సూర్య బాక్సాఫీస్ స్టామినా.. తమిళ్ తెలుగులో ఎంత తేడా?
సూర్య లేటెస్ట్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ బాక్సాఫీస్ దగ్గర లెక్క పెంచుకుంటూ వెళుతోంది. ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్స్ చూస్తే ఒక విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.
సూర్య లేటెస్ట్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ బాక్సాఫీస్ దగ్గర లెక్క పెంచుకుంటూ వెళుతోంది. ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్స్ చూస్తే ఒక విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇది సూర్య సినిమా అయినా కూడా తెలుగు వెర్షన్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ చిత్రం తొలి రెండు రోజుల్లో ఏపీ తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు 15 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అదే టైమ్ లో తమిళనాడులో 18 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రెండు నంబర్స్ మధ్య పెద్దగా గ్యాప్ లేకపోవడం విశేషం.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లో కూడా మన ఆడియన్స్ సూర్యకు గట్టి సపోర్ట్ ఇస్తున్నారు. నార్త్ అమెరికాలో ఈ సినిమా శనివారం నాటికే 1 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసింది. అక్కడ వచ్చిన కలెక్షన్స్ లో అత్యధిక వాటా తెలుగు వెర్షన్ దే అని అక్కడి బాక్సాఫీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఓవర్సీస్ తెలుగు ప్రేక్షకుల్లో కూడా సూర్యకు ఎంత మంచి రీచ్ ఉందో ఇట్టే అర్థమైపోతోంది.
సూర్యకు మన తెలుగు జనాలతో ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఈనాటిది కాదు. గజిని సినిమాతో మొదలైన ప్రయాణం సూర్య సన్నాఫ్ కృష్ణన్, సింగం సిరీస్ లాంటి హిట్లతో పీక్స్ కు చేరింది. ఇక్కడ ఒక సాలిడ్ మార్కెట్ సెట్ అయింది. మధ్యలో కొన్ని సినిమాలు సరిగా ఆడకపోయినా ఆయన బ్రాండ్ ఇమేజ్ అయితే పూర్తిగా కనుమరుగవ్వలేదు. దానికి తోడు ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ కు వెంకీ అట్లూరి లాంటి తెలుగు డైరెక్టర్ పనిచేయడం ఈ సినిమా మన వాళ్లకు మరింత త్వరగా కనెక్ట్ అవ్వడానికి ప్లస్ అయింది.
ఇప్పటివరకు బయటకు వచ్చిన రెండు రోజుల లెక్కలు అన్నీ ట్రేడ్ పండితులు వేసిన అంచనాలు మాత్రమే. ప్రముఖ ట్రాకింగ్ వెబ్ సైట్ సాక్నిల్క్ లెక్కల ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 74 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. సినిమా అసలు సత్తా ఏంటనేది ఆదివారం కలెక్షన్స్ తో పాటు ముఖ్యంగా సోమవారం నాటి ఫస్ట్ వర్కింగ్ డే హోల్డ్ ని బట్టి డిసైడ్ అవుతుంది. వర్కింగ్ డేస్ లో కూడా స్ట్రాంగ్ గా ఉంటే సినిమా సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లే.
ఒక తమిళ స్టార్ హీరో సినిమా తెలుగు మార్కెట్లో తన హోమ్ మార్కెట్ కు దీటుగా వసూళ్లు రాబట్టడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇక్కడ సూర్యకు ఇంకా గట్టి ఆడియన్స్ బేస్ ఉందనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ వీకెండ్ తర్వాత కూడా విశ్వనాథ్ అండ్ సన్స్ బాక్సాఫీస్ దగ్గర ఇదే జోరు కంటిన్యూ చేస్తే తెలుగు మార్కెట్ సూర్యకు మరోసారి పెద్ద బలంగా మారినట్లే. ఒకప్పుడు తెలుగు థియేటర్లలో సూర్య సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చేవి. మళ్లీ ఆ పాత రోజులు రిపీట్ అవుతున్నట్లే కనిపిస్తోంది. మంచి కంటెంట్ తో వస్తే మన వాళ్లు ఎప్పుడూ పరభాషా హీరోలను కూడా ఓన్ చేసుకుంటారని ఈ బాక్సాఫీస్ నంబర్స్ తో మరోసారి ప్రూవ్ అయింది.