వేదికపై సారీ చెబుతూ కన్నీరు మున్నీరైన గాయని
సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు సునిధి అంకితభావానికి ఫిదా అవుతున్నారు.;
ప్రముఖ నేపథ్య గాయని సునిధి చౌహాన్ లైవ్ కాన్సర్ట్‌లో కన్నీరు పెట్టుకున్న ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన `ఐ యామ్ హోమ్ ఇండియా టూర్ 2025-26`లో భాగంగా లక్నోలో నిర్వహించిన కచేరీలో ఈ గాయని ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. వేదికపై పాట పాడుతున్న సమయంలో గొంతు సహకరించకపోవడంతో తీవ్ర అసహనానికి.. భావోద్వేగానికి లోనయ్యారు. తన కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా గొంతు సమస్య తలెత్తడంతో అభిమానుల ముందు కన్నీటిపర్యంతమయ్యారు.
ఈ సందర్భంగా సునిధి స్టేజ్ పైనే ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. ``నా గొంతు ఈరోజు చాలా దారుణంగా ఉంది.. ఇలా జరగడం నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది.. దయచేసి నన్ను క్షమించండి`` అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ప్రదర్శనలోనూ తాను 100 శాతం ఉత్తమ ప్రతిభ కనబరచాలని కోరుకుంటానని.. కానీ ఈరోజు అనారోగ్యం వల్ల అది సాధ్యం కావడం లేదని చెబుతూ ఆమె స్టేజ్ పైనే ఏడ్చేశారు. సునిధి నిజాయితీని చూసి అక్కడి ప్రేక్షకులు సైతం చలించిపోయారు.
అనారోగ్యంతో గొంతు నొప్పి ఉన్నా.. తనను చూడటానికి వచ్చిన అభిమానులను నిరాశపరచకూడదనే ఉద్దేశంతో సునిధి ప్రదర్శనను కొనసాగించారు. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.. నా గొంతు సహకరించకపోయినా నేను మీ కోసం పాడతాను! అని ఆమె చెప్పిన మాటలు అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి. శారీరక ఇబ్బందుల కంటే కూడా ప్రేక్షకులకు నాణ్యమైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాననే బాధే సదరు గాయనిలో ఎక్కువగా కనిపించింది.
సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు సునిధి అంకితభావానికి ఫిదా అవుతున్నారు. `సునిధి, మీరు గ్రేట్.. మీ నిజాయితీకి హ్యాట్సాఫ్`` అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక కళాకారిణికి తన గొంతు ఎంత ముఖ్యమో.. అది సహకరించనప్పుడు కలిగే వేదన ఎలా ఉంటుందో సునిధి కన్నీళ్లలో కనిపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అనారోగ్యంలోనూ పాటను ఆపకుండా పాడటం ఆమె వృత్తి పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ప్రశంసిస్తున్నారు.
టూర్ లో దేశవ్యాప్తంగా సంగీత ప్రియులను అలరిస్తున్న సునిధి లక్నో కాన్సర్ట్‌లో జరిగిన ఈ ఘటనతో తన అభిమానులకు మరింత దగ్గరయ్యారు. కేవలం స్టార్‌డమ్ మాత్రమే కాదు.. ప్రేక్షకుల పట్ల బాధ్యత ఉన్న సింగర్‌గా మరోసారి ప్రశంసలు అందుకున్నారు. తమ అభిమాన గాయని త్వరగా కోలుకోవాలని.. మళ్ళీ తన మధురమైన గొంతుతో ఉర్రూతలూగించాలని సంగీత ప్రపంచం కోరుకుంటోంది.
వేదికపై ఎమోషనల్ అయిన గాయనీమణులు:
సంగీత ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన టాప్ సింగర్స్ కూడా కొన్ని సందర్భాల్లో లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు భావోద్వేగానికి లోనవుతుంటారు. సునిధి చౌహాన్ మాదిరిగానే గతంలో శ్రేయా ఘోషల్, నీతి మోహన్, నేహా కక్కర్ వంటి భారతీయ గాయనీమణులు కూడా స్టేజ్ పై కన్నీరు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగత బాధలు, పాటలోని లోతైన అర్థం లేదా అభిమానులు చూపే విపరీతమైన ప్రేమను చూసి వారు తన్మయత్వంతో ఎమోషనల్ అవుతుంటారు. ముఖ్యంగా ఒక కళాకారుడు తన ప్రాణంగా భావించే గొంతు సహకరించనప్పుడు కలిగే ఆవేదన వర్ణనాతీతం.
అంతర్జాతీయ స్థాయిలో అడిలె , లేడీ గాగా, సెలిన్ డియాన్ వంటి గాయనీమణులు సైతం తమ కచేరీల్లో ఎన్నోసార్లు భావోద్వేగంతో ప్రసంగించడం లేదా ఏడవడం మనం చూశాం. శారీరక అలసట ఉన్నా.. మానసిక ఒత్తిడి ఉన్నా ప్రేక్షకులను అలరించడం కోసం వారు చేసే ప్రయత్నం గొప్పది. స్టేజ్ మీద వారు చిందించే కన్నీళ్లు వారిలోని సున్నితత్వాన్ని .. తమ వృత్తి పట్ల వారికి ఉన్న గౌరవాన్ని చాటి చెబుతాయి. ఇలాంటి ఎమోషనల్ క్షణాలు అభిమానులకు, సెలబ్రిటీలకు మధ్య ఒక బలమైన బంధాన్ని ఏర్పరుస్తాయి.