శ్రీలీల మళ్లీ లేచే అవకాశం ఉందా...?

కన్నడంలో చిన్నా చితకా సినిమాలు చేస్తూ కెరీర్‌ను ప్రారంభించిన శ్రీలీలకు అనుకోని అవకాశం అన్నట్లుగా రాఘవేంద్రరావు 'పెళ్లి సందడి' సినిమాలో నటించే అవకాశం దక్కింది.;

Update: 2026-04-23 05:51 GMT

కన్నడంలో చిన్నా చితకా సినిమాలు చేస్తూ కెరీర్‌ను ప్రారంభించిన శ్రీలీలకు అనుకోని అవకాశం అన్నట్లుగా రాఘవేంద్రరావు 'పెళ్లి సందడి' సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఏరి కోరి మరీ రాఘవేంద్రరావు శ్రీలీలను ఎంపిక చేశాడని, ఆ సినిమాలో శ్రీలీలను ప్రత్యేకంగా, మరింత అందంగా కనిపించేందుకు గాను రాఘవేంద్ర రావు కొన్ని సీన్స్‌ సైతం దర్శకత్వం వహించాడు అంటారు. ఆ విషయం పక్కన పెడితే పెళ్లి సందడి సినిమా నిరాశను మిగిల్చింది. అయినా కూడా శ్రీలీలకు మాత్రం దర్శకేంద్రుడు మెచ్చిన హీరోయిన్‌ అంటూ పేరు దక్కింది. దాంతో వార్తల్లో నిలిచింది. టాలీవుడ్‌లో మొదటి సినిమా ఫ్లాప్‌ అయితే ఆఫర్లు పెద్దగా రావు. కానీ శ్రీలీలకు మాత్రం మంచి ఆఫర్లు వచ్చాయి. రవితేజకు జోడీగా నటించిన 'ధమాకా' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో శ్రీలీల టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిన విషయం తెల్సిందే.

ధమాకాతో సూపర్‌ హిట్‌ కొట్టిన శ్రీలీల...

హీరోయిన్‌గా శ్రీలీల ధమాకాతో సూపర్‌ హిట్‌ కొట్టడంతో ఏకంగా అరడజను సినిమా ఆఫర్లు ఆమె చేతిలో పడ్డాయి. ఆ సినిమాల్లో కొన్ని ఫ్లాప్‌ అయితే కొన్ని పర్వాలేదు అన్నట్లుగా నిలిచాయి. గత మూడు నాలుగు ఏళ్లుగా శ్రీలీల వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. పుష్ప 2 లో చేసిన కిస్సిక్‌ డాన్స్‌ తో బాలీవుడ్‌ ప్రేక్షకులు, తమిళ్‌ ప్రేక్షకులు సైతం ఈమె వైపు చూశారు. అందుకే తమిళ్‌, హిందీ సినిమాల్లో నటించే అవకాశాలు దక్కాయి. ఇప్పటికే తమిళ్‌లో ఈమె పరాశక్తి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్‌లో అనురాగ్‌ బసు దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తోంది. తమిళ్‌లో చేసిన పరాశక్తి ఫ్లాప్‌ కాగా, హిందీలో ఎంట్రీ ఇవ్వాల్సిన అనురాగ్‌ బసు మూవీ ఆలస్యం అవుతూ వస్తోంది. హిందీలో ఈమె ఎంట్రీ ఉంటుందా అనే అనుమానాలు సైతం కొందరు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో శ్రీలీల కెరీర్‌ పై ఆందోళన మొదలైంది.

పరాశక్తి, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలతో...

గత సంవత్సరం రాబిన్‌హుడ్‌, జూనియర్‌, మాస్‌జాతర సినిమాలతో శ్రీలీల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూడు సినిమాల్లో ఏ ఒక్కటి కమర్షియల్‌గా బిగ్‌ సక్సెస్‌ను దక్కించుకోలేదు. ఇక ఈ ఏడాది ఇప్పటికే పరాశక్తి, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలతో వచ్చింది. శివకార్తికేయన్‌ హీరోగా వచ్చిన పరాశక్తి తమిళ బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో శ్రీలీలను అక్కడ కనీసం పట్టించుకోలేదు. ఇక తెలుగులో పవన్‌ హీరోగా వచ్చిన ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాకు పర్వాలేదు అన్నట్లుగా టాక్‌ వచ్చినా.... సినిమాలోని ఆమె పాత్ర విషయంలో పెద్దగా మార్కులు పడలేదు. పవన్‌ ముందు ఆమె కనిపించలేదు. అందుకే ఆ సినిమా శ్రీలీలకు పెద్దగా మైలేజ్ తెచ్చి పెట్టలేదు అనేది వాస్తవం. అందుకే శ్రీలీల ఇప్పుడు ఆఫర్ల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ సినీ విశ్లేషకులు, మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్‌లో శ్రీలీల...

శ్రీలీల కెరీర్‌ ఆరంభం నుంచి కూడా కానిస్టెంట్‌గా సక్సెస్‌లను దక్కించుకోలేక పోయింది. అందుకే ఇండస్ట్రీలో శ్రీలీల ఎప్పటికప్పుడు ఆఫర్ల కోసం వెయిట్‌ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు ఏమీ చేయని శ్రీలీల హిందీలో ఎప్పుడో ప్రారంభం అయిన అనురాగ్‌ బసు మూవీపై ఆశలు పెట్టుకుంది. ఆ సినిమా పూర్తి అయ్యి, విడుదల అయ్యేనా అనే అనుమానాలు ఉన్నాయి. మరో వైపు ధనుష్ హీరోగా రూపొందుతున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా ఎంపిక అయిందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు. ధనుష్‌ తో సినిమా ఓకే అయితే శ్రీలీల కాస్త గాడిన పడ్డట్లు అవుతుంది. ఆ సినిమా హిట్ అయితే శ్రీలీల మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుందని అభిమానులు అంటున్నారు. శ్రీలీల కెరీర్‌కి ఈ ఏడాది అత్యంత కీలకం కానుంది. ఈ ఏడాదిలో కనీసం ఒకటి రెండు హిట్స్ అయినా శ్రీలీల దక్కించుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News