తమన్నాకు పెద్ద షాక్.. మద్రాసు హైకోర్టు ఏం చెప్పిందంటే?
సౌత్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియాకు మద్రాస్ హైకోర్టులో తాజాగా షాక్ తగిలింది.;
సౌత్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియాకు మద్రాస్ హైకోర్టులో తాజాగా షాక్ తగిలింది. తన పర్మిషన్ లేకుండా ఫోటోలు కమర్షియల్ యాడ్స్ కోసం వినియోగించారంటూ వేసిన రూ.1 కోటి పరిహారం పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం, సరైన ఆధారాలు చూపలేకపోయారని పేర్కొంటూ ఆమె అప్పీల్ ను రిజెక్ట్ చేసింది.
వివరాల్లోకి వెళితే.. 2008లో పవర్ సోప్స్ లిమిటెడ్ అనే సబ్బుల తయారీ సంస్థతో తమన్నా ఒక యాడ్స్ అగ్రిమెంట్ ను కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఆమె చిత్రాలను ఆ సంస్థ ప్రొడక్టులు ప్రచారం చేసుకోవడానికి ప్రచారానికి ఒక ఏడాది పాటు మాత్రమే వినియోగించుకోవడానికి అనుమతి ఉంది. ఈ గడువు అక్టోబర్ 2009తో ముగిసింది.
అయితే, ఒప్పందం ముగిసిన తర్వాత కూడా 2010 నవంబర్ నుంచి 2011 ఫిబ్రవరి మధ్యకాలంలో తన ఫోటోలను సబ్బు ర్యాపర్లు, బ్యానర్లు, పోస్టర్ పై అక్రమంగా వాడుకున్నారని తమన్నా ఆరోపించారు. దీనివల్ల తనకు ఆర్థిక నష్టం కలిగిందని, ప్రతిష్ఠకు భంగం కలిగిందని చెబుతూ 2011లో సివిల్ కోర్టును ఆశ్రయించారు. సంస్థ నుంచి రూ. కోటి పరిహారం ఇప్పించాలని ఆమె కోరారు.
ఆ కేసు విచారణలో భాగంగా, గతంలో 2017లో ఒక సింగిల్ జడ్జి తమన్నా వాదనలను తిరస్కరించారు. సంస్థపై ఆరోపణలు నిరూపించడానికి ఆధారాలు లేవని అప్పట్లోనే కోర్టు స్పష్టం చేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ తమన్నా అప్పీల్ దాఖలు చేశారు. ఆ అప్పీల్‌పై విచారణ జరిపిన జస్టిస్ పి. వేల్ మురుగన్, జస్టిస్ కె. గోవిందరాజన్ తిలకవతి ధర్మాసనం 2026 ఏప్రిల్ 16న తుది తీర్పు వెలువరించింది.
ఒప్పందం గడువు ముగిసిన తర్వాత కూడా సంస్థ ఆమె చిత్రాలు వాడుకుందని నిరూపించే స్పష్టమైన ఆధారాలు లేవని మద్రాసు హైకోర్టు అభిప్రాయపడింది. ఇక ఆ కేసులో తమన్నా వాదనల్లో స్పష్టత లేకపోవడం, నష్టం జరిగినట్లు నిరూపించే సరైన సాక్ష్యాలు లేకపోవడం కూడా కోర్టు గమనించింది. కేవలం ఆరోపణలు మాత్రం సరిపోవని, చట్టపరంగా బలమైన ఆధారాలు అవసరమని పేర్కొంది.
అలాగే, సంస్థ చర్యల వల్ల తమన్నా ప్రతిష్ఠకు భంగం కలిగిందని నిరూపించే అంశాలు కోర్టు ముందు ఉంచలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో రూ.1 కోటి పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో 2017లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం సమర్థిస్తూ, తమన్నా దాఖలు చేసిన అప్పీల్ ను పూర్తిగా కొట్టివేసింది. ఆ తీర్పుతో తమన్నాకు చట్టపరంగా షాక్ తగిలినట్లయింది. ఒప్పందాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్ విషయంలో సరైన ఆధారాలు ఎంత ముఖ్యమో ఆ కేసు మరోసారి గుర్తు చేసిందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.