టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

ప్ర‌స్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ కీలకమైన మలుపులో ఉంది. ఒకప్పుడు సినిమా బడ్జెట్‌లో సగం వాటాను శాటిలైట్ -డిజిటల్ రైట్స్ ద్వారా నిర్మాతలు సులభంగా రికవరీ చేసేవారు.

Update: 2026-07-06 11:30 GMT

ప్ర‌స్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ కీలకమైన మలుపులో ఉంది. ఒకప్పుడు సినిమా బడ్జెట్‌లో సగం వాటాను శాటిలైట్ -డిజిటల్ రైట్స్ ద్వారా నిర్మాతలు సులభంగా రికవరీ చేసేవారు. ఆ రోజుల్లో థియేట్రికల్ రన్‌కు ప్రత్యేకమైన విలువ ఉండేది. కానీ కాలక్రమేణా మారుతున్న సాంకేతికత , ఓటిటి ఆధిపత్యం వల్ల బాక్సాఫీస్ లెక్కలు పూర్తిగా తలకిందులవుతున్నాయి. నిర్మాతల ఆదాయ వనరులు భద్రంగా ఉన్నా? థియేట్రికల్ వ్యవస్థ మాత్రం ఒత్తిడికి లోనవుతోంది. ప్రస్తుతం సినిమాలు థియేటర్లలో విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఓటిటి వేదికల్లో ప్రత్యక్షమవుతున్నాయి.

దీనివల్ల ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం కంటే ఇంట్లోనే ప్రశాంతంగా సినిమా చూసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. థియేట్రికల్ విడుదల , ఓటిటి స్ట్రీమింగ్‌ల మధ్య గ్యాప్ లేకపోవడం వల్ల సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా? బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి వసూళ్లు నమోదు కావడం లేదు. ఈ పోకడ థియేటర్ల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. బాలీవుడ్ తరహాలో టాలీవుడ్ నిర్మాతలు కూడా కనీసం ఎనిమిది వారాల థియేట్రికల్ విండోను పాటించాలని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కోరుతున్నా అది ఆచరణలో కనిపించడం లేదు.

త్వరగా ఓటీటీకి అమ్మడం వల్ల వచ్చే లాభాల కోసం చూస్తున్న నిర్మాతలు థియేట్రికల్ రెవెన్యూ దీర్ఘకాలంలో తగ్గుతుందనే విషయాన్ని విస్మరిస్తున్నారు. ఈ నిబంధనను పాటించకపోవడం వల్ల బాక్సాఫీస్ వద్ద సినిమా ఆయుష్షు దారుణంగా తగ్గిపోతోంది. ఇంతకాలం భారీ ధరలకు సినిమాలు కొనుగోలు చేసిన ఓటిటి సంస్థలు కూడా ఇప్పుడు వ్యూహాలను మార్చుకుంటున్నాయి. స్టార్ వాల్యూ మీద ఆధారపడకుండా ఆయా సినిమాల వ్యూవర్షిప్ ఆధారంగానే లెక్కలు కడుతున్నాయని సమాచారం. థియేటర్లలో సినిమా ఎలా ఆడిందనే దానిపై ఓటిటి సంస్థలు దృష్టి సారిస్తున్నాయి.

బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిన సినిమాలకు ఓటిటిలో కూడా మంచి ధరలు దక్కడం కష్టతరమవుతోంది. సినిమా థియేటర్లో రిలీజ్ కాగానే ఓటీటీకి వస్తుందనే భావన ప్రేక్షకుల్లో బలంగా నాటు కుపోయింది. ఈ నేప‌థ్యంలో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వెళ్లడం తగ్గించారు. కేవలం స్టార్ హీరోల భారీ చిత్రాలకు తప్ప, మిగిలిన చిత్రాలకు థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణ కరువవుతోంది. ఇది ఎగ్జిబిషన్ రంగాన్ని ఆర్థికంగా దెబ్బతీయడమే కాకుండా చిన్న, మధ్యతరహా చిత్రాల మనుగడను కష్టతరం చేస్తోంది. టాలీవుడ్ పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలంటే? నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు , ఓటిటి సంస్థలు ఉమ్మడి నిర్ణయానికి రావాల్సిన సమయం ఆసన్నమైంది.

థియేట్రికల్ విండోను ఖచ్చితంగా పాటించడం , సినిమాల నాణ్యతను పెంచడం ద్వారానే ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వచ్చేలా చేయోచ్చు. డిజిటల్ అమ్మకాలపైనే ఆధార పడకుండా బాక్సాఫీస్ వసూళ్లకు ప్రాధా న్యతనిస్తేనే టాలీవుడ్ పరిశ్రమ ఆరోగ్యకరమైన వృద్ధిని సాధించగలదు.

Tags:    

Similar News