుగం మొదలైన తర్వాత, ఆ మార్గాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు మొబైల్ ఫోన్‌లో కెమెరా, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. ప్రతిభ, ఆలోచన, కష్టపడి పనిచేయాలనే తపన ఉంటే కోట్లను సంపాదించడం కూడా సాధ్యమే.

ఈ నేపథ్యంలో యూట్యూబ్ అనేది కోట్లాది మందికి ఆదాయ వనరుగా మారింది. వినోదం, టెక్నాలజీ, రాజకీయాలు, స్పోర్ట్స్, వంటకాలు, ట్రావెల్ ఏ విభాగం అయినా సరే, కంటెంట్ విభిన్నంగా ఉంటే విజయవంతం కావడం ఖాయం. ఇప్పుడు అలా యూట్యూబ్ ద్వారా అక్షరాలా ₹665 కోట్ల సంపదను కూడబెట్టిన ఓ భారతీయుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాడు.

ఆయన మరెవరో కాదు, ప్రముఖ కమెడియన్ , కంటెంట్ క్రియేటర్ తన్మయ్ భట్. మిస్టర్ జార్ (Mr. Zaar) సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, భారతదేశంలో అత్యంత సంపన్న యూట్యూబర్‌గా తన్మయ్ భట్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆయన సొంత ఆస్తుల మొత్తం విలువ ₹665 కోట్లుగా అంచనా వేయబడింది.

తన్మయ్ భట్ యూట్యూబ్‌లో ఫన్నీ, సెటైరికల్ వీడియోలతో ప్రసిద్ధి పొందాడు. ఆయన వీడియోల కంటెంట్ విభిన్నంగా ఉండటం, సమకాలీన అంశాలను వినోదాత్మకంగా ప్రెజెంట్ చేయడం వల్ల కోట్లాది మంది అభిమానులను సంపాదించగలిగాడు. ప్రస్తుతం ఆయనకు 50 లక్షలకుపైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

ఈ జాబితాలో రెండో స్థానంలో టెక్నికల్ గురూజీ (గౌరవ్ చౌదరి) ఉన్నాడు. ఇతడి ఆస్తుల విలువ ₹356 కోట్లు. మూడవ స్థానంలో సమయ్ రైనా ₹140 కోట్లతో, నాల్గవ స్థానంలో క్యారీ మీనాటి ₹131 కోట్లతో, ఐదవ స్థానంలో బీబీ కీ వైన్‌స్ ₹122 కోట్లతో నిలిచారు. అలాగే అమిత్ బదన ₹80 కోట్లు, ట్రిగ్గర్డ్ ఇన్సాన్ ₹65 కోట్లు, ధృవ్ రాఠీ ₹60 కోట్లతో తరువాతి స్థానాల్లో ఉన్నారు.

ఈ యూట్యూబర్లు తమ కంటెంట్ ద్వారా కేవలం వినోదం కలిగించడం మాత్రమే కాకుండా సామాజిక అంశాలు, టెక్నాలజీ అవగాహన, రాజకీయ విశ్లేషణలు, విద్యా చర్చలు వంటి అనేక విభాగాల్లో ప్రజలకు విలువైన సమాచారం అందిస్తున్నారు.

గమనించదగ్గ విషయం ఏమిటంటే యూట్యూబ్‌లో అత్యధిక ఆదాయం సాధిస్తున్నవారిలో టెక్నికల్ , స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్లు ముందంజలో ఉన్నారు. రాజకీయ లేదా సామాజిక అంశాలపై కంటెంట్ సృష్టించే వారికి కూడా మంచి ఆదాయం ఉన్నప్పటికీ, విభిన్నమైన, వినోదాత్మకమైన కంటెంట్ రూపొందించే వారికి ప్రజల ఆదరణ మరింతగా లభిస్తోంది.

యూట్యూబ్ ద్వారా వచ్చిన ఈ ఆదాయాన్ని చాలామంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడానికి, సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు.

డిజిటల్ యుగంలో కేవలం ఆలోచన, కంటెంట్ క్రియేటివిటీ, కష్టపడి పనిచేసే తపన ఉంటే యూట్యూబ్ కూడా కోట్లకు దారితీసే బంగారు బాటగా మారిందని ఈ ఉదాహరణ మరోసారి నిరూపిస్తోంది.

Full View
Tags:    

Similar News