సూర్య - రాజమౌళి క్రేజీ కలయిక వెండితెరపై మరో అద్భుతం!
ఇక ఇదే సందర్భంలో వీరిద్దరి కలయికలో ఒక సినిమా ఎప్పుడు వస్తుందనే అంశంపై అభిమానుల్లో ఊహాగానాలు తారాస్థాయికి చేరాయి.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన ప్రముఖుల కలయిక ఎప్పుడూ ఒక ప్రత్యేక సంచలనాన్ని సృష్టిస్తుంది. తాజాగా చెన్నైలో జరిగిన `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దర్శధీర ఎస్.ఎస్. రాజమౌళి, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వేదికపై రాజమౌళి మాట్లాడిన తీరు..సూర్యపై ఆయన చూపిన అభిమానం ఇండస్ట్రీలో చర్చకు ప్రధాన కారణం.
సూర్య గురించి రాజమౌళి ప్రత్యేకంగా మాట్లాడుతూ, ఈ ఏడాది కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ వంటి విభిన్న చిత్రాలతో డబుల్ ధమాకా విజయాలు సాధించిన సూర్యకు అభినందనలు తెలియజేశారు. ఇదివరకూ మాస్ మసాలా కాప్ అండ్ సింగం పాత్రలతో పాటు.. సరికొత్త న్యూ ఏజ్ కాప్‌గా సూర్య చూపించిన అభినయం సూపర్ ఫంటాస్టిక్‌గా ఉందని ఎంతో కొనియాడారు. అంతేకాకుండా.. సూర్య నటిస్తున్న కొత్త సినిమాను థియేటర్లలో చూసేందుకు తాను నవంబర్ నెలకోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రాజమౌళి తన ప్రసంగంలో స్పష్టం చేశారు.
ఇక ఇదే సందర్భంలో వీరిద్దరి కలయికలో ఒక సినిమా ఎప్పుడు వస్తుందనే అంశంపై అభిమానుల్లో ఊహాగానాలు తారాస్థాయికి చేరాయి. రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్‌ల జోరులో ఉన్నప్పటికీ... సూర్యతో కలిసి పనిచేయాలనే ఆలోచన భవిష్యత్తులో నిజమయ్యే అవకాశం లేకపోలేదు. గ్లోబల్ స్థాయిలో తెలుగు, తమిళ చిత్రసీమలను గర్వపడేలా చేస్తున్న ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే ప్రాజెక్ట్ కోసం కలిసి పనిచేస్తే.. అది బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సూర్య ప్రాజెక్టును రాజమౌళి సరికొత్తగా ప్లాన్ చేస్తారనే అంతా అనుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలో రాజమౌళి కేవలం సూర్య గురించే కాకుండా, `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` చిత్ర విశేషాలను కూడా పంచుకున్నారు. ఇది ఒక మనిషి దెయ్యాన్ని కిడ్నాప్ చేయడం చుట్టూ తిరిగే విభిన్నమైన కథ అని, ఈ వన్-లైన్ పాయింట్ వినగానే తాను పూర్తిగా ఆకట్టుకున్నానని తెలిపారు. ఈ సినిమా ఫస్ట్ కాపీని డబ్బింగ్, మ్యూజిక్ లేకుండా చూస్తున్నప్పుడు తాను నవ్వానని, తన భార్య కంగారుపడేంతగా ఏడ్చానని గుర్తుచేసుకున్నారు. ఫహాద్ ఫాజిల్, సారా ఈ చిత్రంలో అద్భుతంగా నటించారని ప్రశంసించారు.
అలాగే ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించిన దిగ్గజాలు కమల్ హాసన్, నందమూరి బాలకృష్ణ, మోహన్ లాల్‌లకు రాజమౌళి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ చూసి గొప్ప మ్యాజికల్ అనుభవాన్ని పొందాలని ఆయన పిలుపునిచ్చారు. మొత్తానికి రాజమౌళి ప్రసంగం.. సూర్యపై అతడి ప్రశంసలు ఈ వేడుకను మరింత హైలైట్ చేశాయి. ఈ ప్రెస్ మీట్ ఏ సినిమా ప్రమోషన్స్ కోసం అన్నదానికంటే, సూర్య- రాజమౌళి కలిసి పని చేయాలన్నదే అభిమానుల ప్రధాన ఆకాంక్ష.