సూర్య 'కరుప్పు'.. ఈసారి గట్టిగానే కొడతారా?
దీంతో ఇప్పుడు సూర్య అభిమానులందరి చూపు ఆయన లేటెస్ట్ మూవీ కరుప్పు పైనే ఉంది. దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కిస్తున్న ఆ యాక్షన్ కోర్ట్ రూమ్ డ్రామా తమిళంతో పాటు తెలుగులో వీరభద్రుడు పేరుతో విడుదల కానుంది.;
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గత కొంతకాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల మధ్య వచ్చిన కంగువ, రెట్రో సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఇప్పుడు సూర్య అభిమానులందరి చూపు ఆయన లేటెస్ట్ మూవీ కరుప్పు పైనే ఉంది. దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కిస్తున్న ఆ యాక్షన్ కోర్ట్ రూమ్ డ్రామా తమిళంతో పాటు తెలుగులో వీరభద్రుడు పేరుతో విడుదల కానుంది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి బజ్ తీసుకురాగా.. తాజాగా వచ్చిన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. ట్రైలర్ మొత్తం చూస్తే గ్రామీణ నేపథ్యం, న్యాయం కోసం పోరాటం, రివెంజ్ వంటి అంశాలను మాస్ టచ్ తో చూపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సూర్య ఎంట్రీ, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి.
కథ విషయానికి వస్తే.. బికె అనే ప్రముఖ లాయర్ పాత్రలో ఆర్జే బాలాజీ కనిపిస్తున్నారు. సామాన్య ప్రజలకు న్యాయం చేస్తానని చెప్పుకుంటూ వారి అమాయకత్వాన్ని ఉపయోగించుకునే వ్యక్తిగా ఆయన పాత్రను డిజైన్ చేసినట్లు ట్రైలర్ సూచిస్తోంది. ఒక యువతి కేసులో మోసం జరిగిన తర్వాత రంగంలోకి దిగే కరుప్పు పాత్రలో సూర్య కనిపించనున్నారు. కేవలం ఆ కేసుకు న్యాయం చేయడమే కాకుండా, బికెకు బుద్ధి చెప్పాలని కరుప్పు నిర్ణయించుకుంటాడు. అక్కడి నుంచి ఇద్దరి మధ్య జరిగే పోరు సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక హీరోయిన్ గా నటిస్తున్న సీనియర్ బ్యూటీ త్రిష కృష్ణన్ మరోసారి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నారు. ట్రైలర్‌లో ఆమె లాయర్ పాత్రలో కనిపించడం ఆసక్తిని పెంచుతోంది. సూర్య-త్రిష కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో ముందే మంచి క్రేజ్ ఉండటంతో ఈ జంట మరోసారి మ్యాజిక్ చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రైలర్ లో మరో ప్రధాన హైలైట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు మెయిన్ అసెట్ గా మారింది.
ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ లో వచ్చిన మాస్ బీట్లు, ఎమోషనల్ సీన్స్ లో వినిపించిన స్కోర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. విజువల్స్ కూడా డార్క్ టోన్ లో స్టైలిష్ గా కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇటీవల సూర్య సినిమాల సెలక్షన్ పై కొంత విమర్శలు వచ్చినప్పటికీ.. కరుప్పు ట్రైలర్ మాత్రం అభిమానుల్లో మళ్లీ నమ్మకం పెంచింది. సూర్యను పూర్తి స్థాయి ఊరమాస్ అవతార్ లో చూపించడంలో దర్శకుడు ఆర్జే బాలాజీ సక్సెస్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది.
ముఖ్యంగా కోర్ట్ రూమ్ డ్రామాను మాస్ యాక్షన్ తో మిక్స్ చేసిన తీరు సినిమాకు ప్లస్ అవుతుందని అంతా భావిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఆ చిత్రం మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. వరుస ఫ్లాపుల తర్వాత సూర్యకు ఆ సినిమా గట్టి కమ్ బ్యాక్ ఇస్తుందా? అభిమానులు ఆశిస్తున్న విజయాన్ని అందిస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.