SSMB29 : ఈవెంట్ సెట్‌కి అన్ని కోట్లు ఎందుకు జక్కన్న?
ఎట్టకేలకు మహేష్ బాబు సినిమా అధికారిక ప్రకటన కోసం రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ఒక ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.;
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ముహూర్తం ఖరారు అయింది, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, జక్కన్న రాజమౌళి కాంబోలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన నవంబర్ 15న భారీ ఈవెంట్ నిర్వహించి జక్కన్న అనౌన్స్ చేయబోతున్నాడు. రాజమౌళి తన ప్రతి సినిమా షూటింగ్ సమయంలో లేదా ముందే అన్ని విషయాలను మీడియా ముందు పెట్టేస్తాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన వెంటనే రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో కలిసి రాజమౌళి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. కానీ మహేష్ బాబుతో సినిమా మొదలు పెట్టి చాలా నెలలు అవుతున్నా ఇప్పటి వరకు మీడియా ముందుకు రాకపోవడంతో అసలేం జరుగుతుంది అర్థం కాక అభిమానులతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులు, మీడియా సర్కిల్స్ వారు, ఇండస్ట్రీ వర్గాల వారు జుట్టు పీక్కుంటున్నారు.
#SSMB29 సినిమా అప్‌డేట్స్
ఎట్టకేలకు మహేష్ బాబు సినిమా అధికారిక ప్రకటన కోసం రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ఒక ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. సాధారణంగా ఇలాంటి ఈవెంట్స్ ను అన్ని ఛానల్స్ చివరకు యూట్యూబ్ ఛానల్స్ సైతం లైవ్ ఇచ్చే అవకాశంను కల్పిస్తారు. కానీ రాజమౌళి చాలా కమర్షియల్‌గా ఆలోచిస్తాడు అని మరోసారి నిరూపితం అయింది. నిర్మాత పెట్టిన ప్రతి రూపాయికి పది ఇరవై రూపాయలు రావాలి అనుకుంటాడు. అందుకే #SSMB29 సినిమా అనౌన్స్మెంట్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్ స్టార్‌కి అమ్మేయడం జరిగింది. భారీ మొత్తానికి సదరు ఓటీటీ సంస్థ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసిందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ ఈవెంట్‌ను భారీ ఖర్చుతో మేకర్స్ నిర్వహించబోతున్నారని, అందుకు తగ్గట్లుగానే ఓటీటీ రైట్స్ అమ్మారని ఆఫ్ ది రికార్డ్ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
రాజమౌళి, మహేష్ బాబు కాంబో మూవీ...
రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపుగా రూ.20 కోట్లు ఖర్చు చేసి భారీ ఏర్పాట్లు చేస్తున్నారట. ఎంత మంది వచ్చినా ఇబ్బంది లేకుండా, జాతీయ మీడియా నుంచి అంతర్జాతీయ మీడియా వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సినిమా స్థాయిని అనౌన్స్‌మెంట్ ఈవెంట్ సెట్ తో చూపించాలని దర్శక ధీరుడు రాజమౌళి భావిస్తున్నాడట. అందుకే అత్యంత భారీ ఎల్‌ఈడీని ఏర్పాటు చేసేందుకు గాను అతి పెద్ద స్టాండ్ ను ఏర్పాటు చేస్తున్న ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఏర్పాట్లకు రూ.20 కోట్లు అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఎంత మేరకు నిజం అనేది క్లారిటీ లేదు. కానీ జక్కన్న గురించి తెలిసిన వారు మాత్రం ఆ రూ.20 కోట్ల ఖర్చు నామమాత్రమే, ఆయన స్థాయికి, ఆయన సినిమా స్థాయికి ఈవెంట్ కోసం రూ.50 కోట్లు ఖర్చు చేసినా వర్త్ అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.
ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా #SSMB29
రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబలి కోసం జక్కన్న వేసిన సెట్టింగ్స్ గురించి ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. అలాంటి అద్భుతమైన సెట్టింగ్స్‌ను జక్కన్న #SSMB29 సినిమా కోసం చాలానే వేశాడు. అయితే ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో కేవలం ఈవెంట్ కోసం అత్యంత భారీ సెట్స్‌ను వేయిస్తున్నాడట. సాధారణంగా ఈవెంట్ రెండు మూడు రోజులు ఉండగా సెట్స్ నిర్మాణం మొదలు పెడతారు. కానీ ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెట్ నిర్మాణం ప్రారంభం అయింది. దీన్ని బట్టే ఆ సెట్ స్థాయి ఏంటి, ఎంత పెద్దగా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.
కేవలం సెట్ తో మొత్తం సినిమా స్థాయిని రాజమౌళి చూపించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ ఈవెంట్ లో మహేష్ బాబు, జక్కన్నతో పాటు ఇంకా ఎవరు పాల్గొంటారు అనేది చూడాలి. అంతే కాకుండా మహేష్ బాబు గ్లిమ్స్ వీడియోను ఎప్పుడు విడుదల చేస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల జియో హాట్‌స్టార్‌లో విడుదల చేసిన కొన్ని సెకన్ల గ్లిమ్స్ కి మంచి స్పందన వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వీడియో రావాల్సి ఉంది. అది నవంబర్ 15న వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.