తెలుగోళ్ల మనసు.. సూర్యకు బాగా తెలుసా?
ఈవెంట్ లో భాగంగా సూర్య చేసిన కామెంట్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. "నేను హైదరాబాద్ కు ప్రతిసారి కూడా నేను లక్కీ పర్సన్ గా భావిస్తాను.;
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి తెలియని వారుండరేమో. తమిళ హీరో అయినప్పటికీ టాలీవుడ్ ఆడియన్స్ ఆయనను తమ ఇండస్ట్రీ హీరోలాగే ఆదరిస్తుంటారు. ఆయన సినిమాలు విడుదలైన ప్రతిసారి టాలీవుడ్ లోనూ భారీ అంచనాలు కనిపిస్తాయి. ఇప్పుడు తాజాగా ఆయన నటించిన కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) మూవీ విడుదలకు సిద్ధమవుతుండగా.. హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సూర్య చేసిన వ్యాఖ్యలు తెలుగు అభిమానులను మరింత ఆకట్టుకున్నాయి.
కరుప్పు చిత్రాన్ని దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించగా, ఇందులో హీరోయిన్ గా త్రిష కృష్ణన్ నటించారు. ఆ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తోంది. మే 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ మూవీ కోసం హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో సూర్యతో పాటు ఆయన బ్రదర్ కార్తీ, నిర్మాత సుప్రియ యార్లగడ్డ, దర్శకుడు వెంకీ అట్లూరి తదితరులు పాల్గొన్నారు.
ఈవెంట్ లో భాగంగా సూర్య చేసిన కామెంట్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. "నేను హైదరాబాద్ కు ప్రతిసారి కూడా నేను లక్కీ పర్సన్ గా భావిస్తాను. నాకు తెలుగు అంత బాగా రాకపోవచ్చు కానీ.. తెలుగు వారి మనసు మాత్రం బాగా తెలుసు" అంటూ ఆయన చెప్పగా.. ఓ రేంజ్ లో ఈలలు వినిపించాయి. తెలుగు ప్రేక్షకులు తమను గెస్టుల్లా కాకుండా దత్తపుత్రుల్లా భావిస్తున్నారని చెప్పిన సూర్య.. ఆ ప్రేమ ఎప్పటికీ మరువలేనిదని తెలిపారు.
అలాగే ఎక్కడ నమ్మకం ఉంటుందో.. ఎక్కడ ఆశ ఉంటుందో అక్కడ మ్యాజిక్ జరుగుతుందని చెప్పిన సూర్య.. వీరభద్రుడు సినిమాపై కూడా తాను అదే నమ్మకంతో ఉన్నానన్నారు. సమస్యలు వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్ముతానని, గుడికి వెళ్లి ప్రశాంతత పొందుతానని చేసిన కామెంట్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. మరోవైపు సుప్రియ యార్లగడ్డతో తమ కుటుంబానికి ఎంతో కాలంగా మంచి అనుబంధం ఉందని తెలిపారు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ తో అసోసియేట్ కావడం గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు.
అయితే తెలుగు ప్రేక్షకుల టేస్ట్ ను బాగా అర్థం చేసుకున్న హీరోగా సూర్యకు మంచి పేరు ఉంది. ఆయన నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్, సింగం, ఆకాశం నీ హద్దురా వంటి చిత్రాలు టాలీవుడ్ లో కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. అందుకే వీరభద్రుడు సినిమాపై కూడా అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
లిరిసిస్ట్ లు రామజోగయ్య శాస్త్రి, రాకేందు మౌళి, మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ కు సూర్య ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలిపారు. మంచి సంగీతం, స్ట్రాంగ్ ఎమోషన్స్ తో సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఏదేమైనా వీరభద్రుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సూర్య మాట్లాడిన ప్రతి మాటలో కూడా టాలీవుడ్ ఆడియన్స్ పై ఉన్న అభిమానమే కనిపించింది. అలా తమిళ హీరో అయినా.. తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నటుడిగా సూర్య మరోసారి ప్రత్యేకత చాటుకున్నారు.