'ఆత్మ'ని వదిలేస్తున్న లెక్కల మాస్టర్..ఏం జరగుతోంది?
ఇక్కడ శాశ్వత మిత్రులు, శత్రులు అంటూ ఉండరు..అవకాశాలని బట్టి..అవకాశాన్ని బట్టి ఒక్కోసారి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. స్నేహాలు కూడా మారుతుంటాయి;
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చెప్పడం కష్టం. ఇక్కడ శాశ్వత మిత్రులు, శత్రులు అంటూ ఉండరు..అవకాశాలని బట్టి..అవకాశాన్ని బట్టి ఒక్కోసారి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. స్నేహాలు కూడా మారుతుంటాయి. ఒకరితో సుధీర్ఘ ప్రయాణం చేసిన వాళ్లు పరిస్థితుల్ని బట్టి వారిని పక్కన పెట్టి కొత్త వారి కోసం పరుగులు తీయడం ఇక్కడ సర్వసాధారణం. ఒకరితో కలిసి ఏళ్లకు ఏళ్లు ప్రయాణించిన వాళ్లు అకస్మాత్తుగా వాళ్లని పక్కన పెట్టి కొత్తగా ట్రెండ్‌లో ఉన్న వారితో కలిసి ప్రయాణం చేయడం ఇక్కడ నిత్యం జరుగుతూనే ఉంటుంది.
సక్సెస్ మాత్రమే మాట్లాడే ఈ ఇండస్ట్రీలో ఇలాంటి వన్నీ సర్వసాధారణం. కానీ ఒక్కరి విషయంలో మాత్రం ఇది సాధారణం కాదు. అందుకే వారి నిర్ణయాలు షాక్‌కు గురి చేస్తుంటాయి. ఇప్పుడు అలాంటి షాకింగ్ నిర్ణయాన్నే లెక్కల మాస్టారు సుకుమార్ తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వివరాల్లోకి వెళితే..సుకుమార్ `ఆర్య` మూవీతో డైరెక్టర్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఆ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం ప్రధాన బలంగా నిలిచి సినిమా విజయానికి మూలకారణంగా నిలిచింది.
అక్కి నుంచే వీరిద్దరి బంధం బలపడి గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటి వరకు `పుష్ప`, పుష్ప 2తో కలిపి తొమ్మిది సినిమాలొచ్చాయి. అవన్నీ బ్లాక్ బస్టర్స్. `పుష్ప 2` పాన్ ఇండియా వైడ్‌గా ఎలాంటి సంచలనాలు, రికార్డుల్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక దశలో తను సమర్పకుడిగా వ్యవహరించిన సినిమాలకు కూడా దేవితో మ్యూజిక్ చేయించి `ఉప్పెన` లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచేలా చేశారు. అంతే కాకుండా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ తన సినిమాలకు ఆత్మ లాంటిదని కూడా సుకుమార్ స్టేట్మెంట్‌లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అలాంటి ఆత్మని సడన్‌గా సుకుమార్ ఇప్పుడు పక్కన పెడుతుండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం `పెద్ది`లో నటిస్తున్న రామ్ చరణ్‌తో త్వరలో ఓ భారీ పాన్ ఇండియా మూవీకి సుకుమార్ శ్రీకారం చుట్టబోతున్నారు. `రంగస్థలం` తరువాత వీరిద్దరి కలయికలో రానున్న సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే సుకుమార్ మొదలు పెట్టేశారు. దీంతో ఈ మూవీకి కూడా దేవిశ్రీప్రాద్ మ్యూజిక్ చేస్తాడని అంతా అనుకున్నారు కానీ అనూహ్యంగా అతన్ని పక్కన పెట్టేస్తున్నారు సుకుమార్.
అతని స్థానంలో అర్జున్‌రెడ్డి, కబీర్‌సింగ్, యానిమల్ వంటి సంచలన చిత్రాలను సంగీతం అందించి దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న హర్షవర్థర్ రామేశ్వర్‌ని రంగంలోకి దించేస్తున్నారు. ఇప్పటికే టాక్స్ కూడా పూర్తి చేసిన సుకుమార్ త్వరలో మ్యూజిక్ సిట్టింగ్స్‌ని స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఉన్నట్టుండి ఆత్మ లాంటి దేవిని పక్కన పెట్టడానికి కారణం ఏంటనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో మొదలైంది. `పుష్ప 2` సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో పెద్ద రార్ధాంతమే జరిగింది. టైమ్ తక్కువగా ఉండటంతో దేవి కొంత మేరకు మాత్రమే బ్యాగ్రౌండ్ స్కోర్‌ని అందించాడు.
అయితే మిగతా పోర్షన్‌కి తమన్‌తో చేయిద్దామని ప్లాన్ చేశారు కానీ కుదరకపోవడంతో సామ్ సీఎస్‌ని రంగంలోకి దించి పూర్తి చేయించారు. ఇదే సమస్య కారణంగా దేవిని పక్కన పెట్టి రామ్ చరణ్ మూవీకి హర్షవర్థన్ రామేశ్వర్‌ని సుకుమార్ రంగంలోకి దించేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇందులో ఉన్న నిజమెంత అన్నది తెలియాలంటే సుకుమార్ టీమ్ స్పందించాల్సిందే అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.