సురేష్ ప్రొడక్షన్స్ అగ్ర‌హీరోల‌తో సినిమాలు చేయదా?

ఎన్నో ఇండస్ట్రీ హిట్లను, మైలురాళ్లు అన‌ద‌గ్గ చిత్రాల‌ను అందించిన ఈ బ్యానర్‌లో గత కొంతకాలంగా భారీ బడ్జెట్ సినిమాలు- అగ్ర హీరోల సినిమాలు కనిపించడం లేదన్న చర్చ టాలీవుడ్‌లో గట్టిగా నడుస్తోంది

Update: 2026-07-21 04:26 GMT

తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దాల చరిత్ర కలిగిన అగ్ర నిర్మాణ సంస్థ `సురేష్ ప్రొడక్షన్స్`. ఎన్నో ఇండస్ట్రీ హిట్లను, మైలురాళ్లు అన‌ద‌గ్గ చిత్రాల‌ను అందించిన ఈ బ్యానర్‌లో గత కొంతకాలంగా భారీ బడ్జెట్ సినిమాలు- అగ్ర హీరోల సినిమాలు కనిపించడం లేదన్న చర్చ టాలీవుడ్‌లో గట్టిగా నడుస్తోంది. 2021లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడిగా వచ్చిన `నారప్ప` (తమిళ్ `అసురన్` రీమేక్) తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ మళ్లీ ఏ అగ్ర హీరోతోనూ నేరుగా భారీ చిత్రాన్ని నిర్మించలేదు. దాదాపు ఈ ఐదేళ్ల కాలంలో వచ్చిన `దృశ్యం 2`, `శాకిని డాకిని` వంటి రీమేక్‌లు,`దొంగలున్నారు జాగ్రత్త`, `రాజమండ్రి రోజ్ మిల్క్` .. తమిళ చిత్రం `ప్రిన్స్` వంటి చిన్న-పరిమిత బడ్జెట్ సినిమాలతోనే సరిపెట్టుకుంది. 2026లో వస్తున్న `చీకటిలో` సినిమా కూడా ఇదే వ‌రుస‌కు చెందింది. టాలీవుడ్‌లో డజను మందికి పైగా స్టార్ హీరోలు వరుసగా సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నా.. సురేష్ ప్రొడక్షన్స్ వారి వైపు మొగ్గు చూపకపోవడానికి అసలు కారణాలేంటి అనేది ఆసక్తికరమైన ప్రశ్న.

ఈ పరిణామానికి ప్రధాన కారణాల్లో ఒకటి టాలీవుడ్‌లో మారిన హీరోల బిజినెస్ మోడల్. నేటి ట్రెండ్‌లో దాదాపు ప్రతి అగ్ర హీరో కూడా సొంత నిర్మాణ సంస్థలను ఏర్పాటు చేసుకోవడమో లేదా తమకు నమ్మకమైన వ్యక్తులను, మేనేజర్లను నిర్మాతలుగా ప్రమోట్ చేసుకోవడమో చేస్తున్నారు. దీనివల్ల కాల్షీట్ల వికేంద్రీకరణ జరిగి, పూర్వకాలంలాగా బయటి పెద్ద నిర్మాణ సంస్థలకు అగ్ర హీరోల కాల్షీట్లు దొరకడం ఒక సవాలుగా మారింది. స్టార్ హీరోలు తామే నిర్మాణ భాగస్వాములుగా మారుతుండటంతో... సాంప్రదాయ అగ్ర నిర్మాణ సంస్థలు భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకే ఒకింత సంకోచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

మరో కీలకమైన అంశం `కాస్ట్ ఫ్యాక్టర్`.. వర్కింగ్ బడ్జెట్. ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర హీరోల పారితోషికాలు రూ.100 కోట్లు లేదా అంతకు మించిన ప్యాకేజీలు ఇవ్వాల్సిన ప‌రిస్థితి ఉంది. దీనికి తోడు నిర్మాణ వ్యయం కూడా విపరీతంగా పెరిగిపోయింది. సినిమా ఏమాత్రం తేడా కొట్టినా `కాస్ట్ ఫెయిల్యూర్` కార‌ణంగా నష్టాలు దారుణంగా ఉంటాయి. ఇటువంటి భారీ రిస్క్ తీసుకోవడానికి పక్కా బిజినెస్ క్యాలిక్యులేషన్స్ వేసే సురేష్ ప్రొడక్షన్స్ లాంటి సంస్థ ఎప్పటికీ సిద్ధంగా ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే రిస్క్ తగ్గించుకోవడానికి తమ సొంత హీరోలైన వెంకటేష్, రానాలతో మాత్రమే పరిమితమైన బడ్జెట్ లేదా సేఫ్ ప్రాజెక్ట్‌లను ప్లాన్ చేస్తూ వస్తున్నారు.

అయితే డి. సురేష్ బాబు కేవలం సినిమాల నిర్మాణానికే పరిమితమైన నిర్మాత కారు. ఆయన వ్యాపార దృక్పథం అంతకంటే విశాలమైనది. నిర్మాణం కంటే ఎగ్జిబిషన్‌ (థియేటర్లు) .. స్టూడియోల‌ నిర్వ‌హ‌ణ‌.. డిస్ట్రిబ్యూషన్ (పంపిణీ) రంగాలోనే సేఫ్ అండ్ స్ట‌డీ ప్రాఫిట్స్ ఉంటాయని ఆయన బలంగా నమ్ముతారు. రెండు తెలుగు రాష్ట్రాలలో బలమైన థియేటర్ నెట్‌వర్క్‌ను పర్యవేక్షించడం.. మంచి కంటెంట్ ఉన్న ఇతర సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయడంపైనే ఆయన ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీనితో పాటు ఫిల్మ్ ఛాంబర్ కార్యకలాపాలు, పరిశ్రమ రాజకీయాలు - థియేటర్ల వ్యవస్థను క్రమబద్ధీకరించడంలో ఆయన నిరంతరం తలమునకలై ఉన్నారు.

మొత్తానికి టాలీవుడ్‌లో ఎంతటి గ్లామర్, గ్లోబల్ క్రేజ్ పెరిగినా... ఫక్తు క్యాలిక్యులేషన్స్.. లాభనష్టాల లెక్కలతో కెరీర్ జర్నీని తెలివిగా నడిపించడంలో డి. సురేష్ బాబు శైలి ప్రత్యేకమైనది. భారీ సినిమాలు తీసి వందల కోట్ల రూపాయ‌లు రిస్క్ చేసేకంటే..తమకున్న విస్తృతమైన ఎగ్జిబిషన్ వ్యాపారాన్ని కాపాడుకుంటూ.. తక్కువ రిస్క్ ఉన్న రీమేక్‌లు.. చిన్న చిత్రాలను నిర్మించడమే సురేష్ ప్రొడక్షన్స్ ఎంచుకున్న తెలివైన వ్యూహంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News