విజువల్ వండర్ 'నాగబంధం'.. బుక్ మై షో ట్రెండ్స్ తెలిస్తే షాకే..
మైథలాజికల్ ఎలిమెంట్స్ కు విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ అందించే ప్రయత్నం చేశారు.
చిన్న సినిమాగా మొదలై.. ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన మూవీ నాగబంధం. విరాట్ కర్ణ, నభా నటేష్ జంటగా నటించిన ఆ మైథలాజికల్ మూవీకి ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. టీజర్, ట్రైలర్ తో విజువల్ వండర్ గా ప్రమోట్ చేసిన సినిమా జూలై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల తర్వాత రివ్యూలు అటూ ఇటుగా ఉన్నప్పటికీ.. ఆన్ లైన్ లో టికెట్ల సేల్స్ మాత్రం ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి.
కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని నిధి, నాగబంధం, బ్రహ్మకమలం వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. మైథలాజికల్ ఎలిమెంట్స్ కు విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ అందించే ప్రయత్నం చేశారు. విడుదలకు ముందు వచ్చిన టీజర్, ట్రైలర్‌లో విజువల్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు థియేటర్లలోనూ అదే అంశం సినిమాకు ప్రధాన బలంగా మారినట్లు కనిపిస్తోంది.
ముఖ్యంగా భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్, టెక్నికల్ క్వాలిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దర్శకుడిగా అభిషేక్ నామా చేసిన ప్రయత్నానికి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. కొన్ని సన్నివేశాలను తెరపై అద్భుతంగా చూపించారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కథ విషయంలో భిన్నమైన స్పందనలు వినిపిస్తున్నప్పటికీ.. విజువల్ ఎక్స్పీరియన్స్ కోరుకునే వారికి మాత్రం నాగబంధం మంచి ఆప్షన్ గా మారినట్లు తెలుస్తోంది.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. రివ్యూలతో సంబంధం లేకుండా ఆన్లైన్ లో సినిమాకు టికెట్లు బాగా అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా బుక్ మై షోలో నాగబంధం ట్రెండ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 68 వేల టికెట్ల సేల్స్ తో సినిమా సందడి చేస్తోంది.. విడుదలకు ముందు ట్రైలర్ సృష్టించిన ఆసక్తి.. ఇప్పుడు టికెట్ల విక్రయాల్లో కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సాధారణంగా మైథలాజికల్, డివోషనల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కే సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ ఉంటుంది. నాగబంధం విషయంలోనూ అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన డివోషనల్ డ్రామా కావడంతో.. సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దామనే ఆసక్తితో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే శని, ఆదివారాల్లో మంచి వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది.
అయితే సినిమాపై కొన్ని కంప్లయింట్స్ కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కథ విషయంలో మరింత కొత్తదనం ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే సినిమా నిడివి విషయంలోనూ కొంత జాగ్రత్త తీసుకుని ఉంటే రిజల్ట్ మరింత మెరుగ్గా ఉండేదనే టాక్ ఉంది. అయినప్పటికీ ఆ మైనస్ పాయింట్స్ ప్రస్తుతం టికెట్ల సేల్స్ పై ప్రభావం చూపుతున్నట్లు కనిపించడం లేదు. అలా నాగబంధం మూవీకి బుక్ మై షోలో కనిపిస్తున్న 68 వేల టికెట్ల ట్రెండ్ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని చూపిస్తోంది. వీకెండ్ లో ఇదే జోరు కొనసాగితే నాగబంధం సినిమాకు మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది.