హీరోయిన్ పై భూ కబ్జా కేసు..!
తెలుగు సినిమాల్లోనే కాకుండా బాలీవుడ్ సినిమాల్లోనూ సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్‌గా సత్తా చాటిన హీరోయిన్ సోనాలీ బింద్రే.;
తెలుగు సినిమాల్లోనే కాకుండా బాలీవుడ్ సినిమాల్లోనూ సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్‌గా సత్తా చాటిన హీరోయిన్ సోనాలీ బింద్రే. తెలుగులో ఈమె నటించిన సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఈమెను ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. చిరంజీవి, మహేష్ బాబు వంటి స్టార్స్‌తో నటించిన కారణంగా ఈమె టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయింది. తెలుగు సినిమాలు చేసినా, చేయకున్నా సోనాలీ బింద్రే గురించి విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపించే తెలుగు వారు చాలా మంది ఉంటారు. అందుకే ఇప్పుడు ఆమెకు సంబంధించిన చిన్న విషయం ఒకటి తెలుగు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. సోనాలీ బింద్రే, ఆమె భర్త గోల్డి బెహల్ లు తన వ్యవసాయ భూమిని కబ్జా చేశారు అంటూ ఏకంగా పోలీసులను ఆశ్రయించాడు ఒక రైతు. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ మీడియాలోనే కాకుండా సౌత్ లోనూ ఆమెకు ఉన్న క్రేజ్ కారణంగా వైరల్ అవుతోంది.
సోనాలీ బింద్రే పై కేసు నమోదు...
ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే... పూణే కు చెందిన చంద్రకాంత్ అనే రైతు గత కొంత కాలంగా తన 30 గుంటల భూమి కోసం పోరాటం చేస్తున్నాడు. పలు సార్లు సోనాలీ బింద్రేను, ఆమె భర్తను కలిసేందుకు గాను ప్రయత్నాలు చేశాడు. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. తన భూమిని ఆక్రమించారు అంటూ స్థానికంగా ఉన్న పెద్ద వారి వద్ద మొరపెట్టుకున్న కూడా ఫలితం లేకుండా పోయిందట. అందుకే సదరు రైతు పోలీసులను ఆశ్రయించాడు. తనకు 1957 నుంచి వంశపారంపర్యంగా వస్తున్న భూమిని సోనాలీ బింద్రే ఆమె భర్త కబ్జా చేశారంటూ ఫిర్యాదు చేశాడు. తనను బెదిరించి ఆ భూమిని ఆక్రమించుకుని, ఆ భూమిలోకి కనీసం తనను అడుగు పెట్టకుండా చూస్తున్నారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చంద్రకాంత్ ఆరోపించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేయనున్నట్లుగా చెప్పారు. రెవెన్యూ అధికారులతో ఈ విషయమై పోలీసులు చర్చించే అవకాశాలు ఉన్నాయి.
రైతు భూమిని ఆక్రమించిన హీరోయిన్...
రైతు చంద్రకాంత్ చేస్తున్న ఆరోపణలపై హీరోయిన్ సోనాలీ బింద్రే స్పందించింది. తాను కొన్ని ఏ భూమిని అయినా చట్టబద్దంగా కొన్నామని, అందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు పూర్తి చేశామని చెప్పుకొచ్చింది. తన ప్రతిష్టను, తన కుటుంబ ప్రతిష్ఠను దెబ్బ తీయడం కోసం కొందరు ఆడుతున్న నాటకం ఇది అన్నట్లుగా ఆమె అసహనం వ్యక్తం చేసింది. తమపై ఆరోపణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయం అని ఆమె అన్నారు. ఈ భూమి విషయాన్ని తాము కోర్టులో తేల్చుకుంటామని, తమ వద్ద పూర్తి సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయని, ఆ భూమిని తాము చట్టబద్దంగా కొన్నట్టు నిరూపించుకుంటాం అన్నారు. తప్పకుండా ఈ విషయమై కోర్టులో మాకు న్యాయం జరుగుతుంది అనే విశ్వాసంతో ఉన్నట్లుగా హీరోయిన్ సోనాలీ బింద్రే చెప్పుకొచ్చింది.
భూకబ్జా ఆరోపణలు...
హీరోలు, హీరోయిన్స్ భూములు కొన్న సమయంలో ఇలాంటి వివాదాలు రావడం చాలా కామన్‌గా జరుగుతూ ఉంటాయి. కొన్ని సార్లు మధ్యవర్తులను గుడ్డిగా నమ్మడం ద్వారా సెలబ్రిటీలు మోస పోయిన దాఖలాలు ఉన్నాయి. భూముల విషయంలో పూర్తి సమాచారం లేని సెలబ్రిటీలు మధ్యవర్తులు చెప్పిన విషయాలను నమ్మి మోసపోతూ ఉంటారు. మరి రైతు చంద్రకాంత్ విషయంలో ఏం జరిగింది అనేది తెలియాలి అంటే పూర్తి స్థాయి విచారణ జరగాల్సి ఉంది. సోనాలీ బింద్రే వంటి పేరున్న సెలబ్రిటీ ఇలా భూ కబ్జాలకు పాల్పడటం అనేది జరగని విషయం అని, ఎక్కడో తప్పు జరిగి ఉంటుందని, ఆ తప్పు సోనాలీకి తెలిసి ఉండకపోవచ్చు అనేది కొందరు నెటిజన్లు మాట. కొందరు మాత్రం సెలబ్రిటీలు తమకు ఉన్న పేరు పలుకుబడిని ఉపయోగించి ఇలాంటి కబ్జాలకు పాల్పడుతున్నారు అంటూ విమర్శిస్తున్నారు. కోర్టు కు వెళ్తాను అన్న సోనాలీ బింద్రే తదుపరి స్టెప్ ఏంటి అనేది చూడాలి.