చిరూ కోసం అమ్మతో టికెట్ తెప్పించుకున్న సునీల్.. ఎమోషనల్ స్టోరీ వైరల్!

ప్రస్తుతం తెలుగు మాత్రమే కాకుండా తమిళం, మలయాళం వంటి భాషల్లోనూ వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్‌లో మరో కొత్త దశను ఆస్వాదిస్తున్నారు.

Update: 2026-05-27 06:46 GMT

తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సునీల్ మరోసారి తన మాటలతో వార్తల్లో నిలిచారు. ఒకప్పుడు వరుస కామెడీ పాత్రలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సునీల్‌, తర్వాత హీరోగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్న విషయం తెలిసిందే. అయితే హీరోగా చేసిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో మళ్లీ కమెడియన్‌గా రీఎంట్రీ ఇచ్చిన ఆయన, అక్కడితో ఆగకుండా నెగిటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలతో కూడా కొత్త ఇమేజ్‌ను నిర్మించుకున్నారు. ప్రస్తుతం తెలుగు మాత్రమే కాకుండా తమిళం, మలయాళం వంటి భాషల్లోనూ వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్‌లో మరో కొత్త దశను ఆస్వాదిస్తున్నారు.

పుష్ప సినిమా తర్వాత తన కెరీర్ పూర్తిగా కొత్త మలుపు తిరిగిందని సునీల్ వెల్లడించారు. పుష్ప తర్వాత త‌న‌ లైఫ్ సర్ప్రైజింగ్ మోడ్‌లో పడిపోయింద‌ని, ఇప్పుడు ఏ భాష నుంచి, ఎలాంటి పాత్ర వస్తుందో త‌న‌కు కూడా తెలియదంటూ అంటూ నవ్వుతూ చెప్పారు. జైల‌ర్ లో తన పాత్ర చూసిన తర్వాత తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా వరుస అవకాశాలు వస్తున్నాయని వెల్లడించారు. కేరళలో షూటింగ్‌కు వెళ్లినప్పుడు త‌న‌ను త‌మిళ యాక్ట‌ర్ గా భావించి డైరెక్ట్ గా తమిళంలో సీన్ పేపర్లు ఇస్తున్నారని, భాష తెలియకపోయినా పాత్రలపై ఉన్న నమ్మకంతో దర్శకులు తనను ఎంపిక చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం అన్ని భాషల నుంచి విభిన్నమైన పాత్రలు వస్తుండటంతో నటుడిగా కొత్త అనుభవాలను ఆస్వాదిస్తున్నానని సునీల్ తెలిపారు. తెలుగు ప్రేక్షకుల ప్రేమే తనను ఈ స్థాయికి తీసుకువచ్చిందని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కెరీర్‌లో కామెడీ, హీరోయిజం, విలనిజం ఇలా విభిన్న కోణాల్లో తనను తాను మార్చుకుంటూ వచ్చిన సునీల్‌, అసలు హైదరాబాద్‌కు వచ్చిన ఉద్దేశమే నెగిటివ్ రోల్స్ చేయడమని చెప్పడం ఆసక్తిని కలిగించింది. త‌న‌కు యాక్టింగ్ అంటే చాలా ఇష్ట‌మ‌ని చెప్పిన సునీల్, స్టెప్పులు వేయడం కంటే పాత్రలో నటించడం ఎక్కువ కంఫర్ట్‌గా అనిపిస్తుంద‌ని ఆయన పేర్కొన్నారు. గతంలో సినిమాల్లో పాత్రలతో పాటు ప్రత్యేక ఐటెమ్‌లను జోడించేవారని, కానీ ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల సినిమాలు తెలుగులో డబ్ అవుతున్న తరుణంలో, మన తెలుగు సినిమాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఇతర భాషల్లో విడుదలవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మార్పుతో నటులకు కూడా విస్తృత అవకాశాలు రావ‌డంతో పాటూ ఆడియ‌న్స్ కూడా కొత్త‌ద‌నం కోరుకుంటున్నార‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

తాజాగా మలయాళ సినిమా క‌ట్ట‌లన్ ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్న సునీల్ తన సినీ ప్రయాణం, అభిమానాలు, కెరీర్ టర్నింగ్ పాయింట్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఎంతో మంది హీరోలతో కలిసి పనిచేసినా, మళ్లీ మళ్లీ కలిసి పని చేయాలని అనిపించే హీరో ఎవర‌ని అడిగితే ఆయన వెంటనే చిరంజీవి పేరు చెప్పడం విశేషం. చిరంజీవి గారి సినిమా టికెట్ కోసం థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో తాను కూడా ఉండేవాడిన‌ని, అబ్బాయిలకు టికెట్లు ఇవ్వడం లేదని త‌న త‌ల్లిని లైన్‌లో నిలబెట్టి టికెట్ తెప్పించుకున్న రోజులు ఉన్నాయ‌ని, ఆయన్ని చూసే త‌న‌కు డ్యాన్స్‌, యాక్టింగ్‌పై ఆసక్తి వచ్చింద‌ని, ఆయన వల్లే త‌న‌కు ఈ జీవితం దొరికిందంటూ సునీల్ చెప్పారు. ఒక అభిమానిగా మొదలైన తన ప్రయాణం, చివరకు చిరంజీవితో కలిసి నటించే స్థాయికి రావడం జీవితంలో మరచిపోలేని అనుభూతి అని తెలిపారు.





Tags:    

Similar News