సుకుమార్ శిష్యుడిలా అట్లీ శిష్యుడు సాధిస్తాడా?

ఈ కోవకు ఉత్తమ ఉదాహరణగా టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానాను చెప్పుకోవచ్చు.

Update: 2026-06-07 07:03 GMT

చలనచిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకుల వద్ద సహాయ దర్శకులుగా (అసిస్టెంట్ డైరెక్టర్స్) పనిచేసి ఆ తర్వాత దర్శకులుగా మారిన వారు చాలా మందే ఉన్నారు. అయితే వీళ్ల‌లో సక్సెస్ సాధించి తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారు మాత్రం ఏ కొద్దిమందో మాత్రమే కనిపిస్తారు. సినిమాపై పూర్తి అభిరుచి, బలమైన కథాంశం, అద్భుతమైన క్యారెక్టరైజేషన్, ఉత్కంఠ రేకెత్తించే స్క్రీన్‌ప్లే మ్యాజిక్, పదునైన సంభాషణలు, సంగీతం.. ఇలా అన్ని విభాగాలపై పట్టు సాధించిన సహాయ దర్శకులకు మాత్రమే పరిశ్రమలో సుదీర్ఘమైన, ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని ఇప్పటికే పలువురు నిరూపించారు.

ఈ కోవకు ఉత్తమ ఉదాహరణగా టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానాను చెప్పుకోవచ్చు. అత‌డు తన కెరీర్ ఆరంభంలోనే `ఉప్పెన` వంటి ఒక సున్నితమైన ప్రేమకథా చిత్రాన్ని... సాహసోపేతమైన సామాజిక సందేశాన్ని జోడించి అద్భుతంగా తెరకెక్కించారు. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన బుచ్చిబాబు తన రెండో ప్రయత్నంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో `పెద్ది` లాంటి భారీ పాన్-ఇండియా చిత్రాన్ని రూపొందించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. గురువుకు తగ్గ శిష్యుడిగా టాలీవుడ్‌లో తన సత్తా చాటారు.

ఇప్పుడు సరిగ్గా ఇదే తరహాలో కోలీవుడ్ అగ్ర దర్శకుడు అట్లీ ప్రియ‌ శిష్యుడు కూడా మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమవుతున్నారు. బుచ్చిబాబు తన మొదటి సినిమాను అప్ కమింగ్ హీరోతో చేసినట్లుగానే.. ఈ కొత్త దర్శకుడు కూడా ప్రస్తుత యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న ఒక క్రేజీ హీరోతో బరిలోకి దిగుతున్నారు. లవ్ టుడే, డ్రాగన్, డూడ్ వంటి వరుస చిత్రాలతో యూత్ ఐకాన్‌గా మారి, టాలీవుడ్- కోలీవుడ్‌లో సంచలన స్టార్‌గా వెలిగిపోతున్న ప్రదీప్ రంగనాథన్‌తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది.

అట్లీ వద్ద పలు సూపర్ హిట్ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసి ఎన్నో మెళకువలు నేర్చుకున్న ఈ యువ దర్శకుడి చిత్రానికి స్వయంగా గురువు అట్లీనే నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. సుకుమార్ లానే అట్లీ క‌థ‌, క‌థ‌నంపైనా వ‌ర్క్ చేస్తున్నార‌ట‌. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రదీప్ రంగనాథన్ అట్లీ శిష్యుడి కాంబినేషన్‌లో రానున్న‌ చిత్రం బాక్సాఫీస్ వార్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో- బుచ్చిబాబు తరహాలోనే ఈ కొత్త దర్శకుడు కూడా మాసివ్ సక్సెస్ సాధిస్తాడో లేదో చూడాలి.

సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ల బ్రాండ్ ఇమేజ్ వారి శిష్యులకు స్టార్ హీరోలతో అవకాశాల్ని క‌ల్పిస్తుంది. సుకుమ‌ర్ శిష్యుడు ఏకంగా గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తోనే సినిమా తీసి విజ‌యం సాధించారు. ఇప్పుడు అట్లీ శిష్యుడికి కూడా అలాంటి అవ‌కాశం ఉంటుంది. అయితే మొద‌టి సినిమాతో అత‌డు స‌త్తా చాటాల్సి ఉంటుంది.

Tags:    

Similar News