ఎగ్జిబిట‌ర్లు 'కార్న్- కోలాలు' అమ్మిన దాంట్లో నిర్మాత‌కు షేర్ ఇస్తారా?

సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల మ‌నుగ‌డ గురించి, రెంట‌ల్ విధానం వ‌ర్సెస్ ప‌ర్సంటేజీ షేరింగ్ విధానం గురించి టాలీవుడ్ లో విస్త్ర‌తంగా చ‌ర్చ సాగుతోంది.

Update: 2026-05-18 05:59 GMT

సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల మ‌నుగ‌డ గురించి, రెంట‌ల్ విధానం వ‌ర్సెస్ ప‌ర్సంటేజీ షేరింగ్ విధానం గురించి టాలీవుడ్ లో విస్త్ర‌తంగా చ‌ర్చ సాగుతోంది. ఈ స‌మ‌యంలో నిర్మాత‌ల‌తో ఎగ్జిబిట‌ర్ల వార్ గురించి తెలిసిందే. ఈ స‌మ‌యంలో ఇండస్ట్రీ సవాళ్లు, థియేటర్ల రెంటల్స్, క్యాంటీన్-పార్కింగ్ షేరింగ్‌పై ఎగ్జిబిష‌న్ రంగంలో సుదీర్ఘ అనుభ‌వ‌జ్ఞుడు ఏషియ‌న్ సునీల్ నారంగ్ వ్యక్తపరిచిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య నడుస్తున్న థియేటర్ల రెంటల్స్ వ‌ర్సెస్ పర్సంటేజ్ షేరింగ్ వివాదం ఒక కీలకమైన చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎగ్జిబిటర్, పంపిణీదారుడు కం నిర్మాత అయిన ఏషియన్ సునీల్ నారంగ్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను విశ్లేషించారు. దేశవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఎప్పుడో పర్సంటేజీ విధానం (కలెక్షన్లలో నిర్దిష్ట వాటా) అమల్లోకి వచ్చినా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా పాత అద్దె పద్ధతులే నడుస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి తర్వాత సింగిల్ స్క్రీన్ల ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోయిందని.. రెండు రాష్ట్రాల్లో మెజారిటీ థియేటర్లు మూతపడే దిశగా పయనిస్తున్నాయని ఆయన హెచ్చరించారు.

సింగిల్ థియేటర్ల నిర్వాహకులకు ప్రస్తుతం ఉన్న పాత ఫిక్స్‌డ్ అద్దె పద్ధతులు ఎంతమాత్రం గిట్టుబాటు కావడం లేదని సునీల్ నారంగ్ స్పష్టం చేశారు. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఒకలా.. చిన్న సినిమాల సమయంలో మరోలా ఉండే మార్కెట్ ఒడిదుడుకుల వల్ల థియేటర్ల కనీస నిర్వహణ ఖర్చులు, కరెంట్ బిల్లులు, సిబ్బంది జీతాలు కూడా రావడం లేదని పేర్కొన్నారు. మల్టీప్లెక్స్‌ల తరహాలోనే సింగిల్ స్క్రీన్స్‌కు కూడా 50-50 బేసిస్ షేరింగ్ లేదా నెట్ కలెక్షన్లపై సమాన వాటా ఇచ్చే పర్సంటేజీ విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మార్పు వల్ల సినిమా ఫలితంతో సంబంధం లేకుండా థియేటర్ యజమానులు భారీ అద్దెల భారం కింద నలిగిపోకుండా కొంతవరకు సేఫ్ జోన్‌లో ఉండే అవకాశం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

టికెట్ అమ్మ‌కాల నుంచి ప‌ర్సంటేజీ షేర్ అడుగుతున్న ఎగ్జిబిట‌ర్లు అదే సమయంలో, థియేటర్లలో లభించే ఫుడ్ & బెవరేజెస్ (క్యాంటీన్ ఆదాయం) .. పార్కింగ్ ఫీజుల నుంచి వచ్చే పర్సంటేజీని కూడా నిర్మాతలతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అనే ప్రశ్నకు నారంగ్ చాలా ప్రాక్టికల్‌గా సమాధానమిచ్చారు. ప్రస్తుతం టికెట్ కలెక్షన్ల ద్వారా వచ్చే ఆదాయం థియేటర్ల మనుగడకు సరిపోవడం లేదని.. కేవలం క్యాంటీన్, పార్కింగ్ వల్లే సింగిల్ స్క్రీన్స్ నెట్టుకొస్తున్నాయని తేల్చి చెప్పారు. సినిమా ఫ్లాప్ అయినప్పుడు లేదా థియేటర్ ఖాళీగా ఉన్నప్పుడు కూడా యజమానులకు కనీస మనుగడను ఇచ్చేది ఈ అదనపు ఆదాయమేనని, అందులోనూ వాటాలు అడిగితే థియేటర్లను పూర్తిగా మూసివేయడం మినహా మరో మార్గం ఉండదని ఆయన స్పష్టం చేశారు.

వ్యాపార పరంగా చూస్తే.... టికెట్ కలెక్షన్ల షేరింగ్ అనేది సినిమా కంటెంట్‌కు సంబంధించి ఉంటుందని.. అయితే పార్కింగ్ - క్యాంటీన్ లేదా ఎఫ్ అండ్ బీ అనేవి థియేటర్ యాజమాన్యం తమ సొంత పెట్టుబడితో కల్పించే మౌలిక వసతులు అని సునీల్ నారంగ్ వివరించారు. కాబట్టి ఈ రెండింటినీ ముడిపెట్టి ఆ ఆదాయాన్ని షేర్ చేయడం అసాధ్యమని ఆయన కుండబద్దలు కొట్టారు. నిర్మాతలు క్యాంటీన్ ఆదాయంలో వాటా అడిగితే మరి థియేటర్ల డిజిటల్ ప్రొజెక్షన్ కోసం ఎగ్జిబిటర్లు భరిస్తున్న వర్చువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్) చార్జీలను లేదా రోజువారీ థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులను నిర్మాతలు పంచుకుంటారా అని ప్రశ్నించారు. ఈ సమస్యలన్నింటినీ ఫిలిం ఛాంబర్ వేదికగా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఒకేతాటిపైకి వచ్చి సుహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

థియేట‌ర్ల మెయింటెనెన్స్, అక్క‌డ ప‌ని చేసే స్టాఫ్ మెయింటెనెన్స్ కి అయ్యే ఖ‌ర్చుల్ని భ‌రించేది ఎగ్జిబిట‌ర్ కాబ‌ట్టి.. నిర్మాత‌కు వాటి నుంచి షేర్ అడ‌గ‌డం న్యాయం కాద‌ని మీరు భావిస్తున్నారా?

Tags:    

Similar News