లగాన్ సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్ అవుతుందా?.. ఆమిర్ మాస్టర్ ప్లాన్!

భారతీయ సినీ చరిత్రలో స్పోర్ట్స్ డ్రామాలకు కొత్త ప్రమాణాలు ఏర్పరచిన లగాన్ తర్వాత డైరెక్ట‌ర్ అశుతోష్ గోవారికర్, హీరో ఆమిర్ ఖాన్ మళ్లీ ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడం బాలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

Update: 2026-07-04 10:30 GMT

భారతీయ సినీ చరిత్రలో స్పోర్ట్స్ డ్రామాలకు కొత్త ప్రమాణాలు ఏర్పరచిన లగాన్ తర్వాత డైరెక్ట‌ర్ అశుతోష్ గోవారికర్, హీరో ఆమిర్ ఖాన్ మళ్లీ ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడం బాలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు దారితీసింది. లల్కారా టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా 2027లో రిలీజ్ టార్గెట్ గా ముందుకు సాగుతుండగా, మరోసారి క్రికెట్ నేపథ్యంతోనే ఆడియ‌న్స్ ను పలకరించబోతుండటం అంచనాలను మరింత పెంచుతోంది. అయితే ఇది కల్పిత కథ కాదు. ఇండియ‌న్ క్రికెట్ హిస్ట‌రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన 1952 ఇండియా- పాకిస్థాన్ టెస్ట్ సిరీస్ ఆధారంగా రూపొందుతున్న పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా కావడం దీనికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది.

స్వాతంత్య్రం, దేశ విభజన తర్వాత రెండు దేశాల మధ్య నెలకొన్న భావోద్వేగ, రాజకీయ పరిస్థితులను క్రికెట్‌తో ముడిపెట్టి చూపించే ప్రయత్నం ఈ సినిమాలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆ కాలంలో క్రికెట్ కేవలం ఆట మాత్రమే కాకుండా జాతీయ గౌరవానికి ప్రతీకగా మారిన తీరు, ఆటగాళ్లపై ఉన్న బాధ్యత వంటి అంశాలను కథలో కీలకంగా మలిచే అవకాశం కనిపిస్తోంది. చారిత్రక సంఘటనలకు సినిమాటిక్ టచ్ ఇస్తూనే వాస్తవానికి దగ్గరగా కథను నడపడం ఈ ప్రాజెక్ట్‌కు పెద్ద సవాల్‌గా మారనుంది.

ఈ సినిమాలో భారత తొలి టెస్ట్ కెప్టెన్లలో ఒకరైన లాలా అమర్నాథ్ పాత్రలో ఆమిర్ ఖాన్ కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజ జీవిత పాత్రలను తెరపై సహజంగా ఆవిష్కరించడంలో ఆమిర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతి పాత్ర కోసం శారీరకంగా, మానసికంగా పూర్తిగా త‌న‌ను తాను మేకోవ‌ర్ చేసుకునే ఆయన శైలి దృష్ట్యా ఈ క్యారెక్ట‌ర్ కోసం కూడా ప్రత్యేక సన్నాహాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక బయోపిక్‌గా ఈ సినిమా నిలిచే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక డైరెక్ట‌ర్ అశుతోష్ గోవారికర్ విషయానికొస్తే, గత కొన్నేళ్లుగా ఆయన్నుంచి వ‌చ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. దీంతో ల‌ల్కారా ఆయనకు అత్యంత కీలక ప్రాజెక్ట్‌గా మారింది. ఒకప్పుడు లగాన్ తో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న డైరెక్ట‌ర్ మళ్లీ ఆ రేంజ్ స‌క్సెస్‌ను అందుకుంటారా అనే ఆసక్తి ఇండస్ట్రీలో కనిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో లగాన్ తో పోలికలు రావడం సహజమే అయినప్పటికీ, రెండు సినిమాల టార్గెట్ హాత్రం భిన్నంగా కనిపిస్తోంది. లగాన్ లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా క్రికెట్ పోరాటం ప్రధానాంశమైతే, లల్కారాలో స్వాతంత్య్రానంత‌ర ఇండియ‌న్ క్రికెట్ హిస్ట‌రీ, దేశభక్తి, ఎమోష‌న్స్ కథకు కేంద్రబిందువుగా నిలవనున్నాయి. అయితే పీరియడ్ బ్యాక్‌డ్రాప్, క్రికెట్‌ను ప్రధాన కథాంశంగా ఎంచుకోవడం, ఎమోష‌న్స్ కు ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలు రెండు సినిమాల మధ్య పోలికలకు కారణమవుతున్నాయి. అందుకే మరోసారి లగాన్ మ్యాజిక్‌ను రిపీట్ చేయగలదా అనే ప్రశ్న ఇప్పుడు అభిమానుల్లో వినిపిస్తోంది.

ఇటీవలి కాలంలో బాలీవుడ్‌లో స్పోర్ట్స్ డ్రామాలు విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే చారిత్రక సంఘటనలు, దేశభక్తి, క్రికెట్, భారీ నిర్మాణ విలువలు అన్నీ ఒకే సినిమాలో కలవడం అరుదు. అదే ల‌ల్కారాకు ప్రత్యేకతగా మారే అవకాశం ఉంది. క్రికెట్‌కు దేశవ్యాప్తంగా ఉన్న ఆదరణతో పాటు దక్షిణాది ప్రేక్షకుల్లోనూ ఈ కథకు కనెక్ట్ అయ్యే అంశాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్టు కనిపిస్తున్నాయి. 2027లో ఇప్పటికే పలు భారీ హిందీ సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్న నేపథ్యంలో లల్కారా కూడా బాక్సాఫీస్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక పోటీదారుగా నిలవొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. స్టోరీ, ఎమోష‌న్స్, హిస్ట‌రీ, క్రికెట్ అనే నాలుగు బలమైన అంశాలను సమతుల్యం చేస్తూ ఆడియ‌న్స్ ను మెప్పించగలిగితే, లల్కారా కేవలం మరో స్పోర్ట్స్ డ్రామాగా కాకుండా కొత్త తరం కోసం గుర్తుండిపోయే సినీ అనుభవంగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News