సుక్కూ ఫోకస్.. అదే అతిపెద్ద ఛాలెంజ్?
ఒక సినిమా సక్సెస్ తో డైరెక్టర్ రేంజ్ మారిపోతుంది. కానీ ఆ విజయాన్ని మించి మరో సినిమా ఇవ్వాలంటే మాత్రం మరింత కష్టపడాల్సి ఉంటుంది.
ఒక సినిమా సక్సెస్ తో డైరెక్టర్ రేంజ్ మారిపోతుంది. కానీ ఆ విజయాన్ని మించి మరో సినిమా ఇవ్వాలంటే మాత్రం మరింత కష్టపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ సుకుమార్ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. పుష్ప సిరీస్ తో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న ఆయన.. ఇప్పుడు రామ్ చరణ్ తో చేయబోయే కొత్త సినిమాపై పూర్తి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈసారి కథతో పాటు టెక్నికల్ టీమ్ ఎంపిక ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.
రామ్ చరణ్ లీడ్ రోల్ లో నటించనున్న ఆ సినిమా కోసం ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతుండగా, టెక్నీషియన్ల ఎంపికపై మూవీ టీమ్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. సాధారణంగా సుకుమార్ సినిమాల్లో కథ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో, టెక్నికల్ క్వాలిటీ కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్, యాక్షన్ డిజైన్ వంటి విభాగాల్లో ఎలాంటి రాజీ పడకుండా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో వచ్చిన రంగస్థలం, పుష్ప చిత్రాలు కేవలం కథల వల్లే కాదు.. స్క్రీన్ పై కనిపించిన విజువల్ క్వాలిటీ వల్ల కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రతి ఫ్రేమ్ లో స్పెషాలిటీ కనిపించేలా సుకుమార్ శ్రద్ధ తీసుకుంటారనే పేరుంది. ఇప్పుడు రామ్ చరణ్ తో చేయబోయే సినిమా స్టైలిష్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న నేపథ్యంలో టెక్నికల్ టీమ్ పాత్ర మరింత కీలకంగా మారనుందని భావిస్తున్నారు.
అయితే ఆ ప్రాజెక్ట్ చుట్టూ మరో ఆసక్తికర చర్చ కూడా సాగుతోంది. పుష్ప తర్వాత సుకుమార్ నుంచి వస్తున్న నెక్స్ట్ సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. పాన్ ఇండియా రేంజ్ లో విజయం సాధించిన తర్వాత ఆయన వేసే ప్రతి స్టెప్ పై సినీ అభిమానులు, ఎక్స్పర్ట్స్ దృష్టి పెడుతున్నారు. అందుకే ఆ సినిమా ఆయన కెరీర్ లో మరో కీలక పరీక్షగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సుకుమార్ కెరీర్ ను పరిశీలిస్తే ప్రతి సినిమాలో కొత్తదనాన్ని చూపించడానికి ప్రయత్నించారు. ఆర్య నుంచి రంగస్థలం, పుష్ప వరకు ఆయన ఎంచుకున్న కథలు ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయి. అదే ఆయనను ప్రత్యేక దర్శకుడిగా నిలబెట్టింది. ఇప్పుడు కూడా ప్రేక్షకులు ఊహించని కథ, పాత్రలతో ముందుకు రావాలనే టార్గెట్ తో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. చరణ్ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో భారీ గుర్తింపు పొందిన స్టార్ హీరో. దీంతో ఆ కాంబోపై అంచనాలు మరింత పెరిగాయి. .
సెప్టెంబర్ లో సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉందని, దసరా తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. 2027లో విడుదల టార్గెట్ గా ప్లాన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన అతిపెద్ద చర్చ కథ కంటే టెక్నికల్ టీమ్ గురించే కనిపిస్తోంది. అదే సమయంలో పుష్ప తర్వాత మరోసారి తన అదరగొడతారా అనే ప్రశ్న సుకుమార్ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్!