కూలీ నటుడికి బిగ్ షాక్.. దుబాయ్ కి అనుమతి నిరాకరణ!
మలయాళ సినీ ఇండస్ట్రీలో నటుడుగా , నిర్మాతగా పేరు సంపాదించిన నటుడు సౌబిన్ షాహిర్. ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.;
మలయాళ సినీ ఇండస్ట్రీలో నటుడుగా , నిర్మాతగా పేరు సంపాదించిన నటుడు సౌబిన్ షాహిర్. ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఎన్నో చిత్రాలలో నటించి బాగానే పేరు సంపాదించారు. ముఖ్యంగా మంజుమ్మెల్ బాయ్స్ సినిమాలో నటించి భారీగానే క్రేజ్ సంపాదించారు. ఈ చిత్రంలో నటుడిగానే కాకుండా ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో ఇటీవల లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. టాలీవుడ్ హీరో నాగార్జున విలన్ గా నటించిన 'కూలీ' సినిమాలో కూడా నటించారు. ముఖ్యంగా "మోనిక" అనే పాటలో పూజా హెగ్డే తో కలిసి మాస్ స్టెప్పులేసి మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు సౌబిన్ షాహీర్. ఒకరకంగా చెప్పాలి అంటే ఇందులో తన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకొని.. భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.
దుబాయ్ కి అనుమతి నిరాకరించిన కోర్టు..
అలాంటి ఈయనకు ఇప్పుడు భారీ షాక్ తగిలింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా దుబాయ్ కి అనుమతిని నిరాకరిస్తూ కోర్ట్ జారీ చేసిన ఉత్తర్వులు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. దీంతో అసలు ఏం జరిగింది అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు ఫ్యాన్స్. అసలు విషయంలోకి వెళ్తే.. మంజుమ్మెల్ బాయ్స్ చిత్రానికి సంబంధించి చీటింగ్ కేసులో అతడిని అరెస్టు చేశారు. సౌబిన్ షాహీర్ తోపాటు ఈయన తండ్రి బాబూ షాహీర్, షాన్ ఆంథోనీ కూడా ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు.కేవలం 20 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం ఏకంగా రూ.250 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
మంజుమ్మెల్ బాయ్స్.. చీటింగ్ కేసులో అరెస్ట్..
అయితే ఈ మంజుమ్మెల్ బాయ్స్ లాభాల విషయంలో నిర్మాతలు సౌబిన్ షాహిద్ ,బాబు షాహిర్ , షాన్ ఆంథోనీ ల పైన పెట్టుబడి దారుడు పలు సంచలన ఆరోపణలు చేశారు. తన చేత 7 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టించి, 40 శాతం వాటా ఇస్తామని చెప్పి, చివరిగా రూ.40కోట్లకి బదులు రూ. 5.99 కోట్లు మాత్రమే ఇచ్చారని సిరాజ్ కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో నిర్మాతల పైన చీటింగ్ కేసు నమోదు అయింది. ఈ కేసుకు సంబంధించి జూలైలో మొదటివారంలో ఈయనను అరెస్టు చేశారు. ఈయనతో పాటు సహనిర్మాతలు బాబు షాహీర్, షాన్ ఆంథోనీలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు మరోవైపు ఈ విషయం పైన విచారణ జరుగుతున్న సమయంలో ముందస్తు బెయిల్ కోసం , ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ నిర్మాతలు కేరళ కోర్టుకి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. దాంతో అరెస్టు చేసిన రోజే వీరిని పోలీసులు విడుదల చేయడం జరిగింది. అయితే వీరికి అప్పుడు తాత్కాలిక బెయిల్ లభించిన విషయం తెలిసిందే.
సౌబిన్ అభ్యర్థనను తిరస్కరించిన ఎర్నాకులం కోర్టు..
ఆ బెయిల్ లభించినప్పుడు.. సౌబిన్ షాహిర్ విదేశాలకు ప్రయాణించకుండా కూడా నిషేధించబడ్డారు. అయితే సౌబిన్ ఈ నెలలో తాను దుబాయ్ కు ప్రయాణించడానికి అనుమతి కోరినప్పటికీ ఆ అనుమతిని తిరస్కరించింది కోర్టు. సెప్టెంబర్ 5న దుబాయ్ లో జరిగే అవార్డు వేడుకలకు హాజరు కావాల్సి ఉండగా.. అయితే ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో షాహిర్ దుబాయ్ కి ప్రయాణించకుండా ఎర్నాకులం మెజిస్ట్రేట్ కోర్టు నిషేధం విధించింది.