'ఫౌజీ' బ్యూటీ సౌండింగ్ లేదే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న `పౌజీ` సినిమాలో ఛాన్స్ అందుకుని ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది ఇమ్మాన్వీ ఇస్మైల్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న `పౌజీ` సినిమాలో ఛాన్స్ అందుకుని ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది ఇమ్మాన్వీ ఇస్మైల్. డార్లింగ్ సరసన నటించాలని ఎంతో మంది ఫేమస్ బ్యూటీలో రేసులో ఉన్నా? వాళ్లందర్నీ పక్కనబెట్టి మరీ దర్శకుడు హను రాఘవపూడి ఇమ్మాన్విని ఎంపిక చేసారు. అందుకు తగ్గట్టే అమ్మడు మంచి ట్యాలెంటెడ్. డాన్సింగ్ స్కిల్స్ తో ఇప్పటికే లక్షల్లో ఫాలోవర్లను సంపాదించుకుంది. నటన పరంగా అమ్మడు ఎలాంటి పెర్పార్మర్ అన్నది పౌజీతో ప్రూవ్ అవ్వాలి. ఈ బ్యూటీ సినిమా ప్రారంభోత్సవ వేడుకలో మెరిసిన క్షణం నుంచి టాలీవుడ్ వ్యాప్తంగా పేరు మారుమోగిపోయింది.
హను రాఘవపూడి కథానాయికలను వెండితెరపై ఎంత అందంగా, వైవిధ్యంగా చూపిస్తారో `సీతారామం`తో నిరూపితమవ్వడంతో ఇమ్మాన్వీ పై కూడా అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ఆమె పాత డ్యాన్స్ వీడియోలు, సోషల్ మీడియా రీల్స్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. టాలీవుడ్‌లోకి మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చేసిందంటూ ట్రేడ్ వర్గాలు కూడా భావించాయి.
అయితే ఆరంభంలో కనిపించిన ఆ హడావుడి ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. `ఫౌజీ` అనౌన్స్‌మెంట్ తర్వాత ఇమ్మాన్వీ నుంచి ఎలాంటి పెద్ద చప్పుడు లేదు. కొత్తగా ఆమె వేరే ఏ తెలుగు ప్రాజెక్ట్‌కూ సైన్ చేసినట్లు ప్రచారం జరగకపోవడం.. అలాగే టాలీవుడ్ ఈవెంట్లలో గానీ, సర్కిల్స్‌లో గానీ అమ్మడి పేరు ఎక్కడా పెద్దగా వినిపించ కపోవడంతో ఫౌజీ బ్యూటీ లైనప్ స్తబ్తుగా మారిందనే చర్చ మొదలైంది.
సాధారణంగా ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ సరసన అవకాశం వస్తే ఇతర నిర్మాతలు, దర్శకులు ఆ కథానాయికతో సినిమాలు చేసేందుకు క్యూ కడుతుంటారు. ఆ క్రేజ్‌ను వాడుకుని వరుసగా ప్రాజెక్ట్‌లు దక్కించుకోవడం ఇండస్ట్రీలో సహజంగా జరిగే ప్రక్రియ. కానీ ఇమ్మాన్వీ మాత్రం అందుకు భిన్నంగా సైలెంట్‌గా మొదటి సినిమాపైనే పూర్తి దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. టాలీవుడ్ గ్లామర్ ప్రపంచంలో ఈ రకమైన మౌనం విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
దీని వెనుక హను రాఘవపూడి వ్యూహం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సినిమాలో ఇమ్మాన్వీ పాత్రకు సంబంధించిన లుక్, విశేషాలు ముందుగానే బయటకు రాకుండా చిత్రబృందం జాగ్రత్త పడుతోందని, అందుకే ఆమెను ప్రచారానికి దూరంగా ఉంచుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే `ఫౌజీ` విడుదలై థియేటర్లలో అమ్మడి నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉందో చూసిన తర్వాతే ఆఫర్లు ఇవ్వాలని టాలీవుడ్ మేకర్స్ వెయిట్ అండ్ వాచ్ మోడ్‌లో ఉన్నారా? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
ఏది ఏమైనా ప్రస్తుతం అలముకున్న నిశ్శబ్దం తాత్కాలికమేనని అభిమానులు నమ్ముతున్నారు. ప్రభాస్ సినిమా నుంచి టీజర్ .. పాటలు విడుదలైన తర్వాత ఇమ్మాన్వీ రేంజ్ మారుతుందని భావిస్తున్నారు. ఒక్క సరైన ప్రమోషనల్ కంటెంట్ బయటకు వస్తే చాలు ఫౌజీ బ్యూటీ సౌండింగ్ మళ్లీ టాలీవుడ్‌లో గట్టిగా వినిపించడం ఖాయం. ప్రస్తుతం కనిపిస్తున్న ఈ సైలెన్స్ థియేటర్లలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.