సినీ పరిశ్రమలో జడ్జిమెంట్ గురించి వాపోయిన తెలుగమ్మాయి!
తెలుగమ్మాయి తేజస్వి మాదివాడ పరిచయం అవసరం లేదు. కెరీర్ పరంగా బో*ల్డ్ డెసిషన్స్ తో నిరంతర వార్తల్లో నిలిచే ఈ బ్యూటీకి ఇటీవలి కాలంలో ఆశించినంత ప్రోత్సాహం లభించలేదు.
తెలుగమ్మాయి తేజస్వి మాదివాడ పరిచయం అవసరం లేదు. కెరీర్ పరంగా బో*ల్డ్ డెసిషన్స్ తో నిరంతర వార్తల్లో నిలిచే ఈ బ్యూటీకి ఇటీవలి కాలంలో ఆశించినంత ప్రోత్సాహం లభించలేదు. ఈ విషయాన్ని అంగీకరించిన తేజస్వి, తాను ఆశించినది ఒకటి అయితే అయినది ఇంకొకటి అని కూడా అంగీకరించారు. నిజానికి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో `ఐస్ క్రీమ్` లాంటి తక్కువ కేటగిరీ సినిమా చేయడంతో తేజస్వి కెరీర్ ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడింది. ఈ విషయంపై చాలా స్పష్ఠంగా ఒకానొక ఇంటర్వ్యూలో ఓపెనైంది తేజస్వి. తాను రామ్ గోపాల్ వర్మతో పని చేసిన తర్వాత `ఈ పిల్ల మనకు వద్దు!` అని పరిశ్రమ వ్యక్తులు దూరం పెట్టారని తెలిపింది.
తేజస్వి తన కెరీర్ జర్నీ గురించి మాట్లాడుతూ..`సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రంలో తనను చూసాక.. క్యూట్ గా ఉంది అమ్మాయి! అంటూ వరుస అవకాశాలు వెంబడించాయని తెలిపారు. తక్కువ సమయంలోనే ఎక్కువ అవకాశాలు అందుకున్నానని వెల్లడించింది. 21 ఏళ్ల చిన్న వయస్సులోనే సినీ ప్రయాణాన్ని ప్రారంభించి... గూగుల్ రికార్డుల ప్రకారం 45 చిత్రాలు, 4 వెబ్ సిరీస్‌లు.. 10కి పైగా రియాలిటీ షోలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న విషయాన్ని వెల్లడించింది. అయితే ఆరంభంలో లభించిన ప్రోత్సాహం తదనంతర కాలంలో కరువైందనేది తన శ్రమ చివరికి వృధా అయిందని కూడా తేజస్వి తెలిపారు.
ఈ తెలుగమ్మాయి కెరీర్‌లో ఎదురైన అతిపెద్ద మలుపులు, సవాళ్లు ఏమిటంటే..తన ఎంపికల్ని బట్టి టాలీవుడ్ తనను ముందస్తుగా జడ్జ్ చేయడమే. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన `ఐస్ క్రీమ్` లాంటి సినిమాలో నటించిన తర్వాత.. సినీ పరిశ్రమలోని ప్రొడక్షన్ హౌస్‌లు - దర్శకులు `ఈ పిల్లతో వద్దు` అనే భావనకు వచ్చి దూరం పెట్టారని తేజస్వి స్వయంగా అంగీకరించింది. ఒక నటి ఎంచుకున్న ఒక్క పాత్ర ఆధారంగా లేదా ఒక సినిమా ఆధారంగా తన వ్యక్తిత్వాన్ని, నటనా సామర్థ్యాన్ని నిర్ణయించి అవకాశాలు నిరాకరించడం సినీ రంగంలోని జడ్జిమెంట్ నెగెటివిటీని స్పష్ఠం చేసిందని భావించాలి.
ఈ రకమైన ముద్ర వేసే ధోరణి ఒక నటి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఒక సినిమాలో నటించినందుకే లేదా ఒక వ్యాఖ్య చేసినందుకే ఒక వ్యక్తి క్యారెక్టర్ ఫలానా అంటూ ముద్రవేయడం ఎంతవరకు సమంజసమని తేజస్వి ప్రశ్నించడం వెనుక ఉన్న ఆవేదన అర్థం చేసుకోవాలి. మానవులు ఎల్లప్పుడూ మారుతూ, ఎదుగుతూ ఉంటారు. అని ఆమె చెప్పిన మాటలు.. సినీ పరిశ్రమలోని ఆలోచనా విధానంలో రావాల్సిన మార్పును ఎత్తిచూపుతున్నాయి.
అడ్డంకులు, విమర్శలు ఎదురైనా తేజస్వి వాటిని స్వీకరించిన తీరు తనలోని మానసిక పరిపక్వతను తెలియజేస్తుంది. పరిశ్రమ నుండి ఎదురైన తిరస్కరణ- ప్రతికూలత తనను తీవ్రంగా గాయపరిచినా.. అదే తన ఆలోచనా పరిధిని విస్తృతం చేయడానికి సహాయపడిందని ఆమె పేర్కొంది. ఈ చేదు అనుభవాలే తదనంతర కాలంలో తన వ్యక్తిగత ఎదుగుదలకు.. పరిణతికి ఎంతో దోహదపడ్డాయని ఒక సానుకూల కోణంలో తేజస్వి విశ్లేషించింది.
ఓవరాల్‌గా చూస్తే.. తేజస్వి మాదివాడ అనుభవం సినీ పరిశ్రమలోని అంతర్గత మోనోపలీని... ఔట్ సైడర్ నటీనటులకు ఎదురయ్యే జడ్జిమెంటల్ సవాళ్లను ప్రతిబింబిస్తుంది. విజయం వెనుక ఉండే గ్లామర్ మాత్రమే కాకుండా.. ఒక నటి ఎదుర్కొనే మానసిక సంఘర్షణలు, తిరస్కరణలను తట్టుకుని నిలబడే ధైర్యం ఎంత ముఖ్యమో ఈ ఉదాహరణ నిరూపిస్తోంది. పరిశ్రమ ఇప్పటికైనా కళాకారులను వారి ఒక్క నిర్ణయం ఆధారంగా కాకుండా... వారి నైపుణ్యం - ఎదిగే తీరు ఆధారంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.