3 కోట్ల లాభానికి ఫ్లాట్ అమ్మిన టాలీవుడ్ విలన్
ఈ రంగంలో తెలివైన పెట్టుబడులతో వివేక్ ఒబెరాయ్, హృతిక్ రోషన్ సహా చాలామంది స్టార్లు భారీగా ఆర్జిస్తున్నారు.;
5 కోట్లు 12ఏళ్లలో 8 కోట్లు అయింది. డబ్బుకు డబ్బు రావాలంటే బ్యాంకు డిపాజిట్లలో 12 ఏళ్లు పైగా పడుతుంది. కానీ రియల్ ఎస్టేట్ లో సరైన విధానంలో పెట్టుబడులు పెడితే పదింతలు లాభాలు అందుకోవడం కష్టం కాదని అమితాబ్ బచ్చన్- అభిషేక్ బచ్చన్ లాంటి దిగ్గజ పెట్టుబడి దారులు నిరూపించారు.
ఈ రంగంలో తెలివైన పెట్టుబడులతో వివేక్ ఒబెరాయ్, హృతిక్ రోషన్ సహా చాలామంది స్టార్లు భారీగా ఆర్జిస్తున్నారు. అదే బాటలో ఇప్పుడు సోను సూద్ కూడా 3 కోట్ల లాభం కళ్లజూసాడు. అయితే అతడు దీనికోసం ఏకంగా 12ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. నటుడు సోను సూద్ ముంబైలోని మహాలక్ష్మి ఏరియాలో ఒక అపార్ట్‌మెంట్‌ను రూ.8.10 కోట్లకు విక్రయించారని సమాచారం. స్క్వేర్ యార్డ్స్ వివరాల ప్రకారం.. ఆగస్టులో డీల్ పూర్తయింది. 2012లో రూ.5.16 కోట్లకు ఆస్తిని కొనుగోలు చేయగా, ఇప్పుడు 8.10కోట్లకు అమ్మాడు. తద్వారా 57 శాతం లేదా రూ.2.94 కోట్ల లాభం వచ్చింది.
సోను సూద్ విక్రయించిన అపార్ట్‌మెంట్ లోఖండ్‌వాలా మినర్వాలో ఉంది. ఇది 1,247 చదరపు అడుగుల (116 చదరపు మీటర్లు) కార్పెట్ ఏరియా, 139.07 చదరపు మీటర్ల (1,497 చదరపు అడుగుల) బిల్ట్ అప్ ఏరియాను కలిగి ఉంది. ఈ ఫ్లాట్ ఒప్పందంలో రెండు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. ఈ లావాదేవీకి రూ.48.60 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లింపు రూ.30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించారని తెలుస్తోంది. మహాలక్ష్మి ఏరియాలో లోఖండ్ వాలా చాలా ఫేమస్ ఏరియా. దక్షిణ ముంబైలో బాగా స్థిరపడిన ప్రాంతం. నివాస, వాణిజ్య సముదాయాలకు పెట్టింది పేరు. ఇక్కడ చాలా మంది సెలబ్రిటీలు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారు.
సోనుసూద్ సినీపరిశ్రమలో 25 ఏళ్ల కెరీర్ ని పూర్తి చేసుకుంటున్నాడు. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అతడు పాపులర్ నటుడు. ఇటీవల హిందీలో స్వీయదర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించాడు. తదుపరి నటుడిగా తిరిగి బీజీ కానున్నాడు. తెలుగులోను అగ్ర హీరోల సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం.