పెళ్లాం చెప్పింది వినాలి.. స్టార్ హీరోకి నెటిజనుల సలహా
బాబాలు, స్వామీజీలు, పండిట్‌లను నమ్మాలా వద్దా? .. ఏళ్లుగా కొనసాగుతున్న బిగ్ డిబేట్ ఇది.;
బాబాలు, స్వామీజీలు, పండిట్‌లను నమ్మాలా వద్దా? .. ఏళ్లుగా కొనసాగుతున్న బిగ్ డిబేట్ ఇది. పురాతన కాలం నుంచి యోగులు, స్వామీజీలను విశ్వసించే సంస్కృతి మనది. అయితే స్వామీజీలు, బాబాలను కొందరు నమ్ముతారు.. మరికొందరు నమ్మరు. దీనిని కొందరు మూఢ నమ్మకం అని కొట్టి పారేస్తారు. మరికొందరు దైవంతో కనెక్షన్ అంటుంటారు. అందుకే ప్రజల్లో నాస్తికులు, ఆస్తికులు అంటూ విభజన రేఖ అడ్డుగా ఉంది.
అయితే బాబాలు, పండిట్‌లను నమ్మి లక్షల్లో ధారపోసే సెలబ్రిటీ భర్తను నిరంతరం విమర్శించే నాస్తికురాలైన భార్య గురించి ఇప్పుడు సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు గోవిందా పూర్తిగా బాబాలు, పండిట్ లను నమ్ముతారు. పండిట్ లు, వారి జోశ్యం కోసం లక్షల్లో సొమ్ములు చెల్లిస్తుంటారు. అయితే ఇది గిట్టని అతడి భార్య సునీత అహూజా ఇటీవల పబ్లిగ్గా పండిట్‌లు, జ్యోతిష్కులను తీవ్రంగా విమర్శించారు.
పండిట్‌లను తన భర్త గుడ్డిగా నమ్ముతున్నారని, వాళ్లకు ధారపోసే లక్షలాది రూపాయల సొమ్ముల్ని, బయట పేదవారి ఆకలి కేకలు తగ్గించేందుకు వినియోగించాలని, అలా చేస్తే దేవుడితో డైరెక్టుగా కాంటాక్ట్ ఉంటుందని అన్నారు. తన భర్త గోవిందా చుట్టూ భజగోవిందం బ్యాచీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, వారంతా చెడు చేస్తారని కూడా సునీత అహూజా తీవ్రంగా విరుచుకపడ్డారు. గోవిందా పండిట్‌లతో ఒక్కో సెషన్ కు 2లక్షల నుంచి 10లక్షల వరకూ ఖర్చు చేసేందుకు వెనకాడరని, ఈ డబ్బును ప్రజా సేవ- పేదల సంక్షేమం కోసం వినియోగించాలని గోవిందాను డైరెక్టుగా కోరారు సునీత. ఇలా చెబుతున్నందున తాను వారందరికీ నచ్చను అని కూడా అన్నారు.
ఈ ఎపిసోడ్ తర్వాత గోవిందా పండిట్‌లకు బహిరంగ ప్రకటన ద్వారా క్షమాపణలు చెప్పారు. అయితే ఈ వివాదంలో అభిమానులు రెండుగా చీలిపోయి భార్యను కొందరు, భర్తను మరికొందరు సమర్థించారు. కొందరు సునీత అహూజా చేసిన వ్యాఖ్యలు సముచితమైనవి అని, గోవిందా ఆమె చెప్పేది వినాలని సూచించారు. అయితే పండిట్ లను అలా నిందించడం సరికాదని గోవిందాకు కొందరు మద్ధతు పలికారు.
అయితే నమ్మకంతో ముడిపడిన దోపిడీ గురించి ఇప్పుడు ప్రజల్లో చాలా చర్చ సాగుతోంది. స్వామీజీలను నమ్మినందుకు వారు దోచుకోవడానికి వెనకాడరని చాలా మంది నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. గోవిందా భార్య సునీత అహూజా ఎంతో నిజాయితీగా ఉన్నారని, ఈ ఎపిసోడ్ లో ఆమెకు మద్ధతు పలికేవారు ఎక్కువగానే ఉన్నారు.
సునీత వ్యాఖ్యలు అంధ విశ్వాసాన్ని అడ్డు పెట్టుకుని ఎలా డబ్బు ఆర్జించవచ్చనే సమస్యను హైలైట్ చేసిందని ఆమె మద్దతుదారులు వాదించారు. ఆధ్యాత్మికత మాటున డబ్బు అనే మాయ చేరడంపై చాలా విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఈ వివాదం ఎలా ఉన్నా కానీ, భార్యభర్తలిద్దరూ విడిపోతున్నారనే పుకార్లను వారు స్వయంగా కొట్టి పారేస్తున్నారు. ఆ ఇద్దరూ బహిరంగంగా ఒకరినొకరు విమర్శించుకుంటారు. ఒకరిపై ఒకరు ప్రేమను కురిపిస్తారు. దీనిని బ్రేకప్ అని ప్రచారం చేయడం సరికాదని నెటిజనులు వారికి మద్ధతునిస్తున్నారు.