స్టార్ నటుడు వారసుడి టార్గెట్ క్రికెటర్!
ప్రస్తుతం తైమూర్‌కి నటన.. సినిమాలు అంటే ఎలాంటి ఆసక్తి లేదని, క్రీడల పట్లే విపరీతమైన మక్కువ చూపుతున్నాడని కరీనా తెలిపారు.
బాలీవుడ్‌లో కపూర్ -పటౌడీ కుటుంబాల వారసుడిగా జన్మించిన చిన్నారి తైమూర్ ఆలీ ఖాన్ ఆలోచనలు మాత్రం గ్లామర్ రంగానికి దూరంగా సాగుతున్నాయి. తల్లిదండ్రులు కరీనా కపూర్, సైఫ్ ఆలీ ఖాన్ ఇద్దరూ స్టార్ నటులైనా? తైమూర్ దృష్టి మాత్రం వెండితెరపై లేకపోవడం ఆసక్తికరం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కరీనా కపూర్ పెద్ద కుమారుడు తైమూర్ ఆసక్తుల గురించిన కొన్ని విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం తైమూర్‌కి నటన.. సినిమాలు అంటే ఎలాంటి ఆసక్తి లేదని, క్రీడల పట్లే విపరీతమైన మక్కువ చూపుతున్నాడని కరీనా తెలిపారు.
సాధారణంగా సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల పిల్లలు నటన వైపే అడుగులు వేస్తారని భావిస్తుంటారు. అయితే తైమూర్ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ లేదా ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా నిలవాలని కలలు కంటున్నాడు. తైమూర్ తనతో `నేను అంతర్జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్ లేదా క్రికెట్ ఆడాలనుకుంటున్నాను` అని చెప్పినట్లు కరీనా గుర్తు చేసుకున్నారు. దానికి స్పందించిన కరీనా `నువ్వు నిజంగా ఆ స్థానానికి చేరుకోవాలనుకుంటే దాన్ని సాధించి చూపించాలి` అని కొడుకును ప్రోత్సహించినట్లు చెప్పారు. పిల్లల కోరికలకు అడ్డు చెప్పకుండా వారికి సరైన మార్గం చూపించడమే తల్లిదండ్రులుగా తమ బాధ్యత అని కరీనా అభిప్రాయపడ్డారు.
తైమూర్‌కు క్రీడల పట్ల ఉన్న ఆసక్తి కొత్తదేమీ కాదు. అది అతని రక్తంలోనే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. తైమూర్ తాతయ్య, దివంగత మాన్సూర్ ఆలీ ఖాన్ పటౌడీ (టైగర్ పటౌడీ) భారత క్రికెట్ జట్టుకు గొప్ప కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అలాగే ముత్తాత ఇఫ్తికార్ ఆలీ ఖాన్ పటౌడీ కూడా భారత్ - ఇంగ్లాండ్ జట్ల తరఫున టెస్ట్ క్రికెట్ ఆడారు. ఇలా పటౌడీ కుటుంబానికి సుదీర్ఘమైన క్రికెట్ వారసత్వం ఉంది. ప్రస్తుతం తైమూర్ కూడా అదే వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయని క్రీడాభిమానులు భావిస్తున్నారు.
సినిమా నటుల కంటే క్రీడాకారులంటేనే తైమూర్‌కు ఎంతో ఇష్టమని కరీనా గతంలో పలు సందర్భాల్లో వెల్లడించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీల గురించి తైమూర్ తరచూ అడుగుతుంటాడని, వారితో తనకు పరిచయం ఉందా లేదా అని ఆరా తీస్తుంటాడని కరీనా తెలిపారు. బాలీవుడ్ స్టార్ల కంటే స్పోర్ట్స్ స్టార్లకే తైమూర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని చెప్పడం అతని ఆటల పట్ల ఉన్న నిజమైన ప్రేమను తెలియజేస్తోంది. అంతేకాదు చదువు పూర్తి చేసిన తర్వాతే పిల్లలు తమకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవాలని కరీనా బలంగా నమ్ముతున్నారు.
పిల్లలను నిర్బంధంగా ఒకే రంగంలోకి నెట్టడం సరికాదని వారి అభిరుచులకు అనుగుణంగా మార్గం సుగమం చేయడమే సరైన పెంపకమని కరీనా అభిప్రాయపడ్డారు. రేపటి రోజున తైమూర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నా తమకేమీ అభ్యంతరం లేదని, ఒకవేళ క్రీడల్లోనే రాణించాలనుకుంటే దానికి తగిన వాతావరణాన్ని కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కరీనా తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. తాను పదకొండో తరగతితోనే చదువు ఆపి నటనలోకి వచ్చానని.. కానీ తన పిల్లలు ముందుగా చదువును పూర్తి చేయాలని పట్టుబట్టారు. ఆ విషయంలో తల్లిగా తానెంత మాత్రం రాజీ పడనన్నారు.
పటౌడీ కుటుంబపు మూడో తరం వారసుడు వెండితెరపై మెరుస్తాడా లేక మైదానంలో సిక్సర్లు, గోల్స్‌తో సందడి చేస్తాడా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా? సినిమా వారసత్వాన్ని పక్కనపెట్టి క్రీడల వైపు అడుగులు వేయాలనుకుంటున్న తైమూర్ నిర్ణయానికి సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. చిన్నతనం నుంచే సొంత గుర్తింపు కోసం క్రీడల వైపు చూస్తున్న తైమూర్ భవిష్యత్తులో గ్లోబల్ స్పోర్ట్స్ స్టార్‌గా ఎదుగుతాడా? లేదా? అన్నది చూడాలి. ప్రస్తుతం తైమూర్ వయసు 11 ఏళ్లు.