హైప్ ఉన్నా నో క్లారిటీ.. ఎందుకిలా?

సినిమాపై అంచనాలు పెంచడం ఎంత ముఖ్యమో.. వాటిని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒకసారి ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పెరిగితే దాన్ని కొనసాగించే బాధ్యత మూవీ టీమ్ దే.

Update: 2026-07-05 05:25 GMT

సినిమాపై అంచనాలు పెంచడం ఎంత ముఖ్యమో.. వాటిని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒకసారి ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పెరిగితే దాన్ని కొనసాగించే బాధ్యత మూవీ టీమ్ దే. పోస్టర్లు, గ్లింప్స్, పాటలు, మేకింగ్ వీడియోలు, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్లు.. ఇలా ఏదో ఒక అప్డేట్ ఇస్తుండాలి. కానీ ప్రస్తుతం టాలీవుడ్‌ లో కొన్ని భారీ చిత్రాల విషయంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. హైప్ మాత్రం ఉంది.. కానీ రిలీజ్‌ పై క్లారిటీ లేదు. దీంతో అభిమానుల్లో కన్ఫ్యూజన్ పెరుగుతోంది.

కొంతకాలంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న కొన్ని సినిమాలు ప్రారంభం నుంచి భారీ అంచనాలు సొంతం చేసుకున్నాయి. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్లు, విభిన్న కథలు, అద్భుతమైన విజువల్స్ అంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత మాత్రం అప్డేట్ల స్పీడ్ ఒక్కసారిగా తగ్గిపోయింది. సినిమా షూటింగ్ ఎక్కడివరకు వచ్చింది? పోస్ట్ ప్రొడక్షన్ ఎలా సాగుతోంది? విడుదల ఎప్పుడు? అనే ప్రశ్నలకు ఆనర్లు రావడం లేదు.

అందులో ముందుగా వినిపించే పేరు ఫౌజీ. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఆ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అప్పట్లో దసరాకు రిలీజ్ అని ప్రచారం జరిగింది. తర్వాత డిసెంబర్ విడుదల అనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు అనౌన్స్మెంట్ రాలేదు. దీంతో అభిమానులు ప్రతి అప్డేట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిరంజీవి నటిస్తున్న విశ్వంభర పరిస్థితి కూడా దాదాపు ఇదే.

సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. విజువల్ వండర్‌ గా తెరకెక్కుతున్న ఆ చిత్రం ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా.. పలుమార్లు విడుదల వాయిదా పడింది. తాజాగా దసరా విడుదల అనే ప్రచారం జరిగినా.. ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. సాయి దుర్గ తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు కూడా ఆసక్తికరమైన కాన్సెప్ట్‌ తో రూపొందుతోంది. హై రేంజ్ లో తెరకెక్కుతున్న ఆ మూవీపై హోప్స్ గట్టిగా ఉన్నా.. విడుదలపై ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారం బయటకు రాలేదు.

ఇక నిఖిల్ కెరీర్‌ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న స్వయంభూ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. పీరియాడిక్ నేపథ్యంలో రూపొందుతున్న ఆ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచినా.. విడుదల ఎప్పుడనే విషయంపై క్లారిటీ లేదు. అయితే సోషల్ మీడియా జెనరేషన్ లో ప్రేక్షకులు సినిమా కోసం మాత్రమే కాదు.. దాని జర్నీ కూడా ఫాలో అవుతున్నారు. నాన్ స్టాప్ గా అప్డేట్లు వస్తేనే ఆసక్తి కొనసాగుతుంది.

లేకపోతే హైప్ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఫ్యాన్స్ ప్రతి చిన్న అప్డేట్ కోసం ఎదురుచూస్తుంటారు. అందుకే ఇప్పుడు ఆయా సినిమాల విషయంలో అభిమానుల నుంచి ఒకటే డిమాండ్ వినిపిస్తోంది. కొత్త పోస్టర్ కావొచ్చు.. టీజర్ కావొచ్చు.. లేకపోతే విడుదల తేదీపై ప్రకటన కావొచ్చు.. ఏదైనా సరే క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. హైప్‌ ను సృష్టించడం ఒక్కటే కాదు.. దాన్ని నిలబెట్టుకోవాలని సూచిస్తున్నారు.

Tags:    

Similar News