కష్టాల్లో శ్రీలీల ఫస్ట్ మూవీ... బయట పడేనా?
టాలీవుడ్‌లో వరుస సినిమాలతో శ్రీలీల దూసుకు పోతుంది. ఇటీవల 'జూనియర్' సినిమాతో తెలుగు, కన్నడ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.;
టాలీవుడ్‌లో వరుస సినిమాలతో శ్రీలీల దూసుకు పోతుంది. ఇటీవల 'జూనియర్' సినిమాతో తెలుగు, కన్నడ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా పర్వాలేదు అనిపించింది, అయితే ఆ సినిమాలోని శ్రీలీల డాన్స్‌కి మంచి పేరు వచ్చింది. ఈ ఏడాదిలో వచ్చిన నితిన్ రాబిన్ హుడ్ సినిమా నిరాశ పరిచిన నేపథ్యంలో ఇక ముందు రాబోతున్న మాస్ జాతర, హిందీ మూవీ ఆషికి 3 పై ఆశలు పెట్టుకుని ఉంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఆషికి 3 సినిమాతో అడుగు పెట్టబోతున్న శ్రీలీల అక్కడ పెద్ద బ్రేక్ లభిస్తుందని భావిస్తుంది. కానీ ఆషికి 3 ప్రారంభించినప్పటి నుంచి అడ్డంకులు ఎదుర్కొంటుంది. తీవ్రమైన కష్టాల్లో ఉన్న ఆషికి 3 సినిమా అసలు విడుదల అయ్యేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టైటిల్ నుంచి మొదలుకుని కథ వరకు చాలా వివాదాలు ఉన్నాయి.
సయ్యారా విడుదల తర్వాత కష్టాలు
ఆషికి 3 అంటూ మొదట ఈ సినిమాకు టైటిల్ అనుకున్నారు. కానీ ఆషికి ప్రాంచైజీతో ఈ సినిమాకు సంబంధం లేదని దర్శకుడు అనురాగ్ బసు ప్రకటించడం జరిగింది. త్వరలోనే కొత్త టైటిల్‌ను ఈ సినిమా కోసం ప్రకటించబోతున్నట్లు అధికారికంగా వెళ్లడించారు. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా సగం పూర్తి అయింది. మిగిలిన సగం స్పీడ్‌గా పూర్తి చేసి ఇదే ఏడాది చివరి వరకు విడుదల చేయాలని భావించారు. కానీ బాలీవుడ్ సెన్షేషనల్ సూపర్ హిట్ మూవీ సయ్యారా విడుదల అయిన తర్వాత శ్రీలీల మొదటి హిందీ సినిమా మరింత లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం ఈ రెండు సినిమాల కథలు సేమ్ ఉండటం అని సమాచారం.
కార్తీక్ ఆర్యన్‌కి జోడీగా శ్రీలీల
సయ్యారా కథను పోలి ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉండటం వల్ల అనురాగ్ బసు ఇప్పటికే రూపొందించిన కొన్ని సీన్స్‌ను రీ షూట్ చేసేందుకు సిద్దం అవుతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బాలీవుడ్‌లో శ్రీలీల ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా కష్టాల కడలిని ఈదుతోంది. ముందు ముందు అయినా ఈ సినిమా పూర్తి అయ్యేనా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. సయ్యారా సినిమాతో పోలిక ఉంటే కథను పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. అలా మార్చకుండా కొంత కొంత మార్చితే ఖచ్చితంగా పెద్ద డ్యామేజ్ తప్పదు. అందుకే ఈ మొత్తం వ్యవహారం ఒక కొలిక్కి రావాలి అంటే ఖచ్చితంగా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న కార్తీక్ ఆర్యన్ సినిమా ఈ ఏడాదిలో వచ్చే అవకాశాలు కనిపించడం లేదు అంటూ అప్పుడే ప్రచారం మొదలైంది.
కోలీవుడ్‌లో 'పరాశక్తి'తో ఎంట్రీ
శ్రీలీల ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. ఈ ఏడాదిలో హిందీలో డెబ్యూ ఇచ్చి, వచ్చే ఏడాది ఆరంభంలో కోలీవుడ్‌లో డెబ్యూ ప్లాన్ చేసుకుంది. కోలీవుడ్‌లో శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న పరాశక్తి సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రముఖ దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీల పాత్ర చాలా బాగుంటుందని, ఇది ఖచ్చితంగా శ్రీలీలకు కోలీవుడ్‌లో బిగ్ ఎంట్రీ మూవీగా నిలువబోతుందని అంటున్నారు. కోలీవుడ్‌లో మంచి ఎంట్రీ కన్ఫర్మ్ కానీ, బాలీవుడ్‌లోనే ఈమె డెబ్యూ కష్టాల్లో ఉంది. ఈ కష్టాలన్నీ బయట పడి కార్తీక్ ఆర్యన్ మూవీ విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకునేనా అనేది కాలమే నిర్ణయించాలి.