వారి నిస్సహాయతను అర్థం చేసుకోండి.. ఇండిగో సిబ్బంది పై రియల్ హీరో పోస్ట్!
ఈ నేపథ్యంలోనే ఇండిగో సిబ్బందికి అండగా.. రియల్ హీరోగా పేరు సొంతం చేసుకున్న సోనూ సూద్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.;
ప్రయాణాలను సులభతరం చేస్తూ.. సమయాన్ని ఆదా చేస్తూ.. సరైన గమ్యస్థానానికి జాగ్రత్తగా ప్రయాణికులను చేరవేయడంలో విమానాలు మొదటి ప్రాధాన్యతను సంతరించుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశంలో అతిపెద్ద ఎయిర్ లైన్స్ సంస్థగా పేరు సొంతం చేసుకున్న ఇండిగో.. అతి తక్కువ టికెట్ ధరకే సుదూర మార్గాలకు కూడా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ మంచి పేరును దక్కించుకుంది.
అయితే అలాంటి ఇండిగో ఇప్పుడు ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొత్త నిబంధనలు అమల్లోకి రావడం.. పైలెట్ల కొరత.. శీతాకాలం.. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం ఇలా పలు కారణాలవల్ల సుమారుగా 600కి పైగా విమానాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు 2026 ఫిబ్రవరి నాటికి ఈ సమస్య సద్దుమనుగుతుంది అని ఇండిగో స్పష్టం చేసింది..
అయితే ఈ రద్దు కారణంగా ఎంతోమంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న తర్వాత.. చెక్ ఇన్ పూర్తయి లోపలికి వెళ్ళాక ఫ్లైట్ రద్దు అవ్వడం లేదా ఆలస్యంగా బయలుదేరడం లాంటి కారణాలవల్ల ప్రయాణికులు ఇండిగో సిబ్బందిపై దాడులకు దిగుతున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండిగో సిబ్బందికి అండగా.. రియల్ హీరోగా పేరు సొంతం చేసుకున్న సోనూ సూద్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
సోనూసూద్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ రోజు ఉదయం ఒక వీడియో పంచుకున్నారు. అందులో ఆయన.." గత రెండు రోజులుగా ఇండిగో సర్వీసులలో అంతరాయం వల్ల అసౌకర్యం ఏర్పడుతోంది. నా కుటుంబ సభ్యులు కూడా దాదాపు 5 గంటల పాటు వేచి చూశారు. చివరికి విమానం బయలుదేరడంతో వారు తమ గమ్యస్థానానికి చేరుకున్నారు.. అయితే చాలా విమానాలు అలా బయలుదేరలేదు. చాలావరకు రద్దయ్యాయి. ప్రజలు సకాలంలో వివాహాలకు హాజరు కాలేకపోయారు. ఎన్నో బిజినెస్ సమావేశాలు మిస్సయ్యారు. విమానాల ఆలస్యం నిరాశను కలిగిస్తోంది. ముఖ్యంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులు సిబ్బందిపై అరుస్తున్నప్పుడు ఎలా స్పందించాలో అర్థం కాక గ్రౌండ్ స్టాఫ్ ఎదుర్కొంటున్న పరిస్థితి నన్ను కలచివేసింది.
నిరాశ , బాధతో ప్రయాణికులు తమ కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ సమయంలో మిమ్మల్ని మీరు వారి స్థానంలో ఒక్కసారి ఊహించుకోండి..వారు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వారికి కూడా విమానాలు బయలుదేరుతాయో లేదో కూడా తెలియని పరిస్థితి. పైనుంచి వచ్చే సందేశాలను మాత్రమే వారు మనకు తెలియజేస్తున్నారు. దయచేసి వారి పరిస్థితిని అర్థం చేసుకోండి. వారితో గౌరవంగా ఉండండి. విమాన రద్దు ప్రభావం వారిపై కూడా ఉంది. కాబట్టి దయచేసి ప్రయాణికులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను" అంటూ సోనూసూద్ తెలిపారు. ప్రస్తుతం ఆయన షేర్ చేసిన వీడియో వైరల్ అవ్వడంతో సిబ్బంది పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలని పలువురు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.