కరుప్పుపై భారీ హైప్.. టెన్షన్ లో ఫ్యాన్స్
సూర్య నటించిన కరుప్పు సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి.;
సూర్య నటించిన కరుప్పు సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఇది సూర్య కెరీర్‌లో ఒక కీలక మలుపుగా మారుతుందా అనే ప్రశ్న ఇప్పుడు అభిమానుల్లో ఎక్కువగా వినిపిస్తోంది. గత కొన్ని సినిమాలుగా ఆయన చేసిన ప్రయోగాలు విమర్శకుల ప్రశంసలు పొందినా, ఫ్యాన్స్ కోరుకునే సూర్య మాత్రం కనిపించలేదనే భావన ఉంది. ఈ నేపథ్యంలో కరుప్పు ఆ లోటును తీర్చగలదా అన్నది ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారింది.
హీరో పాత్రల్లో సహజత్వం తగ్గుతుంది
డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఈ సినిమాను కేవలం కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మాత్రమే కాకుండా, ఒక స్పష్టమైన సోషల్ మెసేజ్ తో తెరకెక్కించినట్లు చెప్పడం ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో హీరోలను ఎక్కువగా రౌడీలు లేదా పోలీసులుగా చూపించే ట్రెండ్ పెరిగిందని, దీంతో పాత్రల్లో సహజత్వం, వైవిధ్యం తగ్గిపోయిందని బాలాజీ అభిప్రాయపడుతున్నారు. కరుప్పు ద్వారా సాధారణ మనుషుల కథలను, రోజువారీ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలను తెరపైకి తీసుకురావడానికి బాలాజీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ఎక్కువ హైప్ కూడా రిస్కే!
అయితే, సినిమా ప్రమోషన్స్ మాత్రం మరింత పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ కు ముందే భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అవుతోంది. ఇంటర్వ్యూలు, ఈవెంట్లు, స్టేట్మెంట్స్ ఇవన్నీ కరుప్పు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. కానీ ఇదే అంశం ఇప్పుడు రిస్క్‌గా మారే అవకాశం కూడా ఉంది. అంచనాలు ఎక్కువైపోయి, తర్వాత సినిమాలోని కంటెంట్ వాటిని అందుకోలేకపోతే నెగటివ్ టాక్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంది. అందుకే కొందరు విశ్లేషకులు ప్రమోషన్స్‌లో కొంత నియంత్రణ అవసరమని సూచిస్తున్నారు.
గత సినిమాల కంటే 15 రెట్లు బడ్జెట్ ఎక్కువ
ఇక బడ్జెట్ పరంగా చూస్తే, కరుప్పు ఓ భారీ ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. తన గత సినిమాతో పోలిస్తే దాదాపు 15 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టారని ఆర్జే బాలాజీ వెల్లడించారు. ఇది సినిమా స్కేల్, ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత పెద్దగా ఉన్నాయో చూపిస్తోంది. అయితే అదే సమయంలో ఇది ఒక పెద్ద రిస్క్ కూడా. భారీ పెట్టుబడిని రికవర్ చేయాలంటే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సి ఉంటుంది.
మే 14న కరుప్పు రిలీజ్
ఫ్యాన్స్ పరంగా చూస్తే, కరుప్పుపై ఎక్స్‌పెక్టేషన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో సూర్యకు మళ్లీ పాత ఇమేజ్ వస్తుందని, ఈ సినిమా ఆయనకు స్ట్రాంగ్ కంబ్యాక్ అవుతుందని భావిస్తున్నారు. చాలా కాలంగా మిస్సైన సూర్యను తిరిగి చూడాలనే కోరిక అభిమానుల్లో ఉంది. ఆ ఎమోషన్ ఈ సినిమాకు పెద్ద ప్లస్‌గా మారే అవకాశం ఉంది. మరి మే 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.