హాలీవుడ్ సినిమాలకు కొత్త అడ్డాగా తెలుగు రాష్ట్రాలు

ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో పరిమితమైన మార్కెట్ మాత్రమే ఉండేది.

Update: 2026-08-17 05:51 GMT

ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో పరిమితమైన మార్కెట్ మాత్రమే ఉండేది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు, యాక్షన్ లేదా విజువల్ ఎఫెక్ట్స్ ఓరియెంటెడ్ సినిమాల‌కే తెలుగు ఆడియ‌న్స్ నుంచి ఇంట్రెస్ట్ కనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కంటెంట్‌తో పాటు ఒక సినిమా సృష్టించే థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా తెలుగు ఆడియన్స్ కోరుకుంటున్నారు. అందుకే భారీ స్థాయి హాలీవుడ్ సినిమాల‌కు తెలుగు రాష్ట్రాలు కీలక మార్కెట్‌గా మారుతున్నాయి.

ముఖ్యంగా మార్వెల్ సినిమాల విషయంలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మార్వెల్ స్టూడియోస్ రూపొందించే సినిమాల‌కు తెలుగు ప్రేక్షకుల్లో స్పెష‌ల్ క్రేజ్ ఏర్పడింది. అవెంజ‌ర్స్, స్పైడ‌ర్ మ్యాన్ వంటి ఫ్రాంచైజీలకు ఇక్కడి ఫ్యాన్స్ కేవలం సినిమాలు చూసే ఆడియ‌న్స్ గా మాత్ర‌మే కాకుండా, ఆయా పాత్రలు, కథలు, ఫ్యాన్ థియరీలను ఫాలో అయ్యే కమ్యూనిటీగా మారిపోయారు. సోషల్ మీడియాలో తెలుగు ఫ్యాన్ పేజీలు, ఎడిట్స్, రియాక్షన్ వీడియోలు, మీమ్స్ పెరగడం కూడా ఈ క్రేజ్‌కు నిదర్శనంగా చెప్పొచ్చు.

ఇక అవెంజ‌ర్స్ బ్రాండ్‌కు ఉన్న ప్రత్యేకత మరో స్థాయిలో ఉంటుంది. మార్వెల్ సినిమాటిక్ యూనివ‌ర్స్ లోని అనేక కథలు, పాత్రలు ఒకే ఫ్రాంచైజీలో కలుసుకునే సందర్భం కావడంతో అవెంజ‌ర్స్ సినిమాలకు సాధారణ సూపర్‌హీరో సినిమాల కంటే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అందులోనూ అవెంజ‌ర్స్ అనే పేరు ఆడియ‌న్స్ లో ముందుగానే ఒక అంచనాను క్రియేట్ చేస్తుంది. కథ, ట్రైలర్, రివ్యూలు ఎలా ఉన్నా.. ఫ‌స్ట్ రోజు సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడాలనే ఆసక్తి ఒక వర్గం ఆడియ‌న్స్ లో సహజంగానే ఉంటుంది.

ఈ మార్పులో డబ్బింగ్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో హాలీవుడ్ సినిమాలను ప్రధానంగా ఇంగ్లిష్‌లోనే చూసే ఆడియన్స్ ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ అందుబాటులోకి రావడంతో ఫ్యామిలీ ఆడియ‌న్స్, ఇంగ్లీష్‌పై అంతగా ఆధారపడని ఆడియన్స్ కూడా భారీ సినిమాల‌కు కనెక్ట్ అవుతున్నారు. దీంతో మల్టీప్లెక్స్‌లతో పాటు సింగిల్ స్క్రీన్స్‌లోనూ హాలీవుడ్ సినిమాలకు స్పేస్ పెరుగుతోంది.

ఇంకా చెప్పాలంటే తెలుగు ఆడియ‌న్స్ ఇప్పుడు హాలీవుడ్ సినిమాలను బయటి కంటెంట్ గా కాకుండా తమకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్‌లో భాగంగా చూస్తున్నారు. ముఖ్యంగా అవెంజ‌ర్స్ లాంటి బ్రాండ్లు భాషను దాటి ఒక థియేట్రికల్ ఈవెంట్‌గా మారుతున్నాయి. ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే ఫ్యూచ‌ర్ లో భారీ హాలీవుడ్ సినిమాల‌కు తెలుగు మార్కెట్ కేవలం అదనపు బిజినెస్ ఏరియాగా కాకుండా, అత్యంత కీలకమైన ఇండియన్ మార్కెట్లలో ఒకటిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News