హీరోలు జోక్యం చేసుకుంటే బూతులు తిడతా!
టాలీవుడ్‌లో మళ్లీ యాక్టివ్‌గా మారిన సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా నిర్మిస్తున్న కొత్త సినిమా వదలా ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.;
టాలీవుడ్‌లో మళ్లీ యాక్టివ్‌గా మారిన సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా నిర్మిస్తున్న కొత్త సినిమా వదలా ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. మిస్టరీ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, ప్రధాన పాత్రల్లో జగపతి బాబు, లయ జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆ టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. గ్రిప్పింగ్ నేరేషన్, విజువల్ టోన్, టెక్నికల్ స్టాండర్డ్స్ అన్నీ కలిసి ఈ ప్రాజెక్ట్‌ను ఒక సీరియస్ కంటెండర్‌గా నిలబెడుతున్నాయి.
ఈ నేపథ్యంలో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తన 50 ఏళ్ల సినీ ప్రయాణంలో హీరోలు షూటింగ్ లేదా ఇతర అంశాల్లో అతిగా జోక్యం చేసుకుంటే తనకు తీవ్ర అసహనం కలుగుతుందని, కొన్నిసార్లు బూతులు తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన స్పష్టంగా చెప్పారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని వెల్లడించారు. ముఖ్యంగా జగపతి బాబు వ్యవహరించిన తీరు తనను ఆశ్చర్యపరిచిందని, ఒక నటుడు ఇంత సమగ్రంగా, కట్టుబాటుతో ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ అవ్వగలడా అనే స్థాయిలో ఆయన పని చేశారని కొనియాడారు. ఈ సినిమా ఈ స్థాయిలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం ఆయనే అన్న ఆయన అన్నారు.
టెక్నికల్ టీమ్ పనితీరుపై కూడా భరద్వాజ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు గురించి మాట్లాడుతూ, ఆయనను దుర్మార్గుడంటూ సరదాగా వ్యాఖ్యానించారు. కానీ ఆ పదం వెనుక ఉన్న భావం మాత్రం పూర్తిగా ప్రశంసలతో నిండి ఉంది. పని విషయంలో చోటా దుర్మార్గుడని, అతని పనితనం, ఆ అవుట్‌పుట్ చూస్తే మతి పోయిందని, ఆ స్థాయిలో క్వాలిటీ ఇచ్చాడని ఆయన చెప్పడం ద్వారా విజువల్ ప్రెజెంటేషన్‌పై టీమ్ ఎంత శ్రద్ధ పెట్టిందో అర్థమవుతోంది. ఇదే సమయంలో ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గురించి కూడా ప్రస్తావిస్తూ, గత కొన్ని రోజులుగా ఆయన నిద్ర లేకుండా పని చేశారని, మొత్తం టీమ్ డెడికేషన్ అసాధారణమని వివరించారు.
ఈ సినిమా నిర్మాణం వెనుక ఉన్న కష్టాన్ని వివరించే క్రమంలో, “జగపతి బాబు, చోటా కె నాయుడు, కోటగిరి వెంకటేశ్వరరావు.. నెల రోజుల నుంచి నిద్రపోలేదని, వాళ్లతో పాటూ తనను కూడా నిద్రపోనీయలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాజెక్ట్‌పై ఉన్న ప్యాషన్‌ను ప్రతిబింబిస్తున్నాయి. చాలా కాలం తర్వాత తాను నిర్మించిన ఈ సినిమా తనకు ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని కూడా తెలిపారు.
ఇక టీజర్ విషయానికి వస్తే, మిస్టరీ థ్రిల్లర్‌కు అవసరమైన సస్పెన్స్, టెన్షన్ ఎలిమెంట్స్ బలంగా కనిపిస్తున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్, ఎడిటింగ్ అన్నీ కలిసి టీజర్ కు ఒక ఇంటెన్స్ ఫీల్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా జగపతి బాబు పాత్రలో కనిపిస్తున్న గ్రావిటీ, లయ రీ ఎంట్రీ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. మొత్తంగా చూస్తే, అనుభవజ్ఞులైన టెక్నీషియన్స్, డెడికేటెడ్ నటీనటులు కలిసి రూపొందించిన ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ ఏర్పడింది. అయితే టీజర్ స్థాయిలో కనిపించిన ఈ హైప్‌ను సినిమా కూడా కొనసాగిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికర ప్రశ్నగా మారింది.