పుష్ప లాంటి ‘కాటలాన్’.. సునీల్ విలనిజం అక్కడ వర్కౌట్ అవుతుందా?

టాలీవుడ్ లో పెద్ద గడ్డం, మాసిపోయిన బట్టలు, అడవిలో స్మగ్లింగ్.. ‘పుష్ప’ తెచ్చిన ఈ రా అండ్ రస్టిక్ ట్రెండ్ ఇప్పుడు సౌత్ సినిమాలను ఊపేస్తోంది.

Update: 2026-05-26 05:54 GMT

టాలీవుడ్ లో పెద్ద గడ్డం, మాసిపోయిన బట్టలు, అడవిలో స్మగ్లింగ్.. ‘పుష్ప’ తెచ్చిన ఈ రా అండ్ రస్టిక్ ట్రెండ్ ఇప్పుడు సౌత్ సినిమాలను ఊపేస్తోంది. ఇదే బాటలో ఆంటోనీ వర్గీస్ పెపే హీరోగా వస్తున్న మలయాళ భారీ యాక్షన్ చిత్రం ‘కాటలాన్’. ఎర్రచందనం ప్లేస్‌లో ఏనుగు దంతాల వేటతో ఈ సినిమా రాబోతోంది. అయితే, పుష్ప విలన్ మంగళం శ్రీను (సునీల్) ఇందులోనూ మెయిన్ విలన్‌గా చేస్తుండటంతో, మలయాళంలో మనోడి విలనిజం ఏ రేంజ్‌లో వర్కవుట్ అవుతుందనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది..ఆ విశేషాలు చూద్దాం..

అడవి నేపథ్యం.. కొత్త కుట్రలు:

పుష్ప సినిమాలో శేషాచలం అడవులను చూపిస్తే, కాటలాన్‌లో దట్టమైన మలయాళ అడవులను చూపించబోతున్నారు. అక్కడ ఎర్రచందనం స్మగ్లింగ్ అయితే, ఇక్కడ ఏనుగు దంతాల వేట, దాని వెనక జరిగే కుట్రలు, కుతంత్రాలు కథాంశం. దర్శకుడు పాల్ జార్జ్ మొత్తం యాక్షన్ విజువల్స్, గన్‌ షాట్లతో ట్రైలర్‌ను ఓ రేంజ్‌లో కట్ చేశారు. ఇక సినిమా అంతా అడవి మట్టి వాసనతో, పక్కా మాస్‌గా ఉండబోతోందని స్పష్టమవుతోంది.

సునీల్‌పైనే ఓ సాంగ్!:

ఇప్పటికే ‘పుష్ప’, ‘జైలర్’ సినిమాలతో పాన్-ఇండియా లెవెల్లో విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సునీల్‌కు ఈ సినిమాలో క్రేజీ వెల్‌కమ్ లభించింది. క్యూబ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పాటను మన సునీల్ పైనే చిత్రీకరించారు. ఇక మలయాళ సినిమాలో తెలుగు నటుడికి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం చూస్తుంటే, అక్కడ సునీల్ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.

రవి బస్రూర్ పూనకాలు:

‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలకు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన రవి బస్రూర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ట్రైలర్‌లో ఆయన ఇచ్చిన ఆర్ఆర్ థియేటర్లలో మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయంలా ఉంది. ఇక సునీల్, కబీర్ దుల్హన్ సింగ్ విలన్లుగా చూపిస్తున్న విజువల్స్‌కు రవి బస్రూర్ మ్యూజిక్ పెద్ద అసెట్‌గా నిలవనుంది.

టైటిల్ కాస్త ఇబ్బందేనా?:

ఈ సినిమాను పాన్-ఇండియా లెవెల్లో మే 28న రిలీజ్ చేస్తున్నారు. అయితే, తెలుగులో టైటిల్ మార్చకుండా ‘కాటలాన్’ అనే ఒరిజినల్ పేరే ఉంచేశారు. కింద క్యాప్షన్‌గా ‘వేటగాడు’ అని రాసినా, మెయిన్ టైటిల్ పలకడానికి తెలుగు ఆడియన్స్‌కు కాస్త కొత్తగా, కష్టంగా ఉంది. ఇక నేటివిటీ మిస్ కాకుండా టైటిల్ మార్చి ఉంటే ఇక్కడ మరింత హైలైట్ అయ్యేది.

రెండు పెద్ద సినిమాల మధ్య గండం:

బాక్సాఫీస్ దగ్గర కాటలాన్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. థియేటర్లలో ఆల్రెడీ స్ట్రాంగ్‌గా రన్ అవుతున్న ‘దృశ్యం 3’ ఒకవైపు ఉంటే, జూన్ 4న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ రాబోతోంది. అంటే కాటలాన్ సినిమాకు కేవలం వారం రోజులు మాత్రమే క్లీన్ రన్ దొరుకుతుంది. ఈ లోపే సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటేనే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు నిలబడతాయి.

మొత్తానికి ‘పుష్ప’ ఫార్ములాతో వస్తున్న ‘కాటలాన్’ మలయాళంలో ఏ మేరకు సంచలనం సృష్టిస్తుందో చూడాలి. సునీల్ విలనిజం, రవి బస్రూర్ మ్యూజిక్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా ఉన్నాయి. పోటీ తట్టుకుని నిలబడితే, ఈ మలయాళ ‘వేటగాడు’ బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్టే కొట్టేలా ఉన్నాడు.

Tags:    

Similar News