సూపర్‌ స్టార్‌ చూపు ఎటువైపు...?

కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ 'జైలర్‌' సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడని అభిమానులు అంతా అనుకున్నారు.;

Update: 2025-10-16 18:30 GMT

కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ 'జైలర్‌' సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడని అభిమానులు అంతా అనుకున్నారు. కానీ మళ్లీ బ్యాక్ టు బ్యాక్ ఆయన నిరాశ పరుస్తూనే ఉన్నాడు. ఇటీవల కూలీ సినిమాతో వచ్చిన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఆశించిన స్థాయిలో మెప్పించలేక పోయాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల విషయంలో పర్వాలేదు అనిపించినా ఇతర అంశాల విషయంలో మాత్రం ఏమాత్రం సంతృప్తిని కలిగించలేదు. దాంతో మళ్లీ జైలర్‌ కోసమే అభిమానులు ఎదురు చూస్తున్నారు. నెల్సన్‌ దిలీప్‌ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్‌ 2 సినిమా షూటింగ్‌లో ప్రస్తుతం రజనీకాంత్‌ పాల్గొంటున్నాడు. అతి త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జైలర్‌ 2 ఖచ్చితంగా జైలర్ కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది అనే విశ్వాసంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. జైలర్ 2 సినిమా తర్వాత రజనీకాంత్‌ దారి ఎటు అనేది ఇప్పుడు చర్చ.

రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ మల్టీస్టారర్‌

కూలీ సినిమా సమయంలోనే రజనీకాంత్‌, కమల్‌ హాసన్ సినిమా కన్ఫర్మ్‌ అయింది. ఆ సినిమాకు దర్శకుడు సైతం కన్ఫర్మ్‌ అయ్యాడు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ దర్శకుడు కాకుండా మరో దర్శకుడితో రజనీకాంత్‌, కమల్‌ సినిమా ఉండబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది. కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ కాంబో మూవీ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు, కానీ రజనీకాంత్‌ తదుపరి సినిమాల విషయంలో స్పీడ్‌ పెంచాడు. ఇప్పటికే జైలర్‌ 2 సినిమా లైన్‌లో ఉండగానే కొత్త సినిమాకు సంబంధించిన చర్చలు జరుపుతున్నాడు. రజనీకాంత్‌ సినిమాల ఎంపిక విషయంలో ఎప్పటికప్పుడు చాలా వైవిధ్యభరిత శైలిని అవలంభిస్తున్నాడు. అంటే హిట్‌ ఇచ్చిన దర్శకులను ఎంపిక చేసుకోవడం, సక్సెస్‌ ఫార్ములా స్క్రిప్ట్‌లను ఎంపిక చేసుకోవడం ద్వారా రజనీకాంత్‌ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

హిట్ కొట్టి దర్శకులతో రజనీకాంత్‌ మూవీ

సూపర్‌ హిట్‌ కొట్టిన దర్శకులతో సినిమాలు చేసినా రజనీకాంత్‌కి హిట్ పడటం లేదు. విక్రమ్‌ వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని కమల్‌ కి ఇచ్చి, ఆయన కెరీర్‌ పుంజుకునేలా చేసిన లోకేష్ కనగరాజ్‌తో కూలీ సినిమా చేసిన రజనీకాంత్‌కి దక్కిన ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే. అందుకే రజనీకాంత్‌ దర్శకుల యొక్క గత చిత్రాల ఫలితాలను కాకుండా వారిలో ఉన్న టాలెంట్‌ను చూడాలి అంటూ చాలా మంది సూచిస్తున్నారు. అందుకే ఈసారి రజనీకాంత్‌ దర్శకుల వేట కాస్త భిన్నంగా ప్లాన్‌ చేశాడు అంటున్నారు. ఫేమ్‌ ఉన్న దర్శకులు, స్టార్‌ దర్శకులు మాత్రమే కాకుండా చిన్న దర్శకులు, కొత్త దర్శకులు సైతం కథలు చెప్తే వినేందుకు రెడీ అన్నట్లుగా రజనీకాంత్‌ ఉన్నాడట. అందుకే ఇటీవల రజనీకాంత్‌ను చాలా మంది కొత్త దర్శకులు కథ చెప్పేందుకు కలిశారు అనే వార్తలు వస్తున్నాయి.

సుందర్‌ సి దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌

ముఖ్యంగా రజనీకాంత్‌ ఇప్పుడు ఒక మాస్‌ మసాలా సినిమాను చేసే ఉద్దేశంతో సుందర్‌ సి తో వర్క్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. హర్రర్‌ థ్రిల్లర్‌ సినిమాలను, మాస్ మసాలా సినిమాలను రూపొందించడంలో సుందర్‌ సి ముందు ఉంటాడు. అందుకే ఈయన దర్శకత్వంలో రజనీకాంత్‌ సినిమాను చేయడం ద్వారా ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే రజనీకాంత్‌ హీరోగా సుందర్‌ సి దర్శకత్వంలో సినిమా వచ్చే ఏడాదిలో పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. జైలర్ 2 సినిమా తర్వాత రజనీకాంత్‌ సినిమా ఏంటి, ఆయన చూపు ఎటు అనే విషయమై చర్చ జరిగిన సమయంలో సుందరి సి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

Tags:    

Similar News