CM విజయ్‌తో `బాపు బొమ్మ` స్నేహ.. సకుటుంబ సపరివార సమేతంగా!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అభినయనేత్రిగా, `బాపు బొమ్మ`గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి స్నేహ.

Update: 2026-06-09 18:54 GMT

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అభినయనేత్రిగా, `బాపు బొమ్మ`గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి స్నేహ. బాపు దర్శకత్వంలో వచ్చిన `రాధాగోపాళం`చిత్రంలో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రజలను అలరించిన ఈ బ్యూటీ అంతకుముందు టాలీవుడ్‌లో ఎన్నో క్రేజీ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా స్నేహ నవ్వుకు ప్రత్యేకమైన అభిమానగణం ఉంది. వివాహం తర్వాత సినిమాలకు కొద్దిగా దూరమైన ఈ భామ, సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి పాత్రలు వస్తేనే నటిస్తూ ఎక్కువగా తన ఫ్యామిలీ లైఫ్‌కే ప్రాధాన్యతనిస్తున్నారు. అయితే ఇటీవల ఎలాంటి చడీచప్పుడు లేని స్నేహ.. తాజాగా సకుటుంబ సపరివార సమేతంగా వార్తల్లో నిలిచారు.

నటుడిగా ఏలి త‌ర్వాత‌ రాజకీయ నేతగా మారి, తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్‌ను నటి స్నేహ తన కుటుంబంతో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సీఎం విజయ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం నాడు నటి స్నేహ... ఆమె భర్త, నటుడు ప్రసన్న తమ పిల్లలతో కలిసి ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సద్భావన భేటీకి సంబంధించిన ఫోటోలను స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో షేర్ చేసారు.

ముఖ్యమంత్రితో జరిగిన ఈ సమావేశంపై స్నేహ సామాజిక మాధ్యమాల్లో ఎంతో హృద్య‌మైన‌ సందేశాన్ని రాసుకొచ్చారు. విజయ్ సార్‌తో కలిసి గతంలో రెండు సినిమాల్లో పనిచేశాను. ఈరోజు ఆయనను సీఎం జోసెఫ్ విజయ్ హోదాలో చూడటం నిజంగా నన్ను ఎంతో ఉద్వేగానికి, ఆనందానికి గురిచేస్తోంది. కొన్ని క్షణాలు మనల్ని మాటలు రానివ్వకుండా నిర్వేదంలో ముంచెత్తుతాయి! అంటూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. విజయ్ కథానాయకుడిగా నటించిన `వశీగర` (2003).. ఆయన రాజకీయాల్లోకి రాకముందు నటించిన చివరి చిత్రాలలో ఒకటైన `ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` (2024) సినిమాల్లో స్నేహ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.

సినిమా రంగం నుండి రాజకీయాల‌లో విజ‌యం వైపు విజయ్ ప్ర‌యాణించిన‌ తీరుపై స్నేహ ప్రశంసలు కురిపించారు. ``ఆయన ప్రయాణం, సాధించిన వృద్ధి.. సంపాదించుకున్న గౌరవం నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం. అయితే వీటన్నింటికంటే నన్ను బాగా ఆకట్టుకున్న విషయం ఏమిటంటే.. నేను గతంలో చూసిన అదే వినమ్రత, దయాగుణం, ఒదిగి ఉండే తత్వం ఆయనలో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. విజ‌య్ స‌ర్ కు మరిన్ని శక్తులు, విజయాలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను`` అని స్నేహ ఆకాంక్షించారు. మరోవైపు స్నేహ భర్త ప్రసన్న ఇప్పటివరకు విజయ్‌తో కలిసి నటించక‌పోయినా.. సీఎం హోదాలో ఉన్న ఆయనను కలిసి అభినందనలు తెలపడం విశేషం.

ఈ ప్రత్యేక భేటీలో స్నేహ, ప్రసన్నల పిల్లలు కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి విజయ్ వారి పిల్లలను ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని హగ్ చేసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే కోలీవుడ్ సీనియర్ నటులు ఎంఎస్ భాస్కర్, పార్తీపన్, ప్రభు, విక్రమ్ ప్రభు వంటి వారు కూడా సీఎం విజయ్‌ను కలిసి అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు. ఒకప్పటి సహనటుడు నేడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తుంటే ఆయనను వెండితెరపై చూసిన ప్రేక్షకులు.. సినీ సహచరులు ఈ పరిణామాన్ని ఒక అద్భుతమైన ప్రయాణంగా అభివర్ణిస్తున్నారు.

Tags:    

Similar News