మరణశిక్షకు కూడా రెడీగానే ఉన్నా: శివాజీ

ఒకవేళ మహిళా కమిషన్ తనకు మరణశిక్ష వేసినా, దాన్ని స్వీకరించడానికి తాను సిద్ధమేనని శివాజీ ఆవేదనగా మాట్లాడారు.;

Update: 2025-12-24 12:48 GMT

'దండోరా' ఈవెంట్ వివాదంపై నటుడు శివాజీ మరోసారి చాలా ఎమోషనల్ గా స్పందించారు. ఈ విషయం మహిళా కమిషన్ వరకు వెళ్లడం, తనపై వస్తున్న విమర్శల గురించి మాట్లాడుతూ, తాను చేసిన తప్పుకు ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని వ్యాఖ్యానించారు. అవసరమైతే మరణశిక్ష విధించినా తీసుకోవడానికి రెడీగా ఉన్నానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

అసలు ఈ విషయం ఇంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదని శివాజీ అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీలో ప్యానెల్ లో ఉన్న అందరూ తనకు తెలిసినవారేనని, తనను 'అన్నా' అని పిలుస్తుంటారని గుర్తుచేశారు. ఆ రోజు తన నోటి నుంచి ఆ మాట రాగానే, అక్కడే ఉన్నవాళ్ళు ఎవరైనా "ఏంటన్నా ఇది?" అని ఒక్క మాట అడిగి ఉంటే, అక్కడికక్కడే "సారీ అమ్మ పొరపాటు జరిగింది" అని చెప్పేవాడినని ఆయన అన్నారు. ఆ ఒక్క అవకాశం తనకు ఇచ్చి ఉంటే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నేరుగా మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయడంపై కూడా ఆయన స్పందించారు. సెలబ్రిటీల నుంచి ఇలాంటి మాటలు వచ్చినప్పుడు, అది సమాజ విలువలకు సంబంధించిన విషయం కాబట్టి మహిళా కమిషన్ కచ్చితంగా రియాక్ట్ అవుతుందని ఆయన అంగీకరించారు. అయితే తనను ఒక్క మాట అడగకుండానే అంత దూరం వెళ్లడం తనకు బాధ కలిగించిందని, కానీ తప్పు తన వైపు ఉంది కాబట్టి భరించక తప్పదని అన్నారు.

ఒకవేళ మహిళా కమిషన్ తనకు మరణశిక్ష వేసినా, దాన్ని స్వీకరించడానికి తాను సిద్ధమేనని శివాజీ ఆవేదనగా మాట్లాడారు. "అక్కడ ఏముంటది మహా అయితే.. నాకేమన్నా మరణశిక్ష వేయమంటే వేయించుకుంటాను.. నేను అంతకంటే ఏం చేస్తాను" అంటూ వ్యాఖ్యానించారు. జరిగిన దానికి బాధ్యత వహిస్తూ, ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన మాటల్లో స్పష్టమైంది.

తనకు ఎవరిపైనా ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవని శివాజీ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఎవరైనా ప్రశ్నిస్తే, తాను వాడిన ఆ రెండు పదాలు తప్పేనని ఒప్పుకుంటానని, వాటికి ఇప్పటికే క్షమాపణ చెప్పానని గుర్తుచేశారు. ఇంకా ఎవరైనా అడిగినా కూడా ఆ రెండు పదాల విషయంలో సారీ చెప్పడానికి వెనకాడనని స్పష్టం చేశారు.

చివరగా మనుషుల నైజం గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనందరికీ అన్నీ తెలుసు అని, బయట ఉన్నప్పుడు బూతులు తిట్టుకుంటాం కానీ కెమెరా ముందుకు రాగానే పద్ధతిగా ఉండాలని కోరుకుంటాం అని అన్నారు. అంతిమంగా మనమందరం మనుషులమే కదా, తప్పులు దొర్లడం సహజం అన్నట్టుగా వివరణ ఇచ్చారు.

Tags:    

Similar News