హాలీవుడ్‌లో విషాదం.. 36 ఏళ్లకే ప్రముఖ నటి హఠాన్మరణం
హాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి హెడెన్ పనెటియర్ 36 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
హాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి హెడెన్ పనెటియర్ 36 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆదివారం ఆమె మరణించినట్లు ఆమె ప్రతినిధి కన్ఫర్మ్ చేశారు. హెడెన్ మృతి గురించి తీవ్ర విచారంతో తెలియజేస్తున్నాం. ఆమెను ప్రేమించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆమె చెరగని ముద్ర వేశారని ప్రతినిధి ఓ నోట్ లో పేర్కొన్నారు. అయితే ఆమె మరణానికి గల కారణాలను మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు.
చిన్న వయసులోనే యాక్టింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన హెడెన్‌కు టీవీ సిరీస్‌లు, సినిమాలతో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. నాలుగేళ్ల వయసులోనే వన్ లైఫ్ టు లివ్ ద్వారా కెరీర్‌ను ప్రారంభించిన ఆమె, 2000లో వచ్చిన రిమెంబర్ ది టైటాన్స్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆడియన్స్ దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత హీరోస్ సిరీస్‌లో క్లైర్ బెన్నెట్ పాత్ర ఆమెకు ప్రపంచవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చిపెట్టింది. అనంతరం నాష్విల్లేలో జూలియట్ బార్న్స్‌గా నటించి ప్రశంసలు అందుకున్నారు.
స్క్రీమ్4, స్క్రీమ్VI, ఐస్ ప్రిన్సెస్, బెత్ కూపర్ వంటి సినిమాల్లోనూ హెడెన్ కీలక పాత్రలు పోషించారు. సినిమాలతో పాటు వీడియో గేమ్ అన్‌టిల్ డాన్ కు తన స్వరాన్ని అందించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలైన ఆమె జర్నీ.. హాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే వరకు సాగింది. అయితే హెడెన్ పర్సనల్ లైఫ్ మాత్రం ఎన్నో ఒడిదుడుకులతో నిండింది. మెంటెల్ హెల్త్, వ్యసనాలు, రికవరీ ప్రాసెస్, మాతృత్వం వంటి అంశాలపై ఆమె బహిరంగంగా మాట్లాడారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన తన మెమొరీస్ బుక్ దిస్ ఈజ్ మీ: ఎ రెకనింగ్‌లో తన లైఫ్ లోని ఎన్నో చేదు అనుభవాలను షేర్ చేసుకున్నారు.
తమ్ముడి మరణంతో కుంగిపోయిన హెడెన్
ముఖ్యంగా 2023లో తన తమ్ముడు జాన్సెన్ పనెటియర్ ఆకస్మిక మరణం ఆమెను తీవ్రంగా కుంగదీసింది. 28 ఏళ్ల వయసులో జాన్సెన్ మృతి చెందగా, అతను తన ఏకైక సోదరుడని, అతన్ని కోల్పోయినప్పుడు తన ఆత్మలో సగం కోల్పోయినట్టుగా అనిపించిందని హెడెన్ గతంలో వెల్లడించారు. జాన్సెన్ మరణం అనంతరం ఎదురైన మానసిక వేదన, ఆందోళన, వ్యక్తిగత పోరాటాల గురించి కూడా ఆమె పలుమార్లు మాట్లాడారు. హెడెన్‌కు మాజీ కాబోయే భర్త వ్లాదిమిర్ క్లిట్ష్కోతో కలిసి కయా అనే కూతురు ఉంది. 36 ఏళ్లకే ఆమె కన్నుమూయడంతో హాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. తెరపై ఆమె పోషించిన పాత్రలతో పాటు, తన పర్సనల్ లైఫ్ లోని కష్టాలను ధైర్యంగా పంచుకున్న వ్యక్తిగా కూడా హెడెన్ పనెటియర్ గుర్తుండిపోనున్నారు.