రీమేక్ కోసం ఒరిజినల్‌నే దాచేశారు

‘ప్రేమలు’ సినిమా అటు మలయాళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే.

Update: 2026-08-17 07:45 GMT

‘ప్రేమలు’ సినిమా అటు మలయాళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ బజ్ వల్ల హిందీలో కూడా డైరెక్ట్ ఓటిటీ రీమేక్ అయ్యింది. అయితే జియోహాట్‌స్టార్‌లో అందుబాటులో ఉన్న ఈ మలయాళ బ్లాక్‌బస్టర్ హిందీ వెర్షన్ ఇప్పుడు కనిపించడం లేదు. త్వరలో వస్తున్న హిందీ రీమేక్ కారణంగానే దాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. అయితే ప్లాట్‌ఫామ్ లేదా మేకర్స్ నుంచి దీనిపై అధికారిక వివరణ మాత్రం రాలేదు.

‘ప్రేమలు’ హిందీలో ‘ప్రేమ్ కీటాను’ పేరుతో రీమేక్ అవుతోంది. వీర్ పహారియా, ఆఫియా సయీద్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా అపారశక్తి ఖురానా కూడా కీలక పాత్రలో ఉన్నాడు. ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ ఫేమ్ అపూర్వ్ సింగ్ కార్కి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది.

ఒకప్పుడు మరో భాషలో హిట్ అయిన సినిమా హిందీలో రీమేక్ అయ్యే సమయానికి అక్కడి ప్రేక్షకుల్లో చాలామంది ఒరిజినల్ చూసి ఉండేవారు కాదు. ఇప్పుడు ఓటీటీతో ఆ గ్యాప్ దాదాపు పోయింది. పైగా డబ్బింగ్ కూడా అందుబాటులో ఉంటే అదే కథను ఇంట్లోనే ముందుగా చూసే అవకాశం ఉంటుంది. అప్పుడు కొత్త హీరోలతో అదే కథను థియేటర్‌లో చూడాలనే ఆసక్తి ఎంత ఉంటుందన్నది మరో లెక్క.

‘ప్రేమలు’కు ఈ సమస్య ఇంకాస్త ఎక్కువ. 2024లో వచ్చిన ఈ సినిమా మలయాళంలోనే ఆగిపోలేదు. తెలుగు సహా ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓటీటీలోకి వెళ్లాక మరింత మంది ఆ కథ ఏంటనేది తెలుసుకున్నారు. ఇప్పుడు హిందీ రీమేక్‌కు ఎదురుగా మరో సినిమా మాత్రమే కాదు.. ఇప్పటికే అందుబాటులో ఉన్న తన ఒరిజినల్ కూడా పోటీ అయ్యే పరిస్థితి.

అందుకే హిందీ డబ్బింగ్‌ను తొలగించారని తెలుస్తోంది. అక్టోబర్ వరకు కనీసం హిందీ ప్రేక్షకుడికి అదే కథ రెడీమేడ్‌గా అందుబాటులో లేకుండా చూడటం మేకర్స్ టార్గెట్. అయితే ఇప్పటికే ‘ప్రేమలు’ చూసేసిన వాళ్ల జ్ఞాపకాలను మాత్రం ఏ ప్లాట్‌ఫామ్ నుంచీ తీసేయలేరు. రీమేక్ మార్కెట్‌లో వచ్చిన అసలు మార్పు ఇదే. ఇప్పుడు రైట్స్ కొనడం ఒక్కటే సరిపోవడం లేదు. ఒరిజినల్ సినిమా ఎక్కడ స్ట్రీమ్ అవుతోంది, ఏ భాషలో అందుబాటులో ఉంది అన్నది కూడా కొత్త సినిమాకు బిజినెస్ లెక్కగా మారుతోంది. ఇక ‘ప్రేమ్ కీటాను’ బాక్సాఫీస్ వద్ద ఈ ప్లానింగ్ తో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News