కమెడియన్ సరసన ఎలాంటి భేషజం లేకుండా!
కొందరు కథానాయికలు స్టార్‌డమ్ కోసం చాలా కష్టపడతారు. మరికొందరు త్వరగా దాన్ని సాధిస్తారు. కొందరు ఎప్పటికీ సాధించలేరు.;
అగ్ర కథానాయికగా పరిశ్రమను ఏలిన నటి ఎవరైనా కమెడియన్ సరసన నటిస్తారా? ఒకవేళ అలా నటిస్తే తమ ఇమేజ్ ఏమైపోవాలి? అందుకే చాలామంది టాప్ హీరోయిన్‌లు కమెడియన్లు, చిన్న స్థాయి హీరోల సరసన నటించడానికి నామోషీ ఫీలవుతారు. కానీ ఎన్టీఆర్, ఏఎన్నార్, రజనీకాంత్, చిరంజీవి, కృష్ణ లాంటి అగ్ర కథానాయకుల సరసన నటించిన శ్రీదేవి ఆ రోజుల్లోనే ప్రముఖ హాస్య నటుడు రాజబాబు సరసన కథానాయికగా నటించారు. ఇది నిజానికి అందరినీ ఆశ్చర్యపరిచింది.
కొందరు కథానాయికలు స్టార్‌డమ్ కోసం చాలా కష్టపడతారు. మరికొందరు త్వరగా దాన్ని సాధిస్తారు. కొందరు ఎప్పటికీ సాధించలేరు. కానీ స్టార్ డమ్ అందిపుచ్చుకున్న తర్వాత దానిని కాపాడుకునేందుకు చాలా పాట్లు పడాల్సి ఉంటుంది. పెద్ద హీరోలతో తప్ప చిన్న హీరోలు, కమెడియన్లతో నటించే పరిస్థితి అసలే ఉండదు. తమ వ్యక్తిగత ఇమేజ్‌కి భంగం కలగనీకుండా తమ స్టాటస్‌ని మెయింటెయిన్ చేసేందుకు చాలా శ్రమిస్తారు.
కానీ ఇమేజ్ తో పని లేకుండా కమెడియన్ రాజబాబు సరసన నటించి ఆశ్చర్యపరిచారు శ్రీదేవి. బాలనటిగా కెరీర్ ప్రారంభించి పదహారేళ్ల వయసులో హీరోయిన్ అయిన శ్రీదేవి ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, రజనీకాంత్, కృష్ణ, శోభన్ బాబు వంటి సౌత్ టాప్ హీరోలతో నటించింది. అసాధారణ స్టార్ డమ్‌ని కూడా అందుకుంది.
1975లో వచ్చిన `దేవుడు లాంటి మనిషి` చిత్రంలో శ్రీదేవి హాస్యనటుడు రాజబాబు సరసన నటించింది. వారిద్దరిపై ఒక యుగళగీతం కూడా ఉంది. ఆమె కెరీర్ తొలినాళ్లలో చేసిన ఈ పాత్ర గురించి తెలుసుకుని చాలా మంది అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఓవైపు బాలీవుడ్ టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకునే సమయంలోనే శ్రీదేవి సాహసం షాకిచ్చింది. కెరీర్ ఆరంభం అనుభవం కోసం చిన్న హీరో- పెద్ద హీరో అనే తేడాలు వచ్చిన ప్రతి అవకాశాన్ని శ్రీదేవి సద్వినియోగం చేసుకున్నారు.
ఆశ్చర్యకరంగా శ్రీదేవి తాను కథానాయికగా నటించిన కొందరు హీరోలకు మనవరాలిగా కూడా నటించింది. కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మనవరాలిగా శ్రీదేవి నటించింది. ఆ తర్వాత వారి సరసన హీరోయిన్‌గా మారింది. విమర్శలు ఉన్నప్పటికీ ఈ సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. ఏఎన్నార్ సరసన నటించిన శ్రీదేవి నాగార్జునకు కథానాయికగాను నటించారు.