సెట్లో గ్యాస్ సిలండర్ పేలి టెక్నీషియన్ మృతి, పలువురికి గాయాలు!
ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్.జె. సూర్య సుదీర్ఘ విరామం తర్వాత మెగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `కిల్లర్`.
ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్.జె. సూర్య సుదీర్ఘ విరామం తర్వాత మెగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `కిల్లర్`. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సెట్స్‌పై తాజాగా ఒక ఊహించని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నైలోని ఒట్టేరి ప్రాంతంలో జరుగుతున్న షూటింగ్‌లో గ్యాస్ బెలూన్ సిలిండర్ పేలడంతో ఒక యువ టెక్నీషియన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటనతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. తాజా సమాచారం మేరకు ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణను తాత్కాలికంగా ఆపేశారు.
బుధవారం తెల్లవారుజామున సుమారు 3:30 గంటల ప్రాంతంలో ఒట్టేరిలోని బి అండ్ సి మిల్లు ప్రాంగణంలో ఒక ముఖ్యమైన షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో సెట్స్‌లో వంద మందికి పైగా సాంకేతిక నిపుణులు, కార్మికులు పనిచేస్తున్నారు. హఠాత్తుగా గ్యాస్ బెలూన్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోవడంతో సెట్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ ప్రమాదంలో మధురవాయల్‌కు చెందిన టెక్నీషియన్ మదన్ (26) ఘటనా స్థలంలోనే మరణించాడు. అలాగే కుండ్రత్తూరుకు చెందిన శక్తివేల్ (27), సూర్య (23), దినకరన్ (24)లు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే తోటి చిత్ర బృందం సభ్యులు అప్రమత్తమై బాధితులను రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మదన్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మిగిలిన ముగ్గురు క్షతగాత్రులకు ప్రస్తుతం ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఒట్టేరి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. షూటింగ్ సమయంలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలోనే ఎస్.జె. సూర్య సైతం పాలవాక్కంలో ఒక రోప్ స్టంట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా కాలుకు బలమైన గాయాలై కుట్లు పడిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రం ద్వారా ఎస్.జె. సూర్య దాదాపు 11 ఏళ్ల తర్వాత (2015లో వచ్చిన `ఇసై` చిత్రం తర్వాత) మళ్లీ దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ఆయనే స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. గతంలో `అన్బే ఆరుయిరే` వంటి చిత్రానికి కలిసి పనిచేసిన ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ ప్రాజెక్ట్ కోసం మళ్లీ ఎస్.జె. సూర్యతో చేతులు కలపడం విశేషం. ఈ సినిమాలో ప్రీతి అస్రాని కథానాయికగా నటిస్తుండగా.. మిగిలిన నటీనటుల వివరాలను చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. నాలుగైదు నెలల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావించారు. కానీ తాజా ఘటన పెద్ద విషాదం.
వాలీ, ఖుషీ, నాని, న్యూ, అన్బే ఆరుయిరే వంటి వైవిధ్యభరితమైన బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఎస్.జె. సూర్యకు ఇది 10వ దర్శకత్వ చిత్రం. గత కొన్ని ఏళ్లుగా ఆయన నటుడిగా బిజీగా ఉంటూ ఇటీవల వీర ధీర శూరన్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ వంటి చిత్రాలతో అలరించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సర్దార్ 2 చిత్రీకరణ దశలో ఉంది. `కిల్లర్` సెట్స్‌లో ఇలాంటి విషాదం సినిమా వర్గాలను కలచివేస్తోంది.