మొత్తానికి భరణి కోరిక నెరవేరింది!
రీసెంట్ గా జరిగిన థగ్ లైఫ్ ఈవెంట్ లో తనికెళ్ల భరణి అలాంటి ఓ సిట్యుయేషన్ ను షేర్ చేసుకున్నారు.;
అనుకున్నవన్నీ జరిగితే అది జీవితమెందుకు అవుతుంది అని పెద్దలు ఊరికే అనలేదు. సినీ ఇండస్ట్రీలో అయితే అలాంటి ఊహించని ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. ఒకరు చేయాలనుకున్న సినిమాలు మరొకరు చేయడం, అన్నీ ఓకే అనుకున్న తర్వాత సినిమాలు ఆగిపోవడం, ఒకరు చేస్తే బావుండేదనుకునే పాత్ర మరొకరు చేయడం ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి.
రీసెంట్ గా జరిగిన థగ్ లైఫ్ ఈవెంట్ లో తనికెళ్ల భరణి అలాంటి ఓ సిట్యుయేషన్ ను షేర్ చేసుకున్నారు. 1991లో ఆయనకు రజినీకాంత్- మణిరత్నం కాంబినేషన్ మూవీలో ఓ అవకాశం తలుపు తట్టినట్టే తట్టి, తీరా ఆడిషన్, లుక్ టెస్ట్ అయ్యాక వయసు సరిపోదని అతన్ని వెనక్కి పంపించేయడంతో తీవ్ర నిరాశ చెందిన భరణి, మరో ఛాన్స్ రాకపోతుందా అని ఎదురుచూశారు.
ఈ సంఘటన జరిగి ఎన్నో ఏళ్లవుతున్నా భరణి కోరిక మాత్రం కలలానే మిగిలిపోయింది. మూడు దశాబ్దాల తర్వాత మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ తెలుగు స్క్రిప్ట్ కు ఆయనతో కలిసి వర్క్ చేసే ఛాన్స్ భరణికి వచ్చింది. దొరికిందే ఛాన్స్ అని భరణి తనకు తర్వాతి సినిమాలో ఓ చిన్న షాట్లో కనిపించే అవకాశం ఇవ్వమని మణిరత్నంను అడిగారట.
దానికి మణిరత్నం అప్పుడు కేవలం చిన్నగా నవ్వి సైలెంట్ అయపోయారని, తర్వాత థగ్ లైఫ్ సినిమాలో క్యారెక్టర్ ఉందని పిలిచారని చెప్పారు. ఒక చిన్న సీన్ చాలనుకుని అవకాశం అడిగిన భరణికి థగ్ లైఫ్ లో చాలా మంచి క్యారెక్టర్ తో పాటూ మంచి నిడివి కూడా దక్కిందంటున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా భరణి కన్న కల తీరిపోయింది. అయితే ఈ సందర్భంగా భరణి తాను మిస్ అయిన సినిమా పేరు చెప్పలేదు కానీ రజినీ- మణిరత్నం కాంబోలో సినిమా అన్నారు. వారిద్దరి కాంబోలో వచ్చింది దళపతి అనే సినిమా మాత్రమే. మొత్తానికి భరణికి దళపతి సినిమా ద్వారా మిస్ అయిన అవకాశం ఇప్పుడు థగ్ లైఫ్ ద్వారా దక్కింది. అందుకే అంటారు ఇండస్ట్రీలో ఎప్పుడు ఎటు నుంచి ఎలా అవకాశాలొస్తాయో ఎవరూ చెప్పలేమని. భారీ అంచనాలతో వస్తోన్న థగ్ లైఫ్ మీద కమల్ చాలానే అంచనాలు పెట్టుకోవడంతో పాటూ ఈ సినిమా గతంలో తను మణిరత్నంతో చేసిన నాయకన్ కంటే బాగా వచ్చిందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.