ధనుష్ మూవీ సెట్‌లో సూపర్‌ స్టార్‌ పాట..!

బాలీవుడ్‌లో మాదిరిగా సౌత్‌ స్టార్‌ హీరోల మధ్య సఖ్యత ఉండదని అంటారు. అది ఒకప్పటి మాట.. ఇప్పుడు యంగ్‌ హీరోల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి.;

Update: 2025-07-09 13:30 GMT

బాలీవుడ్‌లో మాదిరిగా సౌత్‌ స్టార్‌ హీరోల మధ్య సఖ్యత ఉండదని అంటారు. అది ఒకప్పటి మాట.. ఇప్పుడు యంగ్‌ హీరోల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ స్టార్‌ హీరోల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒకరు ఇద్దరు హీరోలు మినహా అందరూ అందరితో సన్నిహితంగా ఉంటారు, పార్టీల సమయంలో కలుస్తారు, ఒకరి సినిమాకు ఒకరు స్పందిస్తారు, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. మహేష్ బాబు ఎంతో మంది టాలీవుడ్‌ స్టార్స్‌తో సన్నిహితంగా ఉంటాడు అనే విషయం తెల్సిందే. ఇక కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్ సైతం ఇతర హీరోలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారు.

ముఖ్యంగా సూపర్‌ స్టార్‌ విజయ్‌కి, మరోసారి ధనుష్‌కి మధ్య సన్నిహిత సంబంధాలు ఉంటాయి, ఇద్దరూ తరుచూ ఏదో ఒక విషయం గురించి స్పందిస్తూ, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ధనుష్ నుంచి విజయ్‌కి అన్ని విధాలుగా సహకారం అందుతూ ఉంటుందని కోలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తూ ఉంటుంది. విజయ్‌ తో సన్నిహిత సంబంధాలను సుదీర్ఘ కాలంగా ధనుష్ కొనసాగిస్తూనే ఉన్నాడు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం నేపథ్యంలో ఒకరి మూవీ సెట్‌లో మరొకరు సినిమా షూటింగ్‌ చేసుకోనున్నారు. ధనుష్ మూవీ కోసం దాదాపు రూ.4.5 కోట్లు పెట్టి వేసిన భారీ సెట్టింగ్‌లో విజయ్ నటిస్తున్న జననాయగన్‌ సినిమా పాటను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

విజయ్‌ చివరి మూవీగా ప్రచారం జరుగుతున్న జన నాయగన్‌ సినిమాలోని ఒక పాట కోసం సెట్‌ నిర్మించాల్సి వచ్చిందట. ధనుష్‌ మూవీ కోసం వేసిన సెట్‌ ఈ పాటకి సరిగ్గా సెట్‌ అవుతుందని భావించిన మేకర్స్‌ యూనిట్‌ సభ్యులను సంప్రదించడం జరిగిందట. ధనుష్‌ మంచి మనసుతో తన సినిమా కోసం వేసిన సెట్‌లో జన నాయగన్‌ సినిమా పాట చిత్రీకరణకు ఓకే చెప్పారని సమాచారం అందుతోంది. సాధారణంగా ఇలాంటివి అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఒక స్టార్‌ హీరో సినిమా కోసం వేసిన సెట్‌లో మరో స్టార్‌ హీరో సినిమా షూటింగ్‌ చేయడం అనేది అరుదుగా మాత్రమే జరుగుతుంది. ఒకే నిర్మాణ సంస్థలో ఇద్దరు హీరోల సినిమాలు రూపొందుతున్నా అలాంటివి జరగవు.

జన నాయగన్‌ సినిమా తర్వాత విజయ్ పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా మారబోతున్నాడు. సినిమాల్లో మళ్లీ కనిపించే అవకాశం లేదని అంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జన నాయగన్‌ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించింది. బాలీవుడ్‌ స్టైలిష్ విలన్‌ బాబీ డియోల్‌ ఈ సినిమాలో విలన్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్ తదితరులు నటించారు. షూటింగ్‌ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతాన్ని అందించాడు. సినిమా భారీ బడ్జెట్‌తో కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ లో రూపొందుతోంది. సినిమా చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత టీజర్‌ ను విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.

Tags:    

Similar News