2 కోట్లలో 100 కోట్లు హిట్ ఇచ్చే టాలీవుడ్ డైరెక్టర్!
మరాఠీ, మాలీవుడ్, తమిళ ఇండస్ట్రీలో చిన్న సినిమాల సక్సెస్ తో ఎలా దూసుకుపోతున్నాయో చెప్పాల్సిన పనిలేదు.
మరాఠీ, మాలీవుడ్, తమిళ ఇండస్ట్రీలో చిన్న సినిమాల సక్సెస్ తో ఎలా దూసుకుపోతున్నాయో చెప్పాల్సిన పనిలేదు. కోటి రెండు కోట్లలోనే బలమైన కంటెంట్ తో సినిమా నిర్మించి 100 కోట్లు నమోదు చేసిన ట్యాలెంటెడ్ మేకర్స్ అక్కడ ఉన్నారు? అన్నది కాదనలేని నిజం. కానీ టాలీవుడ్ లో మాత్రం ఇంకా అలాంటి ఒక హిట్ పడలేదనే చెప్పాలి. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే.. ఇతర ప్రాంతీయ పరిశ్రమలైన మరాఠీ, బాలీవుడ్, తమిళ , మలయాళ చిత్రసీమలను పరిశీలిస్తే తక్కువ వ్యయంతో అద్భుతాలు సృష్టించిన ఉదాహరణలు ఎన్నో కనిపిస్తాయి.
నాగార్జుజ్ మంజులే దర్శకత్వంలో మరాఠీలో వచ్చిన `సైరాట్` అత్యల్ప బడ్జెట్‌తో రూపొంది 100 కోట్ల మార్కును అధిగమించి కొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల బాలీవుడ్‌లో 2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఆధ్యాత్మిక డ్రామా `హనుమాన్ అంశ్` ఎలాంటి ప్రమోషన్లు లేకుండా మౌత్ టాక్‌తో ఏకంగా 100 కోట్లకు పైగా వసూలు చేసింది. మలయాళంలో `మంజుమ్మెల్ బాయ్స్`, కన్నడలో `కాంతార` వంటి సినిమాలు కూడా తక్కువ పెట్టుబడితో 100 కోట్ల క్లబ్‌ను హస్తగతం చేసుకున్నవే.
తెలుగు సినిమా విషయానికి వస్తే 100 కోట్ల మైలురాయిని అందుకోవడంలో పరిశ్రమ ఏమాత్రం వెనుకబడలేదు. `మగధీర`తో మొదలైన ప్రయాణం `బాహుబలి`, `పుష్ప`, `ఆర్‌ఆర్‌ఆర్` వంటి పాన్-ఇండియా సినిమాలతో వెయ్యి కోట్ల క్లబ్ వరకు చేరింది. అయితే ఈ బ్లాక్‌బస్టర్లన్నీ భారీ బడ్జెట్‌లు, బిగ్ స్టార్ కాస్ట్ , అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందినవే. చిన్న సినిమాల విభాగంలో `కార్తికేయ 2`, `హను-మాన్`, `బేబి` వంటి చిత్రాలు మంచి లాభాలను తెచ్చిపెట్టినప్పటికీ వాటి బడ్జెట్ మాత్రం 10 కోట్ల నుండి 30 కోట్ల పరిధిలో ఉంది.
టాలీవుడ్‌లో తక్కువ బడ్జెట్‌తో అత్యధిక లాభాలు తెచ్చిన చిన్న చిత్రాలకు కొదవ లేదు. `పెళ్లి చూపులు`, `జాతి రత్నాలు`, `బలగం`, `కమిటీ కుర్రోళ్లు` వంటి సినిమాలు కొన్ని కోట్లలోనే రూపొంది భారీ విజయాన్ని అందు కున్నాయి. అయితే 2 కోట్ల అతి చిన్న వ్యయంతో ఏకంగా 100 కోట్ల వసూళ్ల మార్కును అధిగమించే స్థాయి విజయం మాత్రం టాలీవుడ్ చరిత్రలో ఇప్పటివరకు నమోదు కాలేదు. దీనికి ఇక్కడి మార్కెట్ నిర్మాణం, థియేటర్ల వ్యవస్థ ,ప్రమోషన్ ఖర్చులు కూడా ప్రధాన కారణాలుగా మారుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ రికార్డు సాధించాలంటే టాలీవుడ్‌కు కొత్త ఆలోచనా విధానం ఉన్న దర్శకుడు కావాలి. భారీ బడ్జెట్లు, విజువల్ గ్రాఫిక్స్ పైనే ఆధారపడకుండా కథలో ఉండే భావోద్వేగాలు, బలమైన నేటివిటీ కథాంశాన్ని ఎంచుకునే దర్శకుడికే ఇది సాధ్యమవుతుంది. 2 కోట్ల బడ్జెట్‌తో తీసినా? ఆ కథలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ప్రజలను కట్టిపడేసే దమ్ము ఉంటే భాషా సరిహద్దులతో సంబంధం లేకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఇతర పరిశ్రమల విజయాలు నిరూపిస్తున్నాయి.
మారిన నేటి ఓటీటీ .. సోషల్ మీడియా యుగంలో కంటెంట్ బాగుంటే చిన్న సినిమా అయినా ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుంది. తెలుగు పరిశ్రమలో ప్రతిభావంతులైన యంగ్ డైరెక్టర్లకు కొదవ లేదు. ఈ నేపథ్యంలో 2 కోట్ల బడ్జెట్‌తో 100 కోట్ల వసూళ్ల మ్యాజిక్ చేసే ఆ టాలెంట్ ఉన్న దర్శకుడు వెలుగులోకి రావాలని.. తెలుగు సినిమా సత్తాను మరోసారి సరికొత్త కోణంలో ప్రపంచానికి చాటిచెబుతాడని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.