రెహ‌మాన్ ప్లేస్ అనిరుద్ క‌బ్జా చేసేసాడా?

భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒకప్పుడు ఏకచ్ఛత్రాధిపత్యం వహించిన పేరు ఏఆర్ రెహమాన్.

Update: 2026-06-25 08:59 GMT

భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒకప్పుడు ఏకచ్ఛత్రాధిపత్యం వహించిన పేరు ఏఆర్ రెహమాన్. ముఖ్యంగా కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌లలోని అగ్ర నటుల చిత్రాలకు ఆయనే మొదటి ఎంపికగా ఉండేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు ట్రెండ్ కూడా మారుతోంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీతో పాటు ఇండియన్ సినిమా ట్రేడ్‌ను గమనిస్తే ఒకప్పుడు రెహమాన్ ఏ స్థానాన్ని అయితే అనుభవించారో? ఇప్పుడు ఆ స్థానాన్ని యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ ఆక్రమించినట్లు కనిపిస్తోంది. స్టార్ హీరోల లైనప్‌లు, భారీ బడ్జెట్ చిత్రాల అనౌన్స్‌మెంట్‌లు చూస్తే అనిరుధ్ పేరే మార్మోగిపోతోంది.

ఒకప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ వంటి కోలీవుడ్ స్టార్స్ సినిమాలైనా.. టాలీవుడ్‌లో భారీ ప్రాజెక్ట్‌లైనా మ్యూజిక్ డైరెక్టర్‌గా రెహమాన్ పేరు మాత్రమే వినిపించేది. ఆయన ఇచ్చే క్లాసిక్ ఆల్బమ్స్, విలక్షణమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాల స్థాయిని పెంచేవి. అయితే గత కొంతకాలంగా రెహమాన్ సినిమా వేగాన్ని తగ్గించారు. ఆయన కేవలం కథాబలమున్న చిత్రాలకు, అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లకు లేదా తన అభిరుచికి తగ్గ దర్శకులకు మాత్రమే పరిమితమవుతున్నారు. కమర్షియల్ మాస్ మసాలా చిత్రాలకు ఆయన కాస్త దూరంగా జరుగుతున్న తరుణంలో ఆ ఖాళీని భర్తీ చేయడానికి అనిరుధ్ రంగంలోకి దిగారు.

ప్రస్తుతం కోలీవుడ్‌లో అనిరుధ్ హవా ఏ రేంజ్‌లో ఉందంటే? అక్కడ ఉన్న దాదాపు అందరు అగ్ర హీరోల ప్రాజెక్టులు ఆయన చేతిలోనే ఉన్నాయి. రజనీకాంత్, విజయ్, అజిత్, సూర్య, శివకార్తికేయన్ వంటి టాప్ స్టార్ల చిత్రాలకు వరుసగా సంగీతం అందిస్తూ బిజీ షెడ్యూల్‌తో గడుపుతున్నారు. అనిరుధ్ కేవలం తమిళ పరిశ్రమకే పరిమితం కాకుండా టాలీవుడ్‌లోనూ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి పాన్-ఇండియా స్టార్స్ చిత్రాలకు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయారు. పెద్ద సినిమాల మేకర్స్ అందరూ కమర్షియల్ సక్సెస్ గ్యారెంటీ కోసం అనిరుధ్ వైపే మొగ్గు చూపుతున్నారు.

నిజానికి రెహమాన్ సంగీత శైలి వేరు, అనిరుధ్ శైలి వేరు. రెహమాన్ మెలోడీలు, ఆల్బమ్స్ కాలాతీతంగా నిలిచిపోయేలా ఉంటాయి. కానీ ప్రస్తుత జనరేషన్ ఆడియన్స్ థియేటర్లలో హై-వోల్టేజ్ ఎనర్జీని, ఇన్స్టంట్ ఎలివేషన్స్‌ను కోరుకుంటున్నారు. అనిరుధ్ ఈ నాడిని సరిగ్గా పట్టుకున్నారు. ఆయన అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లను ఊపేస్తోంది. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతున్నాయి. రీల్స్ ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. సినిమాలకు రిలీజ్ ముందే ఊహించని హైప్ తీసుకొస్తున్నాయి. ఈ కమర్షియల్ అడ్వాంటేజ్ వల్లే స్టార్ హీరోలు, దర్శకులు అనిరుధ్‌ను తమ ప్రాజెక్టుల్లో భాగం చేసుకోవడానికి పోటీ పడుతున్నారు.

అయితే రెహమాన్ క్రేజ్, లెగసీ వేరు. ఆయన సాధించిన ఆస్కార్ అవార్డులు, అంతర్జాతీయ ఖ్యాతిని అంత సులువుగా ఎవరూ అందుకోలేరు. రెహమాన్ ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయడం లేదనే మాట నిజమే అయినప్పటికీ ఆయన చేసే కొన్ని ప్రత్యేకమైన చిత్రాలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. కాకపోతే కమర్షియల్ మార్కెట్ లీడర్‌గా బాక్సాఫీస్ వద్ద క్రేజ్ తెచ్చే బ్రాండ్‌గా మాత్రం అనిరుధ్ ఇప్పుడు రెహమాన్ పాత స్థానాన్ని రీప్లేస్ చేశారనడంలో సందేహం లేదు. సీనియర్ లెజెండ్ నెమ్మదించిన చోట యువ సంచలనం స్పీడ్ పెంచారు.

ఇండస్ట్రీలో జనరేషన్ షిఫ్ట్ అనేది సహజమైన ప్రక్రియ. ఒకప్పుడు ఇళయరాజా స్థానాన్ని రెహమాన్ ఎలాగైతే సరి కొత్త సౌండింగ్‌తో సొంతం చేసుకున్నారో? ఇప్పుడు అదే రీతిలో రెహమాన్ కమర్షియల్ స్పేస్‌ను అనిరుధ్ తన ట్రెండీ మ్యూజిక్‌తో కబ్జా చేశారు. ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమలో మొదలైన అనిరుధ్ మేనియా ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. మరి రాబోయే రోజుల్లో అనిరుధ్ ఇదే రీతిలో నంబర్ వన్ స్థానాన్ని ఎంతకాలం నిలబెట్టుకుంటారో? అలాగే రెహమాన్ మార్క్ క్లాసిక్స్‌తో మళ్లీ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

Tags:    

Similar News