శ్రీలీలకు తెలుగు ఛాన్సులు తగ్గాయా? లేక?
ప్రస్తుతం ఆమె లైనప్ లో ఒక్క టాలీవుడ్ మూవీ కూడా లేకపోవడం ఆ చర్చకు మరింత బలం ఇస్తోంది. అయితే అదే సమయంలో కోలీవుడ్, బాలీవుడ్ లో మాత్రం ఆమె బిజీగా మారుతోంది.
టాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన బ్యూటీల్లో శ్రీలీల పేరు కచ్చితంగా ముందుంటుంది. తనదైన అందం, డాన్స్, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆమె కెరీర్ పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. వరుస సినిమాలతో దూసుకెళ్లిన శ్రీలీల ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
నిజానికి.. శ్రీలీల ఎంబీబీఎస్ చదువుకుంటూనే సినిమాల్లోకి అడుగు పెట్టింది. 2019లో వచ్చిన కన్నడ చిత్రం కిస్ తో హీరోయిన్ గా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు సైమా బెస్ట్ డెబ్యూ హీరోయిన్ అవార్డు దక్కింది. ఆ తర్వాత దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రూపొందిన పెళ్లి సందDతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డారు.
అయితే శ్రీలీల కెరీర్ కు అసలు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది ధమాకా. ముఖ్యంగా పల్సర్ బైక్ పాటలో ఆమె వేసిన స్టెప్పులకు అంతా ఫిదా అయ్యారు. ఆ ఒక్క సినిమాతోనే ఆమె స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంది. బాలకృష్ణ భగవంత్ కేసరిలో విజ్జి పాప పాత్రలో నటించి నటిగా కూడా ప్రశంసలు అందుకుంది. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేయగలనని ప్రూవ్ చేసుకున్నారు.
ఆ తర్వాత గుంటూరు కారం వంటి భారీ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్న అమ్మడు.. అలాగే పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ లో కనిపించారు.. కానీ ఈ మధ్య ఆమె చేసిన కొన్ని పెద్ద సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించకపోవడం సెలక్షన్ పై చర్చ మొదలైంది. ఇప్పుడు ముఖ్యంగా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే.. శ్రీలీలకు తెలుగులో అవకాశాలు తగ్గాయా? లేక ఆమెనే ఆచితూచి వ్యవహరిస్తుందా? అనేది.
ప్రస్తుతం ఆమె లైనప్ లో ఒక్క టాలీవుడ్ మూవీ కూడా లేకపోవడం ఆ చర్చకు మరింత బలం ఇస్తోంది. అయితే అదే సమయంలో కోలీవుడ్, బాలీవుడ్ లో మాత్రం ఆమె బిజీగా మారుతోంది. ఇప్పటికే తమిళంలో పరాశక్తి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీలీల, ఇప్పుడు ధనుష్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది.
కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఓ సినిమా చేస్తుండగా, ఇబ్రహీం అలీ ఖాన్ తో మరో ప్రాజెక్ట్ కు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే కథల ఎంపిక విషయంలో కూడా శ్రీలీల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. 'కేవలం గ్లామర్ పాత్రలు కాకుండా, నటిగా గుర్తుండిపోయే పాత్రలు చేయాలని ఉంది. వైవిధ్యమైన కథలకే ప్రాధాన్యం ఇస్తాను' అని ఆమె ఇటీవల చేసిన కామెంట్స్ అందుకు కారణం.
దీంతో కథలు నచ్చక కొన్ని ప్రాజెక్టులు ఆమె వదులుకుంటోందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఆమె పారితోషికం కూడా భారీగా పెరిగిందని, అందుకే కొందరు నిర్మాతలు ఇతర హీరోయిన్ల వైపు చూస్తున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ, ఒకప్పుడు వరుసగా తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల చేతిలో ఇప్పుడు ఒక్క టాలీవుడ్ మూవీ కూడా లేకపోవడం మాత్రం గమనార్హం.