ఆలోచనల్లో వచ్చిన మార్పులే విడాకులకు కారణం!
బాలీవుడ్ నటుడు , నిర్మాత సోహైల్ ఖాన్ - భార్య సీమా సజ్దేతో విడిపోవడానికి గల కారణాలపై తొలిసారి ఓపెన్ అయ్యారు.
బాలీవుడ్ నటుడు , నిర్మాత సోహైల్ ఖాన్ - భార్య సీమా సజ్దేతో విడిపోవడానికి గల కారణాలపై తొలిసారి ఓపెన్ అయ్యారు. ఓ ఇంటర్వ్యూలో సోహైల్ వ్యక్తిగత జీవితంపై ..బంధాలలోని సంక్లిష్టతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. దశాబ్దాల పాటు కలిసి ప్రయాణించిన తర్వాత విడిపోవాలనే నిర్ణయం తీసుకోవడం ఎవరికైనా బాధాకరమన్నారు. కానీ కొన్నిసార్లు జీవితంలో అలాంటి కఠిన నిర్ణయాలు అనివార్యమని పేర్కొన్నారు. తమ బంధం విచ్ఛిన్నం కావడానికి ఎవరినో ఒకరిని నిందించడం కంటే? ఇద్దరి ఆలోచనా దృక్పథాల్లో వచ్చిన మార్పులే ప్రధాన కారణమని పరోక్షంగా వెల్లడించారు.
వ్యక్తిగత ఎదుగుదల .. భిన్నమైన అభిప్రాయాలు ఒకే గొడుగు కింద జీవించడాన్ని కష్టతరం చేశాయని అభిప్రాయపడ్డారు. విడాకులు తీసుకోవడం అనేది కేవలం చట్టపరమైన ప్రక్రియ మాత్రమే కాదని అది ఇద్దరు వ్యక్తుల భావోద్వేగ ప్రయాణానికి సంబంధించిన ముగింపు అని సోహైల్ అభిప్రాయపడ్డారు. పిల్లల పట్ల తమ బాధ్యతను, ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవాన్ని మాత్రం తాము వదులుకోలేదన్నారు. విడిపోయినా? ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతుందని.. పిల్లల భవిష్యత్తు కోసం తాము కలిసి నిర్ణయాలు తీసుకుం టామన్నారు.
సెలబ్రిటీల జీవితంలో వ్యక్తిగత విషయాలు ప్రజల్లో చర్చకు రావడం సహజం. అయితే సోహైల్ ఈ విషయాన్ని హుందాగా ఎదుర్కోవడం పట్ల నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. సంబంధం ముగిసినంత మాత్రాన వ్యక్తుల మధ్య ద్వేషం ఉండాల్సిన అవసరం లేదని.. విడిపోవడం కూడా పక్వతతో కూడిన నిర్ణయం కావొచ్చని సోహైల్ మాటల ద్వారా నిరూపించారు. నిజాయితీగా తన మనసులోని భావాలను పంచుకోవడం ద్వారా సోహైల్ చాలా కాలంగా నెలకొన్న ఊహాగానాలకు తెరదించారు. ఎన్నో రకాల అపోహలకు నేటితో పుల్ స్టాప్ పెట్టారు.
ప్రస్తుతం సోహైల్ తన కెరీర్ ..పిల్లల ఆలనాపాలనపై దృష్టి సారించారు. సీమా సజ్దే కూడా వృత్తిపరమైన జీవితంలో బిజీగా ఉన్నారు. విడిపోయిన తర్వాత కూడా ఎవరి మార్గంలో వారు గౌరవప్రదంగా జీవించడం, నేటి కాలంలో ఆధునిక సంబంధాలకు ఓ ఉదాహరణగా నిలుస్తోంది. ఇద్దరూ గతాన్ని వదిలేసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నారు. సాధారణంగా చాలా మంది సెలబ్రిటీల్ని విడాకులకు కారణాలపై స్పందించడానికి ఎంత మాత్రం ఇష్టపడరు.
వాటిపై ప్రశ్నలు తలెత్తినా? తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తారు. కానీ సోహైల్ ఖాన్ మాత్రం ఎంతో హుందాగా బధులిచ్చారు. బాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పటికే చాలా మంది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అగ్ర హీరోల నుంచి చిన్న హీరోల వరకూ వివాహ బంధాలకు మధ్యలోనే ముగింపు పలికారు. అదే విడాకుల కుంపటి సౌత్ లో తెరపైకి వస్తే జరిగే రచ్చ..చర్చా ఏ స్థాయిలో ఉంటుందో ఊహకి కూడా అందదు.